గోనె సంచులకు బార్‌ కోడ్‌.. | Bar code for gunny bags | Sakshi
Sakshi News home page

గోనె సంచులకు బార్‌ కోడ్‌..

Published Wed, Oct 30 2019 3:26 AM | Last Updated on Wed, Oct 30 2019 3:26 AM

Bar code for gunny bags - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం రవాణా, ప్రజాపంపిణీ రవాణా, బియ్యం సరఫరా వంటి అంశాల్లో వినియోగిస్తున్న గోనె సంచుల విషయంలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గోనె సంచులు దుర్వినియోగం కాకుండా ప్రతీ సంచికి బార్‌కోడింగ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ గన్నీ బ్యాగుకు క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను ఇవ్వనుంది. దీని ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి వీలుకానుంది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ ఫోన్తో స్కాన్‌ చేయడం ద్వారా వచ్చిన సమాచారాన్ని సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లలో త్వర లో దీనిని ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. 

మార్చే వీలు లేకుండా..
ఈ క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా గోనె సంచుల వివరాలను మార్చడానికి వీలుండదు. సంచులు ఏ గోదాములో, ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ రేషన్‌ షాపు వద్ద వీటిని వినియోగిస్తున్నారు వంటి వివరాలు పౌరసరఫరాలశాఖ వద్ద ఉంటాయి. ఈ సంచులను ఒకటి, రెండు సార్లు లేదా మల్టీ యూజ్‌గా ఉపయోగించారా? లేదా? అన్న విషయాలు తెలుసుకునే వీలుంది. ఈ సంచి ఉపయోగించే ప్రతి సందర్భంలోనూ స్కాన్‌ చేసి దాని వివరాలు అందుబాటులో ఉంచుతారు. ఈ విధానానికి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీగా నామకరణం చేశారు.

ప్రతీ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో పౌరసరఫరాలశాఖ గోనెసంచులను కొనుగోలు చేసి మిల్లర్లకు అందజేస్తోంది. మిల్లర్లకు కేటాయిం చిన ధాన్యానికి సరిపడా సంచులు ఇవ్వాల్సిన జిల్లా మేనేజర్లు.. అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. పైగా కస్టమ్‌ మిల్లింగ్‌ పెండింగ్‌లో ఉండటం, ఇచ్చిన గోనెసంచులు తిరిగి వెనక్కి రాకపోవడం, దీంతో మళ్లీ సీజన్ లో కొత్త బ్యాగులను కొనివ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ విధంగా ఏకంగా ఆరేళ్లలో కొన్ని కోట్ల గోనెసంచులు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ కోసం దాదాపు కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. ఈ సంచుల్లో అక్రమాలకు తావులేకుండా బార్‌కోడింగ్, క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను ప్రవేశపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement