ఇతర ఎరువులు కొంటేనే..యూరియా
‘యూరియా కొరత లేదు.. డీలర్లే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం...వ్యవసాయ అధికారులు యూరియా కొరతపై నిఘా పెట్టాలి, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలి..’ ఇవీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటిపుల్లారావు వ్యవసాయాధికారులకు జారీ చేసిన ఆదేశాలు.. ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనే కుదరడం లేదనేందుకు మంత్రిగారి మాటలే సాక్ష్యాలు.
జిల్లాలో ఎక్కడాగానీ బస్తా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్న మంత్రుల తీరుపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తే బస్తా యూరియా ఇవ్వని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఈ రబీలోనూ వేసవి పంటలను సాగు చేసిన రైతులను యూరియా కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఏమీ చేయలేని సంకట స్థితిలో ఉన్నారు. దాదాపు నెల రోజులుగా జిల్లాకు ప్రతిపాదనల ప్రకారం రావాల్సిన యూరియా రాకపోవడంతో కొరత తీవ్రమైంది. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రొద్దుటూరుకు శనివారం 16 టన్నుల యూరియా రాగానే గంటలో అయిపోయింది. యూరియా బస్తా ధర రూ. 284లు కాగా కొందరు డీలర్లు అక్కడక్కడ అక్రమంగా నిల్వ చేసుకున్న యూరియాను రూ. 350 నుంచి రూ. 550ల ధరతో కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. కొందరు డీలర్లు రహస్యంగా దాచుకున్న ప్రాంతాలకు రైతులను తీసుకెళ్లి అటు నుంచి అటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైంది. జమ్మలమడుగు మండలానికి 20 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇంత వరకు ఒక టన్ను కూడా రాలేదని వ్యవసాయాధికారులు తెలిపారు.
మైదుకూరు డివిజన్‌కు 100 మెట్రిక్ టన్నులు డిమాండ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజంపేట, బద్వేలు డివిజన్లలో వరి నారు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. నాట్ల నుంచి పంటకు యూరియా అవసరం ఉందని, అయితే ఎక్కడా లభించడం లేదని రైతులు ఆవేదనతో తెలిపారు. దీంతో కొందరు డీలర్లు కొరతను సాకుగా తీసుకుని బస్తా రూ. 350 నుంచి రూ.550లకు విక్రయిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పులివెందుల లాంటి ప్రాంతాల్లో కొందరు డీలర్లు ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో యూరియా కొరతపై ప్రజా ప్రతినిధులుగాని, జిల్లా అధికార యంత్రాంగంగాని ఏ మాత్రం స్పందించడం లేదని కడపలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు, అందునా సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు తీరు దారుణమని విమర్శించారు.
ఎదుగుదల లేని పంటలు..
జిల్లాలో కుందు, పెన్నా నదీ పరివాహక ప్రాంత గ్రామాలతోపాటు నీటి వనరులున్న ఇతర ప్రాంత రైతులు వరి, దోస, ఉల్లి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, కూరగాయ పంటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలను సాగు చేశారు. ఆయా పంటలకు యూరియా ఎరువు అవసరం ఎక్కువగా ఉంటోంది.
జిల్లాలో ప్రధానంగా కమలాపురం, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చెన్నూరు, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, బి మంఠం, బి కోడూరు, పోరుమావిళ్ల, వేంపల్లె, పెండ్లిమర్రి మండలాల్లో వరి పంట సాగు ఊపందుకుంది. రైతులు నారుపోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పైరు ఎదుగుదలకు ప్రధానంగా రైతులు యూరియా పొలంలో చల్లుతారు. అయితే ఆ ఎరువునకు ఇప్పుడు కొరత ఏర్పడడంతో పంట ఎదుగుదల కావడం లేదు.
వైఎస్సార్ జిల్లా అంటే ఇంత చులకనా..:
ఈ సీజన్‌కుగాను అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు జిల్లా వ్యవసాయాధికారులు 28,537 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ప్రతిపాదనలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపారు. అయితే ప్రభుత్వం కేవలం 17,242.6 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే మంజూరు చేసింది. అలాగే జనవరి నెలకు 4735 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదనలు పంపగా ఇంత వరకు పిడికెడు యూరియా కూడా జిల్లాకు రాకపోవడం విశేషం.
యూరియా కొరత నిజమే
జిల్లాలో యూరియా కొరత ఉందని, వెంటనే ఒక రేక్ (2600 మెట్రిక్ టన్నులు) కావాలని కోరాం. ఆ మేరకు రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ అంగీకరించి పంపుతామన్నారు. ఆ రేక్ రాగానే జిల్లాలోని అన్ని మండలాలకు పంపుతాం. ఎక్కడా కొరత రాకుండా చూస్తాం.
-జ్ఞానశేఖర్, ఇన్‌చార్జ్ జేడీ, జిల్లా వ్యవసాయశాఖ