- ప్రజాపంపిణీ వ్యవస్థలో బయోమెట్రిక్ విజయవంతం
- అర్భన్‌లో సత్ఫాలితాలు.. 32శాతం సరుకుల మిగులు
- బోగస్ ఏరివేత తరువాతనే పుడ్‌సెక్యూరిటీ కార్డులు
- ఈపాస్‌తోఆధార్ అనుసంధానం పూర్తయితే జిల్లాలో ఎక్కడినుంచైనా సరుకులు
- జేసీ-2 దృష్టికి కందిపప్పు విక్రయకేంద్రాలు
- జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) గౌరీశంకర్
తాండూరు(రంగారెడ్డి జిల్లా)
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్(ఈ-పాస్) విధానం విజయవంతమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి(డీఎస్‌ఓ) ఎం.గౌరీశంకర్ పేర్కొన్నారు. గురువారం తాండూరు దిగ్రేన్‌అండ్‌సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం డీఎస్‌ఓ విలేకరులతో మాట్లాడారు. చౌకధరల దుకాణాల నుంచి రేషన్‌కార్డుదారులు లేదా వారి కుటుంబసభ్యులు సరుకులు తీసుకువెళ్లేందుకు, సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ విధానం అమలు చేసినట్టు ఆయన వివరించారు.
ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తయితే బోగస్ కార్డులను తొలగించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. బోగస్ తొలగింపు తరువాత అసలైన లబ్ధిదారులకు పుడ్‌సెక్యూరిటీ కార్డులను జారీ చేసే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ నుంచి మండలాల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరుకుల రవాణా పక్కదారి స్టేజ్ -1లో 53వాహనాల్లో జియోట్యాగింగ్ యంత్రాలను అమర్చినట్టు చెప్పారు.
తాండూరులో మాదిరిగానే అర్భన్ ప్రాంతాల్లో దాల్‌మిల్ అసోసియేషన్, ఇతర వ్యాపార వర్గాల భాగస్వామ్యంతో తక్కువ ధరకు కందిపప్పు అందించేందుకు యోచిస్తామన్నారు. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్-2 దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. గత ఏడాది వనస్థలిపురం,కూకట్‌పల్లి,ఉప్పల్‌లో 4 విక్రయకేంద్రాల ద్వారా తక్కువ ధరకు కందిపప్పు అందించినట్టు గుర్తు చేశారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తే ఈసారి కూడా బాలానగర్, వనస్థలిపురం తదితర చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీఎస్‌ఓ వివరించారు.