
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరించిన 15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద రిజి్రస్టేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలని.. అంతకుమించి ఆలస్యం చేయొద్దని సూచించారు. రైతులు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.
రైతులకు కనీస మద్దతు ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముడుపోకుండా ఉంటే వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయిలో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు.