
నిఘా నీడ.. డీలర్లకు దడ
శివార్లలో ‘బియ్యం కోటా’ మాయ..! పీడీఎస్ బియ్యంపై పెరిగిన నిఘా
స్టాక్ ఎత్తని రేషన్ డీలర్లు గిడ్డంగులు దాటని బియ్యం నిల్వలు
ఈ నెల పంపిణీపై అనుమానాలు సాంకేతిక ఇబ్బందులంటున్న అధికారులు
సిటీబ్యూరో: నగర శివార్లలోని పౌరసరఫరాల శాఖ గోదాములపై విజిలెన్స్ నిఘా పెరగడంతో డీలర్లలో దడ మొదలైంది. బియ్యం అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు, క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు బెంబేలెత్తిస్తుండడంతో గోదాముల నుంచి బియ్యం నిల్వలు కదలడం లేదు. ఆగస్టు ఒకటవ తేది నుంచి పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇప్పటి వరకు బియ్యం బస్తాలు చౌకధరల దుకాణాలకు చేరకపోవడం గమనార్హం. ఈనెల కోటాను ఈ-పీడీఎస్ ద్వారా పౌరసరఫరాల అధికారులు కేటాయించినా... డీడీలు కట్టి బియ్యం స్టాకును డ్రా చేసేందుకు డీలర్లు ముందుకు రావడంలేదు. ఒకవైపు గోదాముల్లో పుష్కలంగా బియ్యం నిల్వలున్నా.. డీలర్లు అనాసక్తి కనబర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.
డీలర్ల గుండెల్లో గుబులు..
పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నల్ల బజారుకు తరలుతుండడంతో నగర శివార్లలోని పౌరసరఫరాల గోదాములపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, టాస్క్‌ఫోర్స్ విభాగాల నిఘా పెరగడంతో రేషన్ డీలర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వాస్తవానికి ప్రతి నెల 25లోగా డీడీ లు చెల్లించి అవసరమైన మేర బియ్యం కోసం ఆర్డర్ పెట్టి డ్రా చేసుకొవాల్సి ఉంటుంది. కానీ ఇటీవల ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి నల్ల బజారుకు తరలిస్తుండడాన్ని సర్కారు పసిగట్టి నిఘా పెంచింది. అంతేకాదు ప్రతినెలా గోదాముల నుంచి నేరుగా సుమారు 50 శాతం కోటా పక్కదారి పడుతున్నట్లు పౌరసరఫరా శాఖ అధికారులు గుర్తించారు.
అక్రమాలిలా..
వాస్తవంగా డీలర్లు తమ కోటా కేటాయింపు జరగగానే డీడీ చెల్లించి సరుకులను డ్రా చేస్తారు. బియ్యం బస్తాలు చౌకధరల దుకాణాలకు సరఫరా చేసే సమయంలో స్టేజ్ టూ కాంట్రాక్టర్లతో డీలర్లు కుమ్మక్కై 50 శాతం బియ్యం బస్తాలను నల్ల బజారు తరలించి భారీ సొమ్ము చేసుకుంటారు.ఈనెల పీడీఎస్ బియ్యం సరఫరాపై నిఘా పెరగడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని డీలర్లు సరుకులు డ్రా చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
శివార్లలో పరిస్థితి ఇలా..
శివార్లలోని సరూర్‌నగర్, ఉప్పల్, బాలానగర్ సర్కిళ్ల పరిధిలో 688 దుకాణాల్లో సుమారు 6,25,113 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అందులో సుమారు 20, 02,405 యూనిట్లు (లబ్దిదారులు )ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మొత్తం 12.14 వేల టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఇందులో కేవలం 10 శాతం కోటాకు మాత్రమే డీలర్లు డీడీలు కట్టి ఆర్డర్ పెట్టినట్లు తె లిసింది. జూలై మాసం మిగులు కోటా వివరాలు కూడా డీలర్లు సమర్పించకపోవడం గమనార్హం. అయితే పౌరసరఫరా కార్పొరేషన్ అధికారులు మాత్రం మీ-సేవా సాంకేతిక కారణాలతో డీలర్ల నుంచి ఆర్వోలు అందలేదని పేర్కొంటుండడం గమనార్హం. శివారు ప్రాంతాలు మినహాయించి మిగతా ప్రాంతాల ఆర్వోలు పూర్తి స్థాయిలో వచ్చిన వైనంపై ‘సాక్షి’ సంబంధిత అధికారుల వివరణ కోరగా వారి నుంచి సరైన సమాధానం కరవైంది.