నవరత్నాల అమలులో మరో ముందడుగు | AP Govt Takes Another Step To For Implementation of Navratna schemes | Sakshi
Sakshi News home page

నవరత్నాల అమలులో మరో ముందడుగు

Published Thu, Aug 20 2020 3:02 AM | Last Updated on Thu, Aug 20 2020 9:46 AM

AP Govt Takes Another Step To For Implementation of Navratna schemes - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో మేరకు నవరత్న పథకాల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద ముందడుగు వేస్తూ పలు కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశ వివరాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌
► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాలను సెప్టెంబరు 1న ప్రారంభిస్తారు. 
► రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ ప్లస్‌’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌’ పథకాన్ని అమలు చేస్తారు. 
► 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. 
► గతంలో కేవలం రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకే పౌష్టికాహారం ఇచ్చే వారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.762 కోట్లే ఖర్చు చేయగా, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచి రూ.1,863 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

డిసెంబరు 1 నుంచి లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం
► శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం  పథకాన్ని డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. 
► వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది.
► ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. 
► వాహనాల కోసం లబ్ధిదారులు 10 శాతం చెల్లిస్తే.. 30 శాతం బ్యాంకు రుణం, 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. 
► సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని అందజేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూక 15 శాతానికి తగ్గుతుంది. రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.50 శాతానికి తగ్గుతుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతి కిలోకు అదనంగా రూ.1.10 వ్యయం చేయనుంది. 30 పైసలు పంపిణీకి ఖర్చు చేయనుంది.
► పర్యావరణహితంగా 10 కేజీలు, 15 కేజీలు రీ యూజబుల్‌ బ్యాగులను లబ్ధిదారులకు ఇస్తారు. బియ్యం మొత్తం స్టార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు, డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు వెరసి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది. 

‘వైఎస్సార్‌ ఆసరా’తో 90 లక్షల మందికి లబ్ధి
► మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది. 
► ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది.

43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’
జగనన్న విద్యా కానుక’ పథకాన్ని సెప్టెంబర్‌ 5న ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్‌ (వస్త్రం), టెస్ట్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement