సాక్షి, అమరావతి: అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించింది. తుపాను కారణంగా తడిసిన, రంగు మారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి సేకరించి కష్టకాలంలో అండగా నిలవాలని నిర్ణయించింది. సడలించిన నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రత్యేక గోదాములలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 1,993 గ్రామాల్లో 2,92,689 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు కేంద్ర బృందంతో కలిసి పర్యటించి నివేదిక తయారు చేశారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తెచ్చేందుకు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రతి 20 కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించారు. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు రూ.701.05 కోట్ల విలువ చేసే 3.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
సడలించిన నిబంధనలు ఇలా..
తడిసిన, రంగుమారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని గ్రేడ్లవారీగా గుర్తించి మద్దతు ధర తగ్గించి చెల్లిస్తారు. తడిసిన, రంగుమారిన ధాన్యం 5 – 6 శాతం ఉంటే ధరలో ఒక శాతం, 6 – 7 శాతం ఉంటే ధరలో 2 శాతం, 7 – 8 శాతం ఉంటే ధరలో 3 శాతం, 8 – 9 శాతం ఉంటే ధరలో 4 శాతం, 9 – 10 శాతం ఉంటే మద్దతు ధరలో 5 శాతం తగ్గించి చెల్లిస్తారు. సడలించిన నిబంధనలు రాష్ట్రం అంతటా వర్తిస్తాయి.
పూర్తిగా దెబ్బతిన్న ధాన్యాన్నీ కొంటాం...
‘నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధర చెల్లిస్తాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రత్యేక గోదాముల్లో నిల్వ చేస్తాం. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం’
– కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment