Minister for Agriculture
-
వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాని
-
సొంతింటి కల నెరవేరుస్తున్నాం
నస్రుల్లాబాద్: నిరు పేదల సొంతిటి కలను సీఎం కేసీఆర్ నెర వేరుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అంకోల్ క్యాంపులో 26 ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పని మొదలు కొన్న రోజునుండి దశల వారిగా నిధులను అందిస్థామన్నారు. పని పూర్తి అయిన 48 గంటలలో ఖాతాలలో డబ్బులు వేస్తామన్నారు. గత పాలకులు సంత్సరాల సమయం తీసుకుని రూ.90వేలతో రెండు గదుల ఇళ్లను అగ్గి పెట్టెల్లా నిర్మించి ఇచ్చేవారన్నారు. అటువంటి రాష్ట్ర ప్రజలకు ఆరు నెలల గడువులోగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడం ఒక మహత్తర కార్యం అని అన్నారు. నిరంతర విద్యుత్తు, అందరికి ఆసరా, ఆలంబనా, చేయుత పేరిట పెంన్షన్లు, రేషన్, రోడ్లు, ఉచిత మినిరల్ వాటర్, మిషన్ కాకతీయ మొదలగు సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ఆయనకు సాటి ఎవరు లేరన్నారు. రాష్ట్ర ప్రజలను కన్న బిడ్డల్లా, కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారన్నారు. కార్యక్రమంలోఎంపీపీ మల్లెల మీనా, జెడ్పీటీసీ కిషన్ నాయక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంది మల్లేష్, సర్పంచ్ దిపికా కిరణ్ గౌడ్, ఎంపీటీసీ సుమలత శ్రీనివాస్, ఎంఆర్వో సంజయ్ రావు, ఎంపీడీవో భరత్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల మానవత్వం
⇒ యాచకుడికి సేవలు ⇒ అనాథశరణాలయంలో అప్పగింత మాచారెడ్డి(కామారెడ్డి): మాచారెడ్డి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వచ్చిన ఓ యాచకుడిని అక్కున చేర్చుకుని ఆకలి తీర్చారు. అంతేకాకుండా అతడికి క్షవరం చే యించి కొత్తబట్టలు కట్టించారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయిలోని అనాథశరణాలయంలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవా రం మాచారెడ్డి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నిస్సాహాయస్థితిలో పడి ఉన్న ఓ యాచకుడిని పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అన్నం పెట్టించారు. శారీరకంగా, మానసికంగా దయనీయ పరి స్థితిలో ఉన్న అతడికి క్షవరం చేయించారు. అతడి వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఆ యాచకుడికి మాటలు రాలేదు. దివ్యాంగుడని గుర్తించిన పోలీసులు అతడిని అనాథశరణాలయంలో చేర్పిం చాలని నిర్ణయించారు. హెడ్ కానిస్టేబుల్ లచ్చయ్యగౌడ్, కాని స్టేబుల్ బాలు అతడిని తీసుకుని వెళ్లి ఉగ్రవాయిలోని అనాథశరణాలయంలో చేర్పించారు. నేడు గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు కామారెడ్డి : గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీకి సంబంధించి జిల్లాస్థాయి అవగాహన సదస్సును శనివారం మధ్యాహ్నం కామారెడ్డిలో ని పార్శిరాములు ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షత జరిగే సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సింధే పాల్గొంటారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. -
మొన్న 'జీవా'.. నిన్న 'బ్రహ్మపుత్ర'
* మంత్రి ఇలాఖా.. నకిలీల ఖిల్లా * నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు కుదేలు * జిల్లాలో రోజుకోచోట బయటపడుతున్న వైనం * 4 వేల ఎకరాలకుపైగా నష్టం * హైబ్రీడ్ లక్షణాలు లేవని తేల్చిన శాస్త్రవేత్తలు * కమిటీ పేరుతో మీన మేషాలు సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు వెస్ట్: వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజుకో కంపెనీ పేరుతో పుట్టగొడుగుల్లా నకిలీ మిరప విత్తనాలు బయట పడుతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. నకిలీ విత్తనాల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలు అవుతున్నాయి. జీవా, అగ్రిటెక్ పేరుతో జిల్లాలో దాదాపు 242 కేజీల విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విత్తనాల్లో హైబ్రీడ్ లక్షణాలు లేవని, హ్టార్టీకల్చర్ శాస్త్రవేత్తలు తేల్చినట్లు తెలిసింది. ఈ విత్తనాలు వాడి మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. వేసిన పంటను సైతం పీకివేశారు. ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నష్టపోయిన రైతులకు వేరే పంటలు వేసుకునేందుకు వీలుగా వెంటనే పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది. రైతులకు ఏ మేరకు పరిహారం ఇవ్వాలనేది జేడీ నాయకత్వంలోని కమిటీæ తేల్చి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని, సమస్య కోల్డ్‌స్టోరేజీలోకి చేరుతుందని పలువురు పేర్కొంటున్నారు. పూత, పిందె రాని బ్రహ్మపుత్ర.. బ్రహ్మపుత్ర 555 రకానికి సంబంధించిన మొక్కల్లో పెరుగుదల లేదని, పూత, పిందె రావడం లేదని తాడికొండ, రెంటచింతల మండలాల్లోని రైతులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హార్టీకల్చర్ శాస్త్రవేత్త శారదా పంటను పరిశీలించారు. దాదాపు కిలో విత్తనాలను రైతులకు రూ.50వేల నుంచి రూ.లక్ష రేటుతో కట్టబెట్టినట్లు సమాచారం. అయితే ఈ విత్తనాలకు హైబ్రీడ్ లక్షణాలు లేకపోవడం గమనార్హం. మామూలు విత్తనాలనే హైబ్రీడ్ విత్తనాలుగా చూపి రైతులను నట్టేటముంచినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత ఇలాకాలో నకిలీలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విత్తన పంపిణీ సమయంలో ఓ మంత్రి సమీప బంధువు ఆధ్వర్యంలోనే ఈ దందా జరగడంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయం కేంద్రంగానే ఈ నకిలీ దందా సాగిందని, ఇందులో ఓ వ్యవవసాయాశాఖ అధికారి కీలకంగా వ్యవహారించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో మిరప పంటను సాగుచేశారు. రోజుకో కంపెనీకి చెందిన విత్తనాలు నకిలీవని తేలుతుండటంతో పంట సాగు చేసిన రైతులు, కౌలు రైతులు హడలిపోతున్నారు. దాదాపు ఎకరాకు సరాసరిన 40 వేలు పెట్టుబడి అంటే మొత్తం రూ.160కోట్ల పెట్టుబడి, ఎకరాకు దిగుబడి సరాసరిన రూ1.5లక్షలు అంటే 4000 ఎకరాలకు రూ.600కోట్లు అన్నదాతలు నష్టపోయారు. మంత్రిని నిలదీసేందుకు సన్నద్ధం.. నేడు జిల్లా పరిషత్ సమావేశంలో నకిలీ విత్తనాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు నకిలీలపై మంత్రిని, వ్యవసాయశాఖ అధికారులను నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చ వాడి, వేడిగా సాగే అవకాశం ఉంది. -
లాభసాటిగా ఆముదం పంట
తైవాన్ కంపెనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రయోగం ఆ దేశ ప్రతినిధులతో వ్యవసాయ మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధానాలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ‘లెన్నిన్’ కంపెనీకి చెందిన పదిమంది ప్రతినిధుల బృందం ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తైవాన్ కంపెనీ ప్రతినిధులకు, వ్యవసాయ మంత్రికి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పంటను పండించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రెండు వారాల్లో ప్రతిపాదనలను ఇస్తామని తైవాన్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే ఆ కంపెనీకి కొంత భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాలుగా ప్రయోజనాలుంటే కంపెనీ ఫ్యాక్టరీని, పరిశోధనా సంస్థను రాష్ట్రంలో నెలకొల్పుతారు. ప్రపంచంలో ఆముదానికి డిమాండ్ కాస్మొటిక్స్, లూబ్రికెంట్లు, సబ్బులు, పెయింట్స్, పెస్టిసైడ్స్ తదితర వాటిలో ఆముదంను ఉపయోగిస్తారు. అంతేకాదు భూసారాన్ని పెంచడంలో ఆముదం పిండి ఉపయోగపడుతుంది. అలాగే ఆముదం ఆకుతో వచ్చే పట్టుతో గుడ్లు తయారవుతాయి. వాటితో పట్టు కూడా వస్తుంది. ఈ రకంగా ఆముదానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఉత్పత్తి తక్కువ.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తైవాన్ కంపెనీ దక్షిణాఫ్రికాలో వేలాది ఎకరాల్లో ఆముదం పంటను సాగు చేస్తోంది. -
రైతుబడ్జెట్లో పాలమూరుకు ప్రాధాన్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గద్వాలలో రూ. 10కోట్లతో దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారం ప్రారంభం గద్వాల : రాబోయే 2016-17 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగంలో అన్ని జిల్లాల కంటే పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గద్వాలలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 44 మండలాల్లో 20వేల మంది పాడి రైతులు విజయ డెయిరీకి నిత్యం పాలను అందిస్తున్నారని చెప్పారు. డెయిరీకి అందుతున్న పాల సేకరణలో 2లక్షల లీటర్లు ఉంటుందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా పాలీ హౌస్, గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, పూలు సాగు చేసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పాలీహౌస్‌లకు ప్రభుత్వం 80 నుంచి 90 శాతం రాయితీ ఇస్తుందని తెలిపా రు. ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ. 2,514కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆశించిన స్థాయిలో సహాయం అందలేదన్నారు. తొలకరి వర్షాలకు ముందే నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. బిందుసేద్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంద న్నారు. నష్టం జరిగితే కంపెనీలపై చర్యలు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో విత్తనపత్తి సాగులో జరిగిన నష్టంపై కమిటీ వేసి నివేదిక తెప్పించడం జరిగిందన్నారు. విత్త నం ద్వారా పత్తి పంటలకు నష్టం చేకూరితే బాధ్యులైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్‌పత్తి విత్తనాల ద్వారా నష్టపోతే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు రైతులకు రాయితీపై మంజూరైన ట్రాక్టర్లను, రొటొవేటర్, వ్యవసాయ పరికరాలను మంత్రి పోచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ర్ట పాడి పరిశ్రమశాఖ మేనేజింగ్ డెరైక్టర్ నిర్మల, జేసీ రాంకిషన్, ఉద్యానవనశాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్ది, గట్టు తిమ్మప్ప, బండ్ల రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రత్తిపాటి దిష్టిబొమ్మ దహనం
తెనాలిరూరల్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు కార్యకర్తలు కొలకలూరులో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సమితి డివిజన్ అధ్యక్షుడు చిలకా కిరణ్‌మాదిగ మాట్లాడుతూ మాదిగలు కృష్ణమాదిగ వెంట లేరన్న ప్రత్తిపాటి పుల్లారావు మాటలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు (కిరణ్‌బాబు) మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేక అన్ని వర్గాల వ్యతిరేకతను చవిచూస్తోందన్నారు. కాపుల ఉద్యమం, మాదిగల నిరసనల వెనుక వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తం ఉందన్న మంత్రులు, టీడీపీ నాయకుల ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐకు స్వల్ప గాయాలు.. నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. రాస్తారోకో విరమించాలని ఆదేశించారు. మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా తాలూకా ఎస్ఐ శివరామకృష్ణ అడ్డుకున్నారు. అరుునా కార్యకర్తలు బొమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మంటల సెగకు ఎస్ఐ కనుబొమలు, నొసలు కంతమేర కమురుకుపోయాయి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొన్నెకంటి రమేష్ చొక్కాపై పెట్రోలు పడి మంటలు అంటుకోగా కార్యకర్తలు ఆర్పి వేశారు. ఎస్ఐకు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స చేయించారు. కార్యకర్తలు గ్రామ కూడలిలోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు... సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాలుకా సెంటర్లో మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గరికపాటి రవికుమార్ మాదిగ, వీహెచ్పీఎస్ నియోజకవర్గ నాయకుడు మంగళగిరి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. -
'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర'
గుంటూరు: అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్ధితులు రాష్ట్రంలో దాపురించాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పట్టించుకోకుండా తెలుగుదేశం నాయకులు చైతన్యయాత్రల పేరుతో జిమ్మిక్కు జాతరలకు శ్రీకారం చుట్టారని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే నేడు వ్యవసాయం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ముందుచూపు లేకపోవటంతోనే అతివృష్టి, అనావృష్టిలను ఎదుర్కోలేకపోయామని.... కేవలం తెనాలి డివిజన్‌లోనే 4లక్షల 90వేల ఎకరాల ఆయుకట్టు ఉంటే దానిలో 80వేల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదని మేరుగ తెలిపారు. సాగైన 20వేల ఎకరాల్లోని పంట పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన పైరులో కొంత ధాన్యం రంగు మారి, మరికొంత నూకగా మారిడంతో పాటు దిగుబడి కూడా పూర్తిగా పడిపోయిందన్నారు. మూడు లక్షల 70వేల ఎకరాల్లో సగానికి సగం దిగుబడి కూడా రైతు చేతికి అందిన దాఖలాలు లేవని, ఇటువంటి పరిస్ధితుల్ల పాడైపోయిన ధాన్యం అంతటినీ ప్రభుత్వమే కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి రూ 20వేలు చొప్పున పరిహారం అందించాలని, రెండో పంటకు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.మన జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రైతు సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుధ్ధి లేదని మేరుగ నాగార్జున విమర్శించారు. ప్రత్తిపాటి సవ్యంగా స్పందించని పక్షంలో రైతులతో కలిసి పోరుబాట చేపడతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో వ్యవసాయం పండగలా జరిగిందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు హాయంలో దండగలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించాల్సిన పాలకులే వారిని అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అప్పిరెడ్డి హెచ్చరించారు. -
ఉద్యానవన అధికారులపై మంత్రి పోచారం ఫైర్
హైదరాబాద్ : ఉద్యానవన అధికారులపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ సబ్సిడీలను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని మంత్రి అన్నారు. నిబంధనల పేరుతో అధికారులు రైతులను వేధిస్తున్నారని, ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు సడలించిన విషయం కూడా అధికారులకు తెలియకపోవడం బాధాకరమైన విషయమని మంత్రి పోచారం అన్నారు. ఉద్యానవన అవగాహన సదస్సులో భాగంగా అధికారులు తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు. -
జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండునే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆ రోజు సంబరాలు చేయబోమని, నవనిర్మాణ దీక్ష మాత్రమే చేపడతామన్నారు. సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ ఒకటిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో సీఎం నిర్ణయిస్తారన్నారు. -
పత్తి బేళ్లకు రెక్కలు!
♦ సీసీఐ గోడౌన్ నుంచి రూ.50 లక్షల విలువైన పత్తి మాయం! ♦ రైతుల పేర్లతో దళారీలు, పారిశ్రామికవేత్తల దోపిడీ ♦ రవాణా చార్జీలు కూడా బొక్కేసిన బయ్యర్లు ♦ వ్యవసాయ మంత్రి ఇలాకాలో మాయాజాలం చిలకలూరిపేట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోదాము నుంచి భారీ మొత్తంలో పత్తి బేళ్లు మాయమైన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దళారీలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా రూ.50 లక్షల విలువైన పత్తి బేళ్లు మాయమైన విషయం బయటపడటంతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. కుంభకోణం జరిగింది ఇలా.. ఈ ఏడాది ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవటంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. పెద్దమొత్తంలో పత్తిని దిగుమతి చేసుకొనే చైనా కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవటంతో ధర పతనమైంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. క్వింటా పత్తికి రూ.4,050 మద్దతు ధర ప్రకటించి రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డుల్లో 43 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మార్కెట్ యార్డులో సవాలక్ష కారణాలతో వేధించే బయ్యర్లకు భయపడిన రైతులు ఎప్పట్లాగే ఈసారి కూడా వ్యాపారులు, దళారులకే అమ్మారు. రైతులకు క్వింటాకు రూ.3,500 వరకు చెల్లించిన దళారులు, వ్యాపారులు అదే పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.4,050కు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సీసీఐ అధికారులు వారికి పూర్తి సహకారం అందజేసి తమ వంతు వాటా పొందారని సమాచారం. దీంతోపాటు రవాణా చార్జీలు చెల్లించినట్టు చూపి ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలిసింది. ఇదో రకం దోపిడీ.. నవంబరులో ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రా లు రైతుల ఆదరణ లేక బోసిపోయాయి. కాని రికార్డుల్లో మాత్రం కోనుగోలు కేంద్రంలో వేలు క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్లు నమోదు చేశారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని నేరుగా వ్యాపారులు జన్నింగ్ మిల్లులకు తరలించారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు చేర్చటానికి రవాణా చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాని ఇక్కడ జరిగింది వేరు. సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. రైతుల నుంచి నేరుగా మిల్లులకు పత్తి తరలి పోవటంతో ఇక్కడ రవాణా చార్జీలు ఉండవని తెలిసింది. బయ్యర్లు మాత్రమే రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మాయమైన లారీ మాటేమిటి...? ఈ ఏడాది రెండు నెల కిందట యడ్లపాడు మండలంలో జిన్నింగ్ అనంతరం తరలింపునకు సిద్ధంగా ఉన్న ఓ గోడన్ నుంచి కొన్ని ప్రెస్సింగ్ బేళ్లు మాయమయ్యా యి. వే బిల్లులు, లారీ నంబర్లు తారుమారు చేసి గుర్తుతెలియని వ్యక్తులు రెండు లారీల్లో ప్రెస్సింగ్ బేళ్లు తరలించారు. ఈ సంగతి గోప్యంగా ఉంచిన అధికారులు విచారణ చేపట్టినా ఇంతవరకు ఆచూకీ తేల్చలేకపోయారు. అనంతరం ఈ విషయంపై యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని యడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరావు కూడా ధ్రువీకరించారు. కాగా ఆ రెండు లారీల్లో గోడౌన్ నుంచి తీసుకువెళ్లిన పత్తిబేళ్లను గణపవరం లోని ఒక పారిశ్రామిక వేత్తకు విక్రయించినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త, సీసీఐ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీ స్స్టేషన్లో పంచాయితీ నిర్వహించగా ఎటువంటి కేసులు లేకుండా పత్తిబేళ్లను తిరిగి ఇచ్చేందుకు ఒప్పం దం జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసుల ను సాక్షి వివరణ కోరగా పత్తిబేళ్లు పోయినట్లు తమకు సమాచారం అందలేదని చిలకలూరిపేట రూరల్ సీఐ తెలపటం విశేషం. కాగా జరిగిన అవినీతి దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వ్యవసాయమంత్రి సమాధానం లేకుండానే..
మండలిలో రైతుల సమస్యలపై ముగిసిన చర్చ 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉందంటూ వాయిదా వేసిన చైర్మన్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం లేకుండానే ముగిసింది. గురువారం కౌన్సిల్లో గిట్టుబాటు ధరలు, విద్యుత్ పరిస్థితి, రైతుల ఇతర సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీ లు తమ అభిప్రాయాలను తెలియజేశాక చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలతో పాటు ఇతరత్రా సమాచారంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చేందుకు సంసిద్ధం కాగా, సభ వాయిదాతో ఆయన మిన్నకుండిపోయారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని, ఇప్పటికి 775 మంది రైతులు ఆత్మహత్యల చోటుచేసుకున్నట్లు రైతు స్పందన వేదిక ప్రకటించిందన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చే సహాయాన్ని రూ. లక్షన్నర నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కరెంటు చార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయ సంక్షోభం తప్పడం లేదన్నారు. రైతురాజ్యం, బంగారు తెలంగాణ అంటూ ప్రభుత్వం ఏవేవో మాట్లాడుతోందని, విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని కోరారు. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని కొందరికి చెప్పే అలవాటు ఉంటుందని, చేసే అలవాటు ఉండదని, కానీ తాము అన్నీ అమలుచేసి చూపిస్తామన్నారు. తమకు విజన్డాక్యుమెంట్ అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విత్తన భాండాగారం, భూసార పరీక్ష కార్డులు ఇలా రైతులకు ఉపయోగకరమైన అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులను చైతన్యవంతులను చేసి వారు ఆత్మహత్యల బారినపడకుండా చూడాలని సూచించారు. -
‘అగ్రి’ అవుట్
మంత్రి పదవి నుంచి కృష్ణమూర్తి తొలగింపు వ్యవసాయ ఇంజనీరు ఆత్మహత్యే కారణమా? సాక్షి, చెన్నై : వ్యవసాయ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికారు. సీఎం పన్నీరు సెల్వం సిఫారసుకు రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్లో తరచూ మార్పులు చేర్పులు సహజం. ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా తక్షణం మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకడం సాధారణం. ఈతతంగం అంతా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎంగా ఉన్న సమయంలో సాగేది. అయితే, ఆమె అడుగుజాడల్లో సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. గత వారం రోజులకు పైగా వ్యవసాయశాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తిపై తీవ్ర ఆరోపణ మీడియాల్లో హల్చల్ చేస్తుండడం, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుండడంతో ఆయనకు పదవీ గండం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అందుకు తగ్గ ఎలాంటి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకోలేదు. రెండు రోజుల క్రితం పార్టీ పరంగా ఉన్న పదవిని అగ్రి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నట్టుగా ప్రచారం బయలు దేరింది. వ్యవసాయ శాఖ ఇంజనీరు ఆత్మహత్యలో అగ్రి వ్యవహరించిన తీరే కారణమని తేలినట్టు సమాచారం. ఈ ఆత్మహత్యపై కాంగ్రెస్, పీఎంకేలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మంత్రి ఒత్తిడి తాళలేక ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు గుప్పించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ శనివారం ఈ వ్యవహారంపై స్పందించారు. మంత్రి తప్పు చేయనప్పుడు కేసును సీబీఐకు అప్పగించవచ్చుగా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికే రీతిలో సీఎం పన్నీరు సెల్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు సిఫారసు చేశారు. సీఎం సిఫారసుకు ఆమోద ముద్రను గవర్నర్ తెలియజేయడంతో అగ్రి పదవి ఊడింది. ఆయన వద్ద ఉన్న వ్యవసాయ శాఖతో పాటుగా మరికొన్ని శాఖల్ని సీనియర్ మంత్రి వైద్యలింగంకు అదనంగా అప్పగించారు. పార్టీ పదవి, మంత్రి పదవి ఊడిన దృష్ట్యా, ఆ అధికారి ఆత్మహత్య వెనుక అగ్రి హస్తం ఉందన్న ప్రచారం బయలు దేరింది. ఆయనపై కేసు న మోదు చేసి అరెస్టు చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సస్పెన్షన్ సరిపోదు
అశ్వారావుపేట: అవినీతికి పాల్పడిన అధికారులకు సస్పెన్షన్ పనిష్మెంట్ సరిపోవడం లేదనీ, చర్య చాలా తీవ్రంగా మరెవరూ అవినీతికి పాల్పడకుండా ఉండాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి సూచనలు చేశారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో అధికారుల దోపిడీకి రైతులు బలవుతున్నారన్నారు. బుధవారం పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన రైతుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గింజల ఎంపిక, పురుగు మందులు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోతున్నారన్నారు. ఓసారి నిజామాబాద్ జిల్లాలోని చక్కెర కర్మాగారానికి రాత్రివేళ తాను ఆకస్మికంగా దుప్పటి కప్పుకుని వెళ్లి పరిశీలించగా ఓపైపు గుండా చెరుకురసం బయటకు పోవడాన్ని గుర్తించానన్నారు. ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే.. తనను గుర్తించకుండా లెక్కలేకుండా మాట్లాడారని.. ఆతర్వాత తెలుసుకుని ప్రథేయపడ్డారన్నారు. ఇదే విధంగా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఓపైపు గుండా నూనెను బయటకు పంపేయడం జరిగిందంటే ఇక్కడ అధికారులకు ఎంత నిర్లక్ష్యమో.. ఎంత అవినీతికి అలవాటు పడ్డారో అర్థమవుతోందన్నారు. కర్మాగారం ఓ వ్యాపార సంస్థ కర్మాగారం అనేది ఓ వ్యాపార సంస్థ అని.. ప్రతి కర్మాగారానికి రైతే ముడి వస్తువును సమకూర్చాలన్నారు. ఇక్కడి పామాయిల్ రైతులు గెల లను సరఫరా చేస్తే.. అధికారులు క్రషింగ్ నిర్వహించి దేశానికి చమురును, రైతులకు లాభాలను అందిచాలన్నారు. అశ్వారావుపేట ఆయి ల్ కర్మాగారం చాలా చిన్నదని, ఇక్కడ 20 శా తం ఆయిల్ రికవరీ తప్పకుండా రావాలని సూచించారు. తాను నాలుగు రోజులు కర్మాగారంలో కూర్చుంటే 20 శాతానికి పైగా రికవరీ సాధిస్తానన్నారు. అశ్వారావుపేట ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీని ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతానన్నారు. మహారాష్ట్రలోని చక్కెర ఫ్యాక్టరీని ఒక గంటలో క్లీనింగ్ చేస్తారని.. రోజుకు 8 వేల టన్నుల కెపాసిటీ గల ఫ్యాక్టరీని గంటలో క్లీనింగ్ చే స్తే అశ్వారావుపేట ఫ్యాక్టరీని ఎందుకు కావాలని నెలల తరబడి క్లీనింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి: మంత్రి తుమ్మల దేశంలోనే అత్యధికంగా పామాయిల్ సాగవుతున్న దమ్మపేట, అశ్వారావుపేట మండలాల రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పథకాలను అమలు చేసి ప్రోత్సహించాలని ఆర్అండ్బీ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఏటా 4 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఇప్పించాలని కోరారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దమ్మపేట మండలం అప్పారావుపేటలో రెండో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని.. అశ్వారావుపేట మండలానికి పాత ఫ్యాక్టరీ సరిపోతుందన్నారు. ఇలా దశల వారీగా మండలానికో పామాయిల్ ఫ్యాక్టరీ ఉండేలా కృషి చేస్తానన్నారు. కూలీలను పర్మినెంట్ చేయాలి:ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట పామాయిల్ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలను, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్‌చేయాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంత్రులను కోరారు. బాధ్యతలు పెం చుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెంచితే మోసాలు అరికట్టవచ్చన్నారు. కాంట్రాక్టర్ల ప్రమేయం వల్ల అవినీతి అధికంగా జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు అంకత ఉమామహేశ్వరరావు పొలంలో పండిన 79 కిలోల గుమ్మడికాయను బహుమతిగా అందజేశారు.సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, అశ్వారావుపేట ఎంపీపీ బరగడ కృష్ణారావు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలా జడ్పీటీసీ సభ్యులు అంకత మల్లిఖార్జునరావు, దొడ్డాకుల సరోజిని, రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్, బండి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇతర ఎరువులు కొంటేనే..యూరియా
‘యూరియా కొరత లేదు.. డీలర్లే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం...వ్యవసాయ అధికారులు యూరియా కొరతపై నిఘా పెట్టాలి, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలి..’ ఇవీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటిపుల్లారావు వ్యవసాయాధికారులకు జారీ చేసిన ఆదేశాలు.. ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనే కుదరడం లేదనేందుకు మంత్రిగారి మాటలే సాక్ష్యాలు. జిల్లాలో ఎక్కడాగానీ బస్తా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్న మంత్రుల తీరుపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తే బస్తా యూరియా ఇవ్వని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఈ రబీలోనూ వేసవి పంటలను సాగు చేసిన రైతులను యూరియా కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఏమీ చేయలేని సంకట స్థితిలో ఉన్నారు. దాదాపు నెల రోజులుగా జిల్లాకు ప్రతిపాదనల ప్రకారం రావాల్సిన యూరియా రాకపోవడంతో కొరత తీవ్రమైంది. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రొద్దుటూరుకు శనివారం 16 టన్నుల యూరియా రాగానే గంటలో అయిపోయింది. యూరియా బస్తా ధర రూ. 284లు కాగా కొందరు డీలర్లు అక్కడక్కడ అక్రమంగా నిల్వ చేసుకున్న యూరియాను రూ. 350 నుంచి రూ. 550ల ధరతో కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. కొందరు డీలర్లు రహస్యంగా దాచుకున్న ప్రాంతాలకు రైతులను తీసుకెళ్లి అటు నుంచి అటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైంది. జమ్మలమడుగు మండలానికి 20 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇంత వరకు ఒక టన్ను కూడా రాలేదని వ్యవసాయాధికారులు తెలిపారు. మైదుకూరు డివిజన్‌కు 100 మెట్రిక్ టన్నులు డిమాండ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజంపేట, బద్వేలు డివిజన్లలో వరి నారు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. నాట్ల నుంచి పంటకు యూరియా అవసరం ఉందని, అయితే ఎక్కడా లభించడం లేదని రైతులు ఆవేదనతో తెలిపారు. దీంతో కొందరు డీలర్లు కొరతను సాకుగా తీసుకుని బస్తా రూ. 350 నుంచి రూ.550లకు విక్రయిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పులివెందుల లాంటి ప్రాంతాల్లో కొందరు డీలర్లు ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో యూరియా కొరతపై ప్రజా ప్రతినిధులుగాని, జిల్లా అధికార యంత్రాంగంగాని ఏ మాత్రం స్పందించడం లేదని కడపలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు, అందునా సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు తీరు దారుణమని విమర్శించారు. ఎదుగుదల లేని పంటలు.. జిల్లాలో కుందు, పెన్నా నదీ పరివాహక ప్రాంత గ్రామాలతోపాటు నీటి వనరులున్న ఇతర ప్రాంత రైతులు వరి, దోస, ఉల్లి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, కూరగాయ పంటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలను సాగు చేశారు. ఆయా పంటలకు యూరియా ఎరువు అవసరం ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో ప్రధానంగా కమలాపురం, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చెన్నూరు, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, బి మంఠం, బి కోడూరు, పోరుమావిళ్ల, వేంపల్లె, పెండ్లిమర్రి మండలాల్లో వరి పంట సాగు ఊపందుకుంది. రైతులు నారుపోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పైరు ఎదుగుదలకు ప్రధానంగా రైతులు యూరియా పొలంలో చల్లుతారు. అయితే ఆ ఎరువునకు ఇప్పుడు కొరత ఏర్పడడంతో పంట ఎదుగుదల కావడం లేదు. వైఎస్సార్ జిల్లా అంటే ఇంత చులకనా..: ఈ సీజన్‌కుగాను అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు జిల్లా వ్యవసాయాధికారులు 28,537 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ప్రతిపాదనలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపారు. అయితే ప్రభుత్వం కేవలం 17,242.6 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే మంజూరు చేసింది. అలాగే జనవరి నెలకు 4735 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదనలు పంపగా ఇంత వరకు పిడికెడు యూరియా కూడా జిల్లాకు రాకపోవడం విశేషం. యూరియా కొరత నిజమే జిల్లాలో యూరియా కొరత ఉందని, వెంటనే ఒక రేక్ (2600 మెట్రిక్ టన్నులు) కావాలని కోరాం. ఆ మేరకు రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ అంగీకరించి పంపుతామన్నారు. ఆ రేక్ రాగానే జిల్లాలోని అన్ని మండలాలకు పంపుతాం. ఎక్కడా కొరత రాకుండా చూస్తాం. -జ్ఞానశేఖర్, ఇన్చార్జ్ జేడీ, జిల్లా వ్యవసాయశాఖ -
సమాచారం లేకుండానే కేబినెట్‌కు వస్తారా?
-
సమాచారం లేకుండానే కేబినెట్‌కు వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సరైన సమాచారం లేకుండా మంత్రివర్గ సమావేశానికి ఎలా వస్తారంటూ వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీ యవర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక మిషన్‌పై సీఎం సమీక్షించారు. గతంలో నిర్ణయించిన విధంగా ఏపీ ప్రభుత్వం, ఇక్రిశాట్ల మధ్య ఒప్పందం జరిగిందా అని మంత్రి పుల్లారావును, అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ‘‘ఇక్రిశాట్ అంతర్జాతీయ సంస్థ. అది మన వద్దకు రాదు. మనమే వెళ్లాలి. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా మీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకపోతే ఎలా’’ అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడాన్ని సీఎం ప్రశ్నించగా.. తాము పంపిన ప్రతిపాదనలకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో సీఎం ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఇసుకను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిన అధికారిపై చర్య లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని అధికారులను సస్పెం డ్చేయాలని చెప్పారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు కేటాయించినా వారికి తగినంత ఆదాయం రావడంలేదని పలువురు మంత్రులు చెప్పారు. డ్వాక్రా సంఘాలకు రీచ్‌ల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ.. కొద్ది రోజుల క్రితమే రీచ్‌లను మహిళలకు కేటాయించినందున, మరికొన్ని రోజుల తరువాత సమీక్షించి, నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అర్హులైన వారికి అనేక మందికి పింఛన్లు రావడంలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కె.అచ్చన్నాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. పింఛన్లలో కోత విధించమని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని చెప్పారు. నిబంధనలను మాత్రం మార్చేది లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
పోచారం... రైతుల పాలిట గ్రహచారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రి కావడం రైతుల పాలిట గ్రహచారమని టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలపై అవహేళనగా మాట్లాడిన పోచారం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగేవరకు సభను అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. -
రుణమాఫీ మాటే మరిచారు?
- మంత్రి ప్రత్తిపాటి వివరాలు ప్రకటిస్తారని సభకు తీసుకువచ్చారు - చివరకు మంత్రే గైర్హాజరయ్యారు - స్వయం సహాయక సంఘాల మహిళల ఆగ్రహం చిలకలూరిపేట టౌన్: ‘అంతా మోసం.. రుణమాఫీ చేస్తామన్నారు.. మంత్రి వచ్చి రుణమాఫీ వివరాలు ప్రకటిస్తారని చెప్పి సభకు తీసుకువచ్చారు.. ర్యాలీ నిర్వహించి సభ పెట్టి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అంటూ చేయించారు.. మా ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మాకు తెలియదా.. మాఫీ సంగతి చెప్పరేంటి..’ అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలకసంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్ఆర్టీ సెంటర్లో సభ ఏర్పాటుచేశారు. సభలో మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సభలో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాలపై వివరించి పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ అనంతరం సభ ముగిసిందంటూ ప్రకటించి చైర్‌పర్సన్‌తోపాటు అధికారులు మరో కార్యక్రమానికి తరలివెళ్లారు. అప్పటివరకు స్వయం సహాయక సంఘాల రుణమాఫీపై హామీ లభిస్తుందని ఎదురుచూసిన మహిళలకు నిరాశ ఎదురైంది. రుణమాఫీ ఊసే ఎత్తకుండా సభ ముగించడంతో మహిళలు అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. రుణమాఫీ చేయని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అదిగో.. ఇదిగో అనడం తప్పించి ఒరగబెట్టింది ఏమిలేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆశ పడి ఓట్లు వేశామని, ప్రస్తుతం బ్యాంకులోళ్లు రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతారని, రుణమాఫీపై స్పష్టత ఇస్తారని చెప్పి తమను సభకు తీసుకువచ్చారని వాపోయారు. తీరా రుణమాఫీపై ప్రశ్నిద్దామని వస్తే కార్యక్రమానికి మంత్రి హాజరుకాలేదని, మిగిలినవారు ఈ విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పనులు మానుకొని బిడ్డలను ఇళ్లకాడ వదిలివస్తే ప్రవర్తించే తీరిదా అంటూ సభ నుంచి వెళ్తున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తితోపాటు మెప్మా సిబ్బందిని నిలదీశారు. త్వరలోనే అన్ని సమస్యలను ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వైస్‌చైర్మన్ అక్కడినుంచి తప్పుకున్నారు. సమాధానం చెప్పేవారు లేకపోవడంతో చేసేదిఏమీ లేక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
వ్యవసాయ శాఖలో కొత్తగా 4,442 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4,442 మంది సహాయ వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. గ్రామాల్లో వ్యవసాయదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి.. సకాలంలో వారికి అందుబాటులో ఉండటానికి విస్తరణాధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉద్యానవనం, వ్యవసాయంలో డిప్లొమా చేసిన నిరుద్యోగ యువకులకు దీనివల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆదర్శ రైతు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా విస్తరణాధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మొత్తం 16,841 మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
దేశంలో ప్రతి సాగుభూమికీ నీరు
త్వరలో ప్రధానమంత్రి గ్రామ సించాయీ యోజన ప్రారంభం పాట్నా: వ్యవసాయానికి మరింత ఊతమిచ్చే దిశగా దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి గ్రామ సించాయీ యోజన’ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘దేశంలోని ప్రతి పంట భూమికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే ఈ సించాయీ యోజన(సాగునీటి పథకం) ప్రవేశపెడుతున్నాం. సాగునీరు అందుబాటులో లేకపోతే వ్యవసాయ దిగుబడులు పెంచడం సాధ్యంకాదు. పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ప్రణాళిక రచిస్తున్నాం’’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారమిక్కడ చెప్పారు. ‘‘భూసారాన్ని బట్టి కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి. భూమి సారవంతమైనదైతే అత్యధిక దిగుబడులు సాధించడం సాధ్యమే. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులుకు ఈ పథకం కింద త్వరలోనే భూ సార కార్డులు జారీచేయనుంది. భూ సారాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల సాయం తీసుకుంటాం’’ అని వివరించారు. భూసారాన్ని బట్టి ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడం ద్వారా రైతుకు తోడ్పడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోని 14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతానికే సాగునీరు అందుతోంది. మిగతా చోట్ల వర్షాలే ఆధారం.