
సాక్షి, అమరావతి : ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆధార్, మీ–సేవ కేంద్రాలకు ప్రజలు వెళ్లడం.. అక్కడ పెద్దఎత్తున క్యూలు కట్టడాన్ని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. వాటిని నిదానంగా అప్‌డేట్ చేయించుకోవచ్చునని, ఇందుకు ఎటువంటి గడువులేదని ఆయన పేర్కొన్నారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదు, అప్‌డేట్ చేయించకపోయినా రేషన్ ఇస్తారని, రేషన్ ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని శశిధర్ కోరారు.
కాగా, పాఠశాల పిల్లలు తాజా వివరాల నమోదుకు ఆధార్, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని ఆయనన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని, అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ–కేవైసీ చేసుకోవాలని.. దీనికోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ–సేవా కేంద్రాల వద్దకు వెళ్లకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గతంలోనే రేషన్ దుకాణం వద్ద ఈ–కేవైసీ చేయించుకుని ఉంటే మళ్లీ చేయించుకోవాల్సిన అవసరంలేదని ఆయన సూచించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, ఆధార్ కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడవద్దని కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.
ఆందోళన వద్దు : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ: రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులు ఈకేవైసీపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కార్డులోని కుటుంబసభ్యులు ఎప్పుడైనా ఈకేవైసీ చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈకేవైసీ లేకపోతే రేషన్ సరుకులు ఇవ్వరనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. రేషన్ సరుకులు నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కార్డులోని కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరికి ఈకేవైసీ ఉన్నా రేషన్ సరుకులు ఇస్తామన్నారు. నానితో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకుడు పాలేటి చంటి ఉన్నారు.