సంక్షేమ జెండా.. ప్రగతి అజెండా.. | CM YS Jagan Mohan Reddy Cabinet takes key decisions | Sakshi
Sakshi News home page

సంక్షేమ జెండా.. ప్రగతి అజెండా..

Published Tue, Jun 11 2019 4:35 AM | Last Updated on Tue, Jun 11 2019 4:35 AM

CM YS Jagan Mohan Reddy Cabinet takes key decisions - Sakshi

సాక్షి, అమరావతి : నవరత్నాల పథకాలు చుక్కానిగా.. ఎన్నికల మేనిఫెస్టో మార్గనిర్దేశంగా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వ విధానాన్ని ఆవిష్కరించారు. మానవీయత ఇరుసుగా సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించడమే లక్ష్యమని స్పష్టంచేశారు. అందుకోసం రానున్న ఐదేళ్లలో తమ పరిపాలనకు దిక్సూచిగా నిలిచే స్పష్టమైన అజెండాను సోమవారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్దేశించారు. ‘ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత మాదిరిగా పవిత్ర గ్రంథంగా భావిస్తాను. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ అమలుచేస్తాను’.. అని వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.

ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఆయన తన సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకంతోనే తాను సంక్షేమ ముఖ్యమంత్రినని నిరూపించుకున్న ఆయన.. తన తొలి కేబినెట్‌ సమావేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. ప్రజా సంక్షేమంపట్ల చిత్తశుద్ధిని, రాష్ట్ర ప్రగతిపట్ల దార్శనికతకు అద్దంపడుతూ వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులు, అధికార యంత్రాంగానికి వివరించారు. నిబద్ధతతో నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో అమలుచేయాలని నిర్దేశించారు. సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్ని అంశాలపై పూర్తి సాధికారతతో చర్చించారు. మంత్రులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పించి ప్రజాస్వామ్య స్ఫూర్తితో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాజన్న సంక్షేమ రాజ్యస్థాపనకు మానవీయత, దార్శనికతతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. 

నిబద్ధతతో ‘నవరత్నాలు’ అమలు 
నవరత్నాల పథకాలు చుక్కానిగా తమ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన విధానాన్ని ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన ‘నవరత్నాల’ పథకాలను పూర్తి నిబద్ధతతో అమలుచేయాలని ఆయన మంత్రులకు నిర్దేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలుపడ్డ కష్టాలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మానవీయ కోణంలో విశ్లేషించి హేతుబద్ధంగా రూపొందించిన పార్టీ విధాన నిర్ణయమే నవరత్నాల పథకాలు అని ఆయన వివరించారు. ఆ పథకాలపట్ల విశ్వాసంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడతారన్న నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారని గుర్తుచేశారు. 

ప్రతీ హామీ అమలుచేయాల్సిందే
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీ కచ్చితంగా అమలుచేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తేల్చిచెప్పారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రజలు మనల్ని నమ్మి అధికారాన్ని ఇచ్చారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.. అని మంత్రులకు చెప్పారు. ‘నా టేబుల్‌పై మేనిఫెస్టో కాపీ ఉంది. మీ టేబుల్‌ పైన కూడా ఉండాలి’ అని మంత్రులకు సూచించారు. దీనిపై మంత్రులు పూర్తి సానుకూలంగా స్పందించి 
ముఖ్యమంత్రి తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.

పూర్తి సాధికారతతో చర్చించిన సీఎం
పరిపాలన పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతటి నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్నారన్నది తొలి మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు అర్ధమైంది. మంత్రివర్గ అజెండాలోని అంశాలతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ పూర్తి సాధికారతతో మాట్లాడటం వారిని ఆకట్టుకుంది. అన్ని అంశాలపై ఆయన ఎంతో కసరత్తు చేసి వివిధ కోణాల్లో విశ్లేషించి మరీ సమావేశానికి వచ్చారు. పింఛన్లు, వివిధ వర్గాలకు జీతాల పెంపుదలతో అదనపు ఆర్థిక భారం, కంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం లోటుపాట్లు, రద్దుకు రూపొందించాల్సిన విధాన నిర్ణయం, రైతు భరోసా, అమ్మ ఒడి, రైతులకు వడ్డీలు లేని రుణాలు.. ఇలా ఏ అంశమైనా సరే ఎంతో అవగాహనతో సూటిగా.. స్పష్టంగా మాట్లాడారు. సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తపడ్డారు. మంత్రివర్గ సమావేశాలకుగానీ పరిపాలనా వ్యవహారాల్లోగానీ మంత్రులు ఎంతగా కసరత్తు చేయాలి.. తమ శాఖలపై ఎంతగా పట్టు సాధించాలి.. విధాన నిర్ణయాల అమలులో ఎంతగా భాగస్వాములు కావాలో వైఎస్‌ జగన్‌ విపులీకరించారు.

విధానాల్లో మానవీయ కోణం
సీఎం జగన్‌ నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆసాంతం మానవీయ కోణం వెల్లివిరిసింది. అజెండాలోనూ.. ప్రాధాన్యతల్లోనూ.. ఆయన మాటల్లోనూ.. వివిధ అంశాలపై చర్చలోనూ.. మంత్రివర్గ నిర్ణయాల్లోనూ అది ప్రధానాంశంగా నిలిచింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు జీతాల పెంపు వంటి దాదాపు 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదాహరణకు..
- ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీలు, ఆయాలు.. ఇలా పలు వర్గాల జీతాలు పెంచారు. 
అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణ సాయం కోసం రూ.1,150 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. 
రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల అమలుకు నిర్ణయించారు. 
జీతాల పెంపు వంటి అంశాలపై చర్చలో కొందరు మంత్రులు లేవనెత్తిన అంశాలపై.. జగన్‌ మాటలు ఆయనలోని మానవీయతకు అద్దంపట్టాయి. 
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను నెలకు రూ.18 వేలకు పెంచాలన్న ప్రతిపాదనపై కొందరు అంత జీతాలు పెంచడం ఆర్థిక భారం అవుతుందేమోనని సందేహం వ్యక్తంచేశారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ‘అన్నా, పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోదు. అలాంటి వారికి న్యాయం చేయకుంటే దేవుడు మనల్ని క్షమించడు. వారికి జీతాలు రూ.18 వేలకు పెంచుదాం’.. అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
ఆర్థిక భారంతో పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారకూడదని.. అందుకే అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించామని వైఎస్‌ జగన్‌ చెప్పారు.  
మరీ అంత సీరియస్సా..
మంత్రిమండలి సమావేశం ప్రారంభంలో మంత్రులు కాస్త గంభీరంగా ఉండడాన్ని సీఎం జగన్‌ గుర్తించారు. ‘అందరూ మరీ అంత సీరియస్‌గా ఉన్నారేందన్నా.. కాస్త నవ్వండి.. నవ్వుతూ బాగా పనిచేద్దాం’.. అని వ్యాఖ్యానించి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తెచ్చారు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తితో..
సీఎం వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గ సమావేశాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంపైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో మంత్రులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తన ప్రభుత్వంలో మంత్రులు ఎవరూ డమ్మీలు కారని ఆయన అధికారులకు స్పష్టంచేశారు. పలు కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు వాటిల్లో ఎవరెవరిని నియమించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వీటిల్లో మంత్రులు అవసరంలేదని అధికారులు అనడంతో జగన్‌ పై విధంగా స్పందించారు. అంతేకాక, ‘వారికి అన్ని అంశాలపైనా అవగాహన ఉంది. పాలనా సంబంధ వ్యవహారాల్లో వారు కూడా క్రియాశీలంగా ఉంటారు. వారు చెప్పిన దానికి అనుగుణంగా పాలన జరగాలి.

అధికారులు వారి మాట వినాలి’ అని జగన్‌ స్పష్టంగా నిర్దేశించినట్లు సమాచారం. సమావేశంలో చర్చించే అంశాలపై మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పొచ్చని సమావేశం ప్రారంభంలోనే సీఎం చెప్పడంతో మంత్రులందరూ క్రియాశీలంగా వ్యవహరించారు. గ్రామ, పట్టణ వలంటీర్ల నియామకం ప్రస్తావనకు వచ్చినపుడు వారి విద్యార్హతలు నిర్ణయించేటపుడు అధికారులు డిగ్రీని కనీసార్హతగా ఉండాలని నిర్ణయించారు. ఓ ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని డిగ్రీ కనీసార్హత గల వారు గ్రామాల్లో దొరకరని, ఇంటర్‌కు తగ్గించాలని సూచించారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లకు ఇంటర్, పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీని కనీస విద్యార్హతగా నిర్ణయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాలు పెంచే విషయం చర్చకు వచ్చినపుడు.. గిరిజన ప్రాంతాల్లో ఉండే వైద్య వలంటీర్ల జీతాలను కూడా పెంచాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారని తెలిసింది. ఆ అంశం ఎజెండాలో లేకపోయినా జగన్‌ దానిని పరిగణనలోకి తీసుకుని వారికి ప్రస్తుతం జీతం ఎంతో తెలుసుకున్నారు. రూ.400  నుంచి రూ.4000కు  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement