పంటలను పరిశీలిస్తున్న కోన శశిధర్ తదితరులు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తిన, పురుగు పట్టిన..ఇలా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ బుధవారం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు పౌరసరఫరాల శాఖ అధికారులు వెళ్లారన్నారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రెండో బృందం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాడైపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,578 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6,643 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 4,46,000 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రైతుల కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు.
కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు
పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయం: 18004251903
పశ్చిమగోదావరి: 08812 230448
తూర్పుగోదావరి: 08886613611
కృష్ణా: 7702003571, గుంటూరు: 8331056907
Comments
Please login to add a commentAdd a comment