సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్‌మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే సాకును చూపుతూ రాష్ట్రం నుంచి బియ్యాన్నే సేకరించకూడదనే తీవ్రమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఈనెల 7వ తేదీ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడాన్ని నిలిపివేసింది.
దీంతో రాష్ట్రంలోని సుమారు 3,250 రైస్ మిల్లులు మూతపడ్డాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనుచూపు మేరలో స్పష్టత కనిపించడం లేదు. సీఎంఆర్ లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సొమ్ము ఆగిపోయింది. మరోవైపు మిల్లుల్లో నిండిపోయిన ధాన్యం నిల్వలు మిల్లింగ్ లేక ముక్కిపోతున్నాయి.
మిల్లుల ఆవరణల్లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యంపైన టార్పాలిన్లు కప్పినా, వర్షం, తేమకు మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు రాస్తున్న లేఖలకు ఎలాంటి స్పందన లభించడం లేదు.
ఈ పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ అవుతున్న గత వానాకాలం వడ్లు 40 ఎల్‌ఎంటీలకు తోడు యాసంగిలో సేకరించిన 50 ఎల్‌ఎంటీల ధాన్యం మిల్లులు, వాటి ఆవరణల్లో పేరుకుపోయాయి. దాదాపు 90 ఎల్‌ఎంటీల ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ అయిన మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
తప్పు దిద్దుకున్నా స్పందించని ఢిల్లీ....
కరోనా ప్రబలిన తరువాత 2021 మార్చి నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ)లు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 53.68 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్ కార్డులకు గాను 1.92 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కోటా 1.90 ఎల్‌ఎంటీల బియ్యాన్ని పంపిణీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించింది.
కానీ ఈ బియ్యాన్ని వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేదు. దీనిపై ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. బియ్యం పంపిణీ చేయనందున సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని, ఆ కోటాను ఈనెల 18 నుంచి ఆరునెలల పాటు ప్రతినెలా ఇస్తామని లేఖ రాసింది.
ఈ మేరకు 18 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి మరీ అధికారులను కోరారు. అయినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు.
రూ.1,700కు కొనేందుకు మిల్లర్లు సిద్ధం
రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకోకుండా ఎఫ్‌సీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ధాన్యాన్ని వేలం పద్ధతిలో మిల్లర్లకే అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై మిల్లర్లు ఇటీవల సమావేశమై ప్రభుత్వం ధాన్యాన్ని తమకు విక్రయిస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1700 లెక్కన కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్‌గా విక్రయించుకుంటామని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే..
రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. కేంద్రం తనకు తోచినప్పుడు ఇచ్చే డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తూ, భారమైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బియ్యం తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే విధానాన్ని తీవ్రంగా ఎండగడతాం.
– గంగుల కమలాకర్, మంత్రి, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment