
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేయనున్నారు.
నిజానికి గడిచిన నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించి.. 3,09,083 మందిని అర్హులుగా తేల్చారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు.