రైతుబడ్జెట్‌లో పాలమూరుకు ప్రాధాన్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
గద్వాలలో రూ. 10కోట్లతో
దాణా పరిశ్రమాభివృద్ధి సహకార
సమైక్య కర్మాగారం ప్రారంభం
గద్వాల : రాబోయే 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగంలో అన్ని జిల్లాల కంటే పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గద్వాలలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 44 మండలాల్లో 20వేల మంది పాడి రైతులు విజయ డెయిరీకి నిత్యం పాలను అందిస్తున్నారని చెప్పారు. డెయిరీకి అందుతున్న పాల సేకరణలో 2లక్షల లీటర్లు ఉంటుందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా పాలీ హౌస్, గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, పూలు సాగు చేసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పాలీహౌస్‌లకు ప్రభుత్వం 80 నుంచి 90 శాతం రాయితీ ఇస్తుందని తెలిపా రు. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 2,514కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆశించిన స్థాయిలో సహాయం అందలేదన్నారు. తొలకరి వర్షాలకు ముందే నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. బిందుసేద్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంద న్నారు.
నష్టం జరిగితే కంపెనీలపై చర్యలు
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో విత్తనపత్తి సాగులో జరిగిన నష్టంపై కమిటీ వేసి నివేదిక తెప్పించడం జరిగిందన్నారు. విత్త నం ద్వారా పత్తి పంటలకు నష్టం చేకూరితే బాధ్యులైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్‌పత్తి విత్తనాల ద్వారా నష్టపోతే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు రైతులకు రాయితీపై మంజూరైన ట్రాక్టర్లను, రొటొవేటర్, వ్యవసాయ పరికరాలను మంత్రి పోచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ర్ట పాడి పరిశ్రమశాఖ మేనేజింగ్ డెరైక్టర్ నిర్మల, జేసీ రాంకిషన్, ఉద్యానవనశాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్ది, గట్టు తిమ్మప్ప, బండ్ల రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.