సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రెండో విడతలో ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం బియ్యం, శనగపప్పు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన 1.47 కోట్ల కుటుంబాలకు అవసరమైన సరుకులను ఈ నెల 13లోగా గోదాముల నుంచి రేషన్ షాపులకు తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా గత నెల 29 నుంచి ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఇప్పటివరకు 1.13 కోట్ల కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 14 వరకు సరుకులు తీసుకోవచ్చు. కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకు ఒక కిలో కంది పప్పును రేషన్ దుకాణాల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. రెండో విడత కింద ఏప్రిల్ 15 నుంచి, మూడో విడత కింద ఏప్రిల్ 29 నుంచి సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
పేదలకు ఆకలి బాధలు లేకుండా..
పంపిణీకి ప్రతినెలా 2.62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలను రాష్ట్రానికి పంపుతామని కేంద్రం ప్రకటించినప్పటికీ కేవలం 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. మిగిలిన 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూ ర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక భారం అయినప్పటికీ పేదలకు ఆకలి బాధలు లేకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత సరుకుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.
రద్దీ నియంత్రణకు అదనపు కౌంటర్లు
15 నుంచి రెండో విడత పంపిణీ
రేషన్ షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పంపిణీ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కూపన్లు జారీ చేయనున్నారు. కాగా, రెండో విడతలో కందిపప్పుకు బదులు శనగపప్పు ఇవ్వనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు. అలాగే, కరోనా నివారణలో భాగంగా రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment