సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల తుది జాబితాను నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.47 కోట్ల తెల్ల రేషన్‌కార్డుల వివరాలను గ్రామ వలంటీర్లకు అందజేసి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు.. తదితర కారణాలతో దాదాపు 18 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తాము బియ్యం కార్డులు పొందడానికి అర్హులమేనని పేర్కొంటూ పున:పరిశీలన కోసం 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ విచారణ సాగిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఈ పని పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్హుల ఎంపిక ప్రక్రియను జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎవరికీ అన్యాయం జరగబోదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు బియ్యం కార్డులు లేని మరో 1.50 లక్షల మంది గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.
పున:పరిశీలనకు భారీగా దరఖాస్తులు
గుంటూరు జిల్లాలో 98,035, నెల్లూరులో 64,519, కృష్ణాలో 95,716, కడపలో 50,446, చిత్తూరులో 66,407, ప్రకాశంలో 55,890, అనంతపురంలో 69,758, తూర్పు గోదావరిలో 86,842, కర్నూలులో 55,253, విశాఖపట్నంలో 57,198, పశ్చిమ గోదావరిలో 60,540, విజయనగరంలో 31,247, శ్రీకాకుళం జిల్లాలో 31,982 దరఖాస్తులు పున:పరిశీలన కోసం వచ్చాయి. ఆయా దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇది నిరంతర ప్రక్రియ
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం కా>ర్డు పొందడానికి అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తు అందిన వెంటనే పరిశీలించి, ఐదు రోజుల్లోగా బియ్యం కార్డు మంజూరు చేస్తాం. పేదలు బియ్యం కార్డు కోసం ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
– కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment