అందరికీ తీపి కబురు | YS Jagan Marvelous Decisions In the First Cabinet Meeting | Sakshi
Sakshi News home page

అందరికీ తీపి కబురు

Published Tue, Jun 11 2019 4:56 AM | Last Updated on Tue, Jun 11 2019 8:26 AM

YS Jagan Marvelous Decisions In the First Cabinet Meeting - Sakshi

ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఆచరణలో చూపించారు. నవరత్నాల పథకాల అమలుకే అగ్రప్రాధాన్యమని మంత్రులకు తేల్చిచెప్పారు. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిజానికి ఎన్నికల హామీల అమలుకు ఐదేళ్ల సమయం ఉన్నా.. ఆయన ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించకుండా కార్యాచరణ ప్రారంభించారు. మంత్రివర్గ తొలి సమావేశంలోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక భారం అవుతుందేమోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలకు మేలు చేయడం కంటే ఏదీ ముఖ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యాలుగా తమ ప్రభుత్వ అజెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిరోజుల్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు తీపి కబురును అందించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వందలాది హామీలను చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాగ్దానాల అమలుకు తొలి సంతకంతో శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతలా పవిత్రంగా భావించి అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్‌ జగన్‌.. తొలి కేబినెట్లోనే మేనిఫెస్టో హామీల్లో అత్యధికం అమలు ప్రారంభించారు. కేబినెట్‌ నిర్ణయాల పట్ల అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.      
– సాక్షి, అమరావతి

రూ.12,500 రైతు కుటుంబానికి ఏటా పెట్టుబడి సాయం  
మేనిఫెస్టోలో ఏముంది

ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఐదేళ్లలో రూ. 50 వేలు ఇస్తాం. మే నెలలోనే రూ.12500 ఇస్తాం. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు. రైతులకు ఉచితంగా బోర్లు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.

కేబినెట్‌ నిర్ణయం
వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పగా ఈ రబీ సీజన్‌ నుంచే అమలు 
చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ డబ్బును తమ అప్పునకు బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు. 

గతంలో ఏముందంటే ? 
గతంలో రైతులకు ఇలాంటి పథకమే లేదు. 
ఎంత ప్రయోజనం: రైతు కుటుంబానికి ఏటా రూ. 12,500 అందుతుంది. 

ప్రస్తుతం వడ్డీలేని రుణాలు అమలు కావడంలేదు. అయితే రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. 

ఇప్పటి వరకూ రైతులకు ఉచితంగా బోర్లు వేసే విధానం లేదు. రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచడం కోసం 200 రిగ్గులను కొనాలని కేబినెట్‌ నిర్ణయించింది. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత బోరు వేయనున్నారు. 

ప్రకృతి వైపరీత్యాల నిధి. రూ.2000 కోట్లు
ఇప్పటి వరకూ ప్రీమియం చెల్లించి బీమా చేయించుకున్న రైతులకే పంటల బీమా వర్తిస్తోంది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతు పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించనుంది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇప్పించే బాధ్యతను కూడా సర్కారు తీసుకోనుంది. 

ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లు 
కనీస మద్దతు ధరకు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో సర్కారే కొనుగోలు చేయనుంది. వ్యవసాయ ప్రగతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ఇందుకు చర్యలు తీసుకోవడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు. 

నాణ్యమైన బియ్యం పంపిణీ
- మేనిఫెస్టో : మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల సభల్లో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  
కేబినెట్‌ నిర్ణయం: సెప్టెంబర్‌ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ.
ప్రస్తుతం : డీలర్ల వద్దకు వెళ్లి కార్డుదారులు బియ్యం తెచ్చుకోవాలి. వేలిముద్రలు పడటంలేదంటూ కొందరికి ఇవ్వడంలేదు. ఇచ్చే బియ్యం కూడా నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికిరావడంలేదు. దీంతో చాలామంది తక్కువ రేటుకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ ఎఫ్‌సీఐకి అమ్మే ప్రక్రియ సాగుతోంది.
ప్రయోజనం : నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే అందరూ వండుకుని తింటారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ ఉండదు. ఐదారు నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరలకు ఇవ్వడంవల్ల 1.47 కోట్ల మంది తెల్లకార్డుదారులు ప్రయోజనం పొందనున్నారు.  లబ్ధిదారులు 1.47 కోట్ల మంది 

పింఛను పెంపు  
మేనిఫెస్టో : ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం. అవ్వాతాతల పింఛను రూ. 3వేల వరకూ పెంచుతూ పోతాం.
కేబినెట్‌ నిర్ణయం : ప్రస్తుతం పింఛను రూ. 2,000 నుంచి రూ. 2,250కి పెంపు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకూ పెంపు. పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు.
ప్రస్తుతం : రూ. వెయ్యి మాత్రమే ఉన్న పింఛనును ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన తర్వాత బాబు సర్కారు రూ. 2,000కు పెంచింది. అయితే పింఛను వయసును బాబు సర్కారు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. దీనివల్ల లక్షలాది మంది పింఛనుకు అనర్హులుగా మారారు. 
ప్రయోజనం : పింఛను వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంవల్ల అదనంగా 5 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. పింఛను పెంపు లబ్ధి పొందేవారి సంఖ్య మొత్తం 59 లక్షలకు చేరనుంది. 
పింఛను పెంపు వల్ల లబ్ధిపొందేవారి సంఖ్య 59 లక్షలు

అమ్మ ఒడి
మేనిఫెస్టో:  పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం.
కేబినెట్‌ నిర్ణయం: పిల్లలందరినీ చదివించి విజ్ఞానవంతులను చేయాలన్న లక్ష్యంతో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 చెక్కు గ్రామ, వార్డు వాలంటీరు ద్వారా ఇంటి వద్దే అందించే ఏర్పాటు. దీనిని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయాలి. 
ప్రస్తుతం: చాలామంది పిల్లలను బడికి పంపించే స్థోమత లేక కూలి పనులకు పంపిస్తున్నారు. 
ప్రయోజనం: తెల్లరేషన్‌ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా అందే మొత్తం రూ.15,000

అంగన్‌వాడీలకు..
మేనిఫెస్టో: అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు తెలంగాణలో ఉన్న గౌరవ వేతనం కంటే రూ. వెయ్యి అధికంగా చెల్లింపు
కేబినెట్‌ నిర్ణయం: అంగన్‌ వాడీ టీచర్లు, కార్మికులకు రూ. వెయ్యి గౌరవ వేతనం పెంపు
గతంలో ఏముంది: అంగన్‌వాడీ టీచర్లకు రూ. 10500, కార్యకర్తలకు రూ. 6000 గౌరవ వేతనం ఉంది.
- ప్రయోజనం: అంగన్‌వాడీ టీచర్లకు రూ. 11,500, కార్యకర్తలకు రూ. 7,000 గౌరవ వేతనం అమలు.

డ్వాక్రా యానిమేటర్లకు..
మేనిఫెస్టో: డ్వాక్రా యానిమేటర్లకు రూ.10 వేల గౌరవ వేతనం.
కేబినెట్‌ నిర్ణయం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు రూ. 3,500 నుంచి రూ. 10 వేలకు గౌరవ వేతనం పెంపు. 
ప్రస్తుతం: గతంలో వీరికి నయాపైసా కూడా గౌరవ వేతనం లేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం వీరికి రూ. 3,500 గౌరవ వేతనం ఇస్తామంటూ జీవో ఇచ్చారు. 
ఎంత ప్రయోజనం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు గౌరవ వేతనం భారీగా పెరగనుంది. 

104, 108 మెరుగుకు  
హామీ 104, 108 అంబులెన్సు సేవల మెరుగునకు చర్యలు
కేబినెట్‌ నిర్ణయం:  ప్రతి మండలంలో 104, 108 వాహనాలు ఒక్కోటి చొప్పున ఏర్పాటు. ఎక్కడ నుంచి ఫోను వచ్చినా 20 నిమిషాల్లో ఈ అంబులెన్సులు అక్కడకు చేరే విధంగా చర్యలు. 104 అంబులెన్సుల్లో సిబ్బంది ఏర్పాటు.. మందుల కల్పన. 
ప్రస్తుతం: అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి చేరుకోవడానికి ఫోన్‌ చేసినా గంటల తరబడి అంబులెన్సులు రాని పరిస్థితి.
ప్రయోజనం: అత్యవసర వైద్యం కావాల్సివచ్చినప్పుడు ఆస్పత్రికి చేరుకోవడం కోసం రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఫోన్‌ చేసినా 20 నిమిషాల్లో అంబులెన్సు చేరుకుని క్షతగాత్రులు/ గర్భిణులు, వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి చేర్చే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల తక్షణ వైద్యం లభించి ప్రాణాలను కాపాడేందుకు వీలు.

అర్హులందరికీ ఇళ్లు
మేనిఫెస్టో : ఇంటి స్థలం లేని అర్హులందరికీ ఇంటి స్థలాలు. మహిళల పేరునే రిజిస్ట్రేషన్‌. ఇళ్లు కూడా కట్టిస్తాం. 
కేబినెట్‌ నిర్ణయం : ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అయినా ఇంటి స్థలం లేని  కుటుంబానికి మహిళ పేరుతో ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి స్థల పట్టా ఇస్తే బ్యాంకు రుణం రాదు. అందువల్ల వారి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఇళ్లు కూడా ప్రభుత్వమే కట్టించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో పేదలకు ఇళ్లు నిర్మించాలి. 

అగ్రిగోల్డ్‌ 
మేనిఫెస్టోలో ఏముంది..
రూ.1,150 కోట్లు    కేటాయించి ప్రభుత్వ గణాంకాల ప్రకారం  బాధితులకు (డిపాజిటర్లకు) చెల్లింపులు జరిపిస్తాం.

కేబినెట్‌ నిర్ణయం:  రూ. 20 వేల లోపు డిపాజిట్‌దారులకు ఈ మొత్తం చెల్లించే ఏర్పాటు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను ప్లాట్లుగా మార్చి వేలం ద్వారా విక్రయించి బాధితులకు చెల్లించేందుకు కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ప్రతీ డిపాజిట్‌దారుకు న్యాయం చేసే దిశగా చర్యలు.

ప్రభుత్వం కేటాయించిన మొత్తం 1,150 కోట్లు
గతంలో ఏమి జరిగింది: బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడం ద్వారా ప్రయోజనం పొందాలని గత పాలకులు ప్రయత్నించారు. చివర్లో ఎన్నికల ముందు ఓట్ల కోసం రూ. 250 కోట్లు మంజూరు చేసినట్లు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చారు తప్ప నిధులు ఇవ్వలేదు.

ఎంత ప్రయోజనం : ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్లతో తక్షణం తొమ్మిది లక్షల మంది పేద డిపాజిట్‌దారులకు లబ్ధి చేకూరనుంది. కోర్టు అనుమతితో బహిరంగ వేలం ద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. లబ్ది పొందే డిపాజిటర్లు 9 లక్షల మంది

ఆశా కార్యకర్తలు
మేనిఫెస్టో: ఆశా వర్కర్లకు రూ. 10 వేల గౌరవ వేతనం.
కేబినెట్‌ నిర్ణయం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంపు. 
ప్రస్తుతం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 3,000
ప్రయోజనం: 42 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. 

గ్రామ సచివాలయాలు
మేనిఫెస్టో: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు.
కేబినెట్‌ నిర్ణయం: అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం. పారదర్శకంగా నోటిఫికేషన్ల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపిక. ఆగస్టు 15వ తేదీకల్లా నియామకాల ప్రక్రియ పూర్తి. 
ప్రస్తుతం:  ప్రస్తుతం సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వాల్సిన దుస్థితి. టీడీపీ వారికే పథకాలు ఇచ్చే దుస్థితి. 
ప్రయోజనం: ఏదైనా పథకం కింద, లేదా పత్రాల కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే పరిష్కారం. 

సర్కారులో ఆర్టీసీ విలీనం
మేనిఫెస్టో: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ హామీ. 
కేబినెట్‌ నిర్ణయం: మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌ సూత్రప్రాయ నిర్ణయం. ఇందు కోసం ఆర్థిక, రవాణా శాఖల మంత్రులతో కమిటీ. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి ఆర్టీసీ మెరుగుకు చర్యలు. డీజిల్‌ ధరల పెరుగుదలవల్ల కలిగే నష్టాల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు. 
ప్రస్తుతం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. 
ప్రయోజనం: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రయోజనం కలుగనుంది. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 

సర్కారు స్కూళ్ల రూపురేఖల మార్పు
మేనిఫెస్టో : ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాలు ప్రజలముందుంచి రెండేళ్ల తర్వాత అభివృద్ధి చేసి మళ్లీ వాటి పరిస్థితిని ప్రజల ముందు పెడతాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించడంతో పాటు ప్రమాణాలు పెంపు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు. 
కేబినెట్‌ నిర్ణయం:  ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నింటి ఫొటోలు తీసి స్కూళ్ల రూపురేఖలను మార్చాలి. పాఠశాలలను అభివృద్ధి చేసిన తర్వాత ఫొటోలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం చేసింది చూపించాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అయితే ఏళ్ల తరబడి దీని అమలుకు గత పాలకులు చర్యలు తీసుకోలేదు. ఇక నుంచి దీనిని అమలు చేయాలి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి. రాష్ట్ర విద్యా పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణతో పాటు ప్రమాణాల మెరుగుకు చర్యలు.

25% ప్రతి ప్రయివేటు విద్యా సంస్థ  పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు
ప్రస్తుతం:  ప్రభుత్వ స్కూళ్లు దయనీయంగా ఉన్నాయి. 
ప్రయోజనం: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగవడం. విద్యా ప్రమాణాలు పెంచడంవల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు విద్యాసంస్థలకు వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన భారం పేదలకు తప్పనుంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అదుపులోకి వస్తాయి. 

ప్రభుత్వ ఉద్యోగులు
మేనిఫెస్టో : సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ. అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతి అమలు. కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసు ఆధారంగా క్రమబద్ధీకరణ. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు.
కేబినెట్‌ నిర్ణయాలు: జూలై 1 నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. సీపీఎస్‌ రద్దు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం. దీనిని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధి విధానాల తయారీ. అవరోధాల తొలగింపు కోసం ఆర్థికమంత్రి అధ్యక్షతన కార్యదర్శులతో కమిటీ. అర్హత, అనుభవం ప్రాతిపదికన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. దీని అమలుకు ఆర్థిక, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్య, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీ. 
ప్రస్తుతం: సీపీఎస్‌ ఉద్యోగులు పాత పెన్షన్‌ అమలు చేయాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేసింది. 

ప్రయోజనం
ఐఆర్‌ పెంపు 27%
లబ్ధిపొందే ఉద్యోగులు 4.20 లక్షలు
నెలవారీ లబ్ధి 815 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement