పాలకులం కాదు.. సేవకులం | CM YS Jagan Mohan Reddy holds Collectors meeting at Praja Vedika | Sakshi
Sakshi News home page

పాలకులం కాదు.. సేవకులం

Published Tue, Jun 25 2019 3:41 AM | Last Updated on Tue, Jun 25 2019 7:53 AM

CM YS Jagan Mohan Reddy holds Collectors meeting at Praja Vedika - Sakshi

కలెక్టర్ల సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం

అవినీతికి నో
ఎవరు చెప్పినా సరే అవినీతి, దోపిడీకి నో చెప్పండి. ఇసుక మాఫియాకు, పేకాట క్లబ్బులకు నో చెప్పండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల వినతులపై సానుకూలంగా స్పందించండి

వినతులపై రశీదులు... టైం బౌండ్‌
ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించండి. ప్రజలు ఇచ్చే వినతులకు రశీదులు ఇవ్వండి. వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వాటిపై గడువు నిర్దేశించండి. 

ఓటేయని వారు వచ్చేసారి మనకు ఓటేయాలి
ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ మనవారే. మనకు ఓటు వేయని వారిలో అర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించండి. మన ఎమ్మెల్యేలు చెప్పినా సరే వారికి పథకాలు నిరాకరించవద్దు. వారు కూడా మన పనితీరు నచ్చి వచ్చేసారి మన పార్టీకి ఓటేయాలి.

అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుంచే 
పర్యావరణ, నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన ‘ప్రజా వేదిక’లో ప్రభుత్వ యంత్రాంగం సమావేశాలు నిర్వహించడం ఏమిటి? చట్టాలను ప్రభుత్వమే బేఖాతరు చేస్తే ఎలా? అందుకే అక్రమ కట్టడాల కూల్చివేత ఈ ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభం కావాలి.  

కొత్తగా కట్టిన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో పరికరాలు ఉన్నాయో లేవో చూడండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించండి. వర్షాకాలం వస్తోంది కాబట్టి జ్వరాలు వస్తాయి. వెంటనే చర్యలకు ఉపక్రమించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు రాకుండా చూసుకోండి. 

మన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములే. నేను పై స్థాయిలో పాలన మొదలు పెడితే కింది స్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత మీది. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే కలెక్టర్లు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. 

ప్రజలకు హక్కుగా సేవలు అందించాలి. దాని కోసం ప్రజలు లంచాలు ఇవ్వకూడదు. ఆఫీసుల  చెట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. మన పని తీరు చూసే ప్రజలు మనకు ఓటేస్తారు. మనం అంటే మీరు, నేనూ కలిపి. మన పనితీరు అంటే నా పనితీరు, మీ పనితీరు. ఇదే ప్రామాణికం కావాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టోనే తమ ప్రభుత్వానికి జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. శాచ్యురేషన్‌ (సంతృప్తికర) విధానంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అంది తీరాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినాసరే వినొద్దని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు ఉండకూడదని లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్య, వైద్య రంగాలు తనకు అత్యంత ప్రాధాన్యతాంశాలని, పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఆసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తూ మాతా – శిశు మరణాలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తీసుకువద్దామని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో సోమవారం రెండు రోజుల ప్రారంభ సదస్సులో వారినుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను వారికి విశదీకరించారు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో మెరుగైన పాలన కోసం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను ఇలా వివరించారు. 

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం
మన మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో క్లుప్తంగా ఇచ్చాం. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో కాపీలు ప్రతి కలెక్టర్, హెచ్‌వోడీ, సెక్రటరీ, మంత్రుల వద్ద ఉండాలి. మేనిఫెస్టోను అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 175 మందిలో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. 25కు గాను 22 మంది ఎంపీలను గెలిపించారు. 50 శాతానికిపైగా ప్రజలు మనకు ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ రాలేదు. ఈ మేనిఫెస్టోనే జీవనాడి. దీంట్లోని ప్రతి అంశాన్ని మనం పూర్తి చేయాలి. రేపటి ఎన్నికల్లో మళ్లీ మనం ఇదే మేనిఫెస్టో చూపించి అన్నీ చేశాం కాబట్టి మాకు ఓటేయండి.. అని చెప్పే పరిస్థితి ఉండాలి. అందుకు మీ సహకారం చాలా కీలకం. 

ఎమ్మెల్యేల వినతులపై స్పందించండి
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలి. 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఒకర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. అదీ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతో స్వాగతించండి. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడూ చిరునవ్వుతో పలకరించండి. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. అదే సమయంలో అక్రమాలుగానీ దోపిడీగానీ దోచుకోవడం గురించిగానీ ఎవరు చెప్పినా ఈ ప్రభుత్వం సమర్థించదు. ఎంతటి పెద్దవారైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఉండనీ ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ఇవి కాకుండా మిగిలిన ఏ అంశంలో అయినా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోండి. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే మీరు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. 

పారదర్శకతలో దేశానికే ఆదర్శం కావాలి
ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీతో పని చేయాలి. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా అవినీతి ఉండకూడదు.  చెడిపోయిన వ్యవస్థ మారాలి అని నేను ఎన్నికల్లో ప్రతి సభలో మాట్లాడాను. సీఎం నుంచి కలెక్టర్‌ వరకు, కలెక్టర్‌ నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూసేలా మార్పు రావాలి. మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసేందుకు  మనం నమూనాగా ఉండాలి. మన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను సంతోషంగా ఉంచండి. లేకపోతే డెలివరీ నెట్‌వర్క్‌ సరిగా పని చేయదు. ప్రతి మూడో శుక్రవారం దిగువ స్థాయి ఉద్యోగులు, మనతో పని చేస్తున్న ఉద్యోగుల కోసం కేటాయించండి. కలెక్టర్లు సహా జిల్లాలోని ఐఏఎస్‌ అధికారులు వారంలో ఓ రోజు ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిద్రించండి. ఆకస్మిక పర్యటనలు చేయండి.

అప్పుడే అక్కడ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో తెలుస్తుంది. అక్కడ మరుగుదొడ్డి వాడుతున్నప్పుడు అవి సరిగా ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది. పిల్లలకు పుస్తకాలు సరిగా అందుతున్నాయో లేదో, ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారో లేదో తెలుస్తుంది. పొద్దున లేచాక అక్కడే స్నానం చేయండి. ఆ తర్వాత గ్రామ ప్రజలతో సమావేశం కండి. నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. హాస్టళ్లు, ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మీరు ఇప్పుడున్న పాఠశాలల ఫొటోలు తీయండి. రెండేళ్ల తరువాత వాటిని మారుస్తాం. అప్పుడు పాత ఫొటో, కొత్త ఫొటో రెండు ఫొటోగ్రాఫ్‌లు పోల్చి చూపించండి. విద్య, ఆరోగ్యం, రైతులు నా ప్రధాన అజెండా. మీరు ఆసుపత్రులు, హాస్టల్స్‌ విజిట్‌కు వెళ్లేటప్పుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల అధికారులను థర్డ్‌పార్టీగా కూడా తీసుకువెళ్లండి. దాంతో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. 


విశ్వసనీయత పెంచాలి
కలెక్టర్‌ చెస్తామన్నారంటే కచ్చితంగా అది జరిగి తీరాలి. కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టొద్దు. విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని పదే పదే చెబుతున్నా. ఒక పాలసీ తీసుకున్నాక తరతమ భేదం లేకుండా అందరికీ ఒకే విధానం ఉండాలి. నవరత్నాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలి. వాళ్లు మన పార్టీ అనో మరో పార్టీ అను చూడొద్దు. నాకు ఓటేశారో వేయలేదో అనేవి పట్టించుకోవద్దు. ప్రతి జిల్లాకు పోర్టల్‌ను తీసుకురండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి కలెక్టరేట్‌ వరకు పోర్టల్‌లో అన్ని వివరాలు ఉండాలి. జ్యుడిషియరీ, పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌.. ఇలా అన్నీ కూడా ఆ పోర్టల్‌లో పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆర్డర్‌ పోర్టల్‌లో ఉంటుంది. అలాగే జిల్లా పోర్టల్‌ కూడా ఉండాలి. ఇచ్చిన పని, దాని విలువ, కాంట్రాక్టర్, ప్రారంభించిన తేదీ, పూర్తి అయ్యే తేదీ.. ఇలా అన్ని వివరాలు పోర్టల్‌లో తెలియజేయాలి. అప్పుడే మనం పారదర్శకంగా ఉన్నామనే సందేశం కింది స్థాయికి వెళ్తుంది. ప్రభుత్వ భూములు ఆడిట్‌ చేయండి. దాంతో ఎంత భూమి అందుబాటులో ఉండేదీ, దాన్ని ఎలా వాడుకోవాలన్నది తెలుస్తుంది. 

గ్రామ వలంటీర్ల వ్యవస్థలో అవినీతికి నో
ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు తీసుకు రావడానికి శాచ్యురేషన్‌ విధానాన్ని తెస్తున్నాం. ఇందు కోసం గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకు వస్తున్నాం. ప్రతి 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సెక్రటేరియట్‌ తెస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వలంటీర్‌ వ్యవస్థలో ఎక్కడా అవినీతి ఉండకూడదు. వివక్ష చూపకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ వలంటీర్‌ ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి చేయకూడదనే గ్రామ వలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఇస్తున్నాం. గ్రామ వలంటీర్లు పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవ్వరు చెప్పినా సరే చర్యలు ఆగవు. నేరుగా  సీఎం కార్యాలయంలోనే కాల్‌ సెంటర్‌ పెట్టాం. 

పేదల ఆత్మగౌరవం పెంపొందించాలి
కలెక్టర్లు కచ్చితంగా విస్మరించకూడని వర్గాలు పేద ప్రజలు. అట్టడుగున ఉన్న పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతుల  స్థితిగతులు విస్మరించకూడదు. ఈ వర్గాల ఆత్మగౌరవం పెరగాలి. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలబడాలి. మనం వేసే ప్రతి అడుగూ వారికి దగ్గర కావాలి. ఇందుకోసమే మనం నవరత్నాల పథకాలు ప్రకటించాం. నవరత్నాలు అమలు చేసినప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు ఇవేవీ చూడొద్దని స్పష్టం చేస్తున్నా.

ఉగాదికి ఇంటి స్థలం లేనివారు ఉండకూడదు
వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు. ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్‌ చేస్తాం. ప్రతి గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు లేవు.. ఎంత మందికి ఇవ్వాలి.. అనేది గుర్తించండి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయండి. నేను చాలా చోట్ల గమనించాను.. నాకు ఇక్కడ ఇచ్చారు అని చెబుతున్నారు కానీ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలీదని చెబుతున్నారు. పట్టా ఉంటుంది కానీ ప్లాట్లు కనిపించవు. సీఆర్‌డీయే పరిధిలో రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఉగాది రోజున రాష్ట్రంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ పెద్ద పండుగలా జరగాలి. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. ఎలుకలు కొరకడం, టార్చ్‌ లైట్‌లో ఆపరేషన్లు చేయడం వంటివి ఉండకూడదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బకాయిలు వెంటనే తీర్చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి. తొమ్మిది  నెలలుగా ఇవ్వడం లేదు. ఆ బకాయిలు వెంటనే చెల్లించండి. మాతా – శిశు మరణాలు నివారించాలి. ఆసుపత్రుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్లు వెంటనే వాటిపై నివేదిక తయారు చేసి పంపాలి. కుష్టు వ్యాధి మళ్లీ కనిపిస్తోంది. నేను పాదయాత్రలో ఓ చోట చూశాను. కుష్టు వ్యాధి నివారణపై దృష్టిపెట్టాలి. మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టండి. అవసరమైతే వారికి పింఛన్‌ ఇవ్వండి. 

ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి
నిత్యావసరాలను ప్రజలకు పౌర సరఫరాల శాఖ నుంచే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం నాణ్యత బాగో లేదు. అందుకే గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేసిన పరిస్థితి చూశాం. తిరిగి అవే బియ్యం పాలిష్‌ చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితీ చూశాం. ప్రజలు వినియోగించేవాటినే మనం ఇవ్వాలి. ఒక వైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ మరోవైపు ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఎన్నికల స్కీంలకు మళ్లించింది. ఆ రూ.వెయ్యి కోట్లను రైతులకు చెల్లించాలి. 

ప్రభుత్వం అంటే గౌరవం పెంచాలి
చంద్రగిరి ఎస్‌వీవీ నర్సింగ్‌ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని నాకు ఒక లెటర్‌ వచ్చింది. నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరే ఫ్యాకల్టీ ఉన్నారట. భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలేనట. సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఎవరైనా చూశారా? అక్రమం ఏదైనా జరిగితే.. దాన్ని కూల్చేయండి. ప్రభుత్వం అంటే పారదర్శకతకు ప్రతిరూపమని చెప్పండి. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను తప్పు అని తెలిసినా కొన్నారు. అనర్హత వేటు వేయాలని చెప్పినా ఆ పని చేయలేదు.  అందులో నలుగురిని మంత్రులను చేశారు. ఇదే ఐఏఎస్‌ల మీద అధికారం చలాయించాలని వారికి అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి మీరు ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారు? కౌన్సిలర్లను ఎత్తుకుపోతారు. కట్టడిచేయాల్సిన మీరు పైస్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా ఉంటే ఎలా కట్టడి చేయగలరు? మనం కచ్చితంగా మారాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే అభిమానం పెరగాలి. 

మీదైన ముద్ర వేయండి
లబ్ధిదారుల జాబితా పంచాయతీ స్థాయిలో తయారు కావాలి. దీని వల్ల పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. వలంటీర్లు మీకు కళ్లు, చెవులుగా ఉంటారు. మనం మార్పు తీసుకురావాలి. దీనికి తపన ఉండాలి. మీదైన ముద్ర ఉండాలి. జిల్లా నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాకు సన్నిహితులైన కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో చర్చించాను. ఇవి చేయగలిగితే మనం మార్పులు సాధించగలం అని సూచించారు. నా తండ్రి మాదిరిగా చనిపోయిన తర్వాత కూడా నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయపడుతున్నా. అలాగే మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మీరు మీకున్న పరిజ్ఞానంతో వాటికి మెరుగులు దిద్దొచ్చు.  

గ్రామ సచివాలయాలు అయ్యాక రచ్చబండ
గ్రామ సచివాలయాలు వచ్చాక నేను కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాను. నేనూ నా స్థాయిలో కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్‌ చేస్తాను. మీ స్థాయిలో మీరూ కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్‌ చేయండి. నెలకోసారి కచ్చితంగా ర్యాండమ్‌ చెక్‌ చేయండి. దాంతో ఆ పని కచ్చితంగా చేయాలి అనే పరిస్థితి వస్తుంది. రశీదులు ఇచ్చి పట్టించుకోలేదనే పరిస్థితి రాకూడదు.

అవినీతి అంతానికే ప్రక్షాళన
నా 3,648 కి.మీ. పాదయాత్రలో గ్రామాల్లో ఏం జరుగుతోందో విన్నాను. నా కళ్లతో చూశాను. పింఛన్‌ కావాలంటే మొట్టమొదట అడిగే మాట.. మీరు ఏ పార్టీకి ఓటేశారని. నాకు ఎంత ఇస్తారని. డెత్‌ సర్టిఫికెట్‌కు, బర్త్‌ సర్టిఫికెట్‌కు, మట్టి, ఇసుక, చిన్న బీమాకు.. పెద్ద బీమాకు లంచం. చివరికి బాత్‌రూమ్స్‌ మంజూరు కావాలన్నా లంచాలు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అంటేనే అవినీతి అనే పరిస్థితి తీసుకువచ్చారు. నీటిపారుదల శాఖ పనులు, రోడ్లు, సచివాలయ నిర్మాణం, ప్రతి చోటా అవినీతి. దీన్ని మార్చడానికి పైస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాం. అందుకోసం రివర్స్‌ టెండరింగ్‌ తెస్తున్నాం. అంటే రూ.100 పని రూ.80కే అవుతుందని అనుకుంటే రివర్స్‌ టెండరింగ్‌. తక్కువకు ఎవరు కోట్‌ చేస్తారో వారికే పనులు అప్పగిస్తాం.

ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేస్తాం. రూ.100 పని రూ.75కే చేస్తారా.. అని అడుగుదాం. ఇందులో ఏ ఒక్క రూపాయి మిగిలినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేద్దాం. నాణ్యత, పారదర్శకత పాటిద్దాం. నా స్థాయిలో నేను, మీ స్థాయిలో మీరు నిర్ణయాలు తీసుకుంటే మార్పు వస్తుంది. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నేనే స్వయంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను అడిగాను. రూ.100 కోట్లు పైచిలుకు హైవాల్యూ కాంట్రాక్టు పనులు నేరుగా జ్యుడిషియల్‌ కమిషన్‌కు వెళతాయి. వారం రోజల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్‌ ప్రతిపాదనలను జడ్జిగారు పెడతారు. దీనిపై జడ్జి గారికి సలహాలను కూడా ఇవ్వొచ్చు. జడ్జి గారు ఈ సలహాలు తీసుకుని, సాంకేతిక కమిటీ సహాయంతో ప్రభుత్వానికి మార్పులను సూచిస్తారు. సాంకేతిక కమిటీకి అయ్యే ఖర్చును మనమే భరిస్తాం. ఆ తర్వాతే టెండర్లు పిలుస్తాం. పారదర్శకతను ఆ స్థాయికి తీసుకువెళ్తాం. 

ఇక్కడి నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత 
ఇవాళ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనం చూడాలి. మనం ఇక్కడ ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యాం. ఈ సమావేశం జరుగుతున్న ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌వోడీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు. ఈ భవనం లీగల్‌గా, చట్టపరంగా సరైనదేనా? అంటే కాదు. నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అవినీతితో కట్టిన భవనం ఇది. అలాంటి ఒక అక్రమ నిర్మాణంలో మనం సమావేశం పెట్టుకున్నాం. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు. కానీ ఈ బిల్డింగ్‌ ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. గ్రీవెన్స్‌ హాల్‌ ఇక్కడ కట్టొద్దని కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టం పట్టించుకోలేదు. లోకాయుక్త సిఫార్సులు కూడా పట్టించుకోలేదు. చివరికి దీని నిర్మాణంలో కూడా అవినీతే. భవనం నిర్మాణ వ్యయం అంచనాలు కూడా రూ.5 కోట్ల నుంచి రూ.8.90 కోట్లకు పెంచారు. ఇది చూపించడానికే, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకోడానికే ఇక్కడ మీటింగ్‌ పెట్టండని చెప్పాను.

ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలు...అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండీ బేఖాతర్‌ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేసి ఉంటే మనం ఏం చేసేవాళ్లం? ఎందుకు అక్రమ నిర్మాణం చేపట్టారని అడిగేవాళ్లం. అక్కడకు వెళ్లి ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం. కానీ మనమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రూల్స్‌ను నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మనమే ఈ స్థాయిలో నియమాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ కింది స్థాయికి ఎటువంటి సందేశం పంపుతున్నట్లు? మనం సరైన మార్గంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరూ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఇందుకోసమే నాతో సహా అందర్నీ ఇక్కడకు రమ్మన్నాను. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో మనం చూడాలి. ఈ హాలు నుంచే మనం ఆదేశాలు ఇస్తున్నాం. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్‌ అని చెబుతున్నా. రేపు జిల్లా ఎస్పీలతో సమావేశం తర్వాత రాష్ట్రంలో మొదటి అక్రమ కట్టడం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. మనం ఆదర్శంగా నిలిచిపోవాలి. మీమీ జిల్లాలకు వెళ్లినప్పుడు  పరిశీలించి ఇలానే  చేయండి.

తల్లులను ప్రోత్సహించేందుకే  అమ్మ ఒడి 
మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం ఉంది. జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ. అందుకే పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం పెట్టాం. పిల్లలను ఏ పాఠశాలకు పంపినా తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. పాఠశాలల ఇప్పుడున్న పరిస్థితిపై ఫొటోలు తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నీచర్, ప్రహరి, బాత్‌రూమ్స్‌ అన్నింటినీ బాగు చేస్తాం. ప్రతి పాఠశాలను ఇంగ్లిష్‌ మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేస్తాం. యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలో ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాం జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడికి కూడా ప్రైవేట్‌ స్కూల్‌కు పోవాలన్న ఆలోచన రాకూడదు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకువస్తాం.


కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం. ప్రైవేట్‌ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవే కానీ డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యా సంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు. ఇది సేవ మాత్రమే. జనవరి 26 నుంచి ‘అమ్మ ఒడి’ చెక్కులు పంపిణీ చేస్తాం. యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం. ప్రైవేట్‌ స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి. నియమ నిబంధనలు రూపొందించి మినహాయింపులు ఏమైనా ఉంటే దానిపై కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌ కచ్చితంగా అమలు చేయాలి. 

72 గంటల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి
గ్రామ సచివాలయంలో 10 మందిని కొత్తగా తీసుకోండి. వ్యవసాయ నేపథ్యం ఉన్న వారికి గ్రామ సచివాలయంలో అవకాశం ఇవ్వండి. వీరిని ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానించండి. ప్రజలు పింఛన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డ్‌ కావాలన్నా, ఏది కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తారు. 72 గంటల్లో దాన్ని పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించండి.  ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ల్యాబ్‌ను పెట్టాలి. భూ పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు.. ఇవన్నీ కూడా ఇందులో భాగం కావాలి. రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు గ్రామ సచివాలయం ద్వారా విక్రయిస్తాం. గ్రామ వలంటీర్ల డ్యూటీ డెలివరీతో నిలిపి వేయకూడదు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నాసరే గ్రామ సచివాయలం దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేలా చూడాలి. గ్రామ వలంటీర్లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement