వ్యవసాయమంత్రి సమాధానం లేకుండానే..
- మండలిలో రైతుల సమస్యలపై ముగిసిన చర్చ
- 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉందంటూ వాయిదా వేసిన చైర్మన్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం లేకుండానే ముగిసింది. గురువారం కౌన్సిల్‌లో గిట్టుబాటు ధరలు, విద్యుత్ పరిస్థితి, రైతుల ఇతర సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీ లు తమ అభిప్రాయాలను తెలియజేశాక చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలతో పాటు ఇతరత్రా సమాచారంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చేందుకు సంసిద్ధం కాగా, సభ వాయిదాతో ఆయన మిన్నకుండిపోయారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని, ఇప్పటికి 775 మంది రైతులు ఆత్మహత్యల చోటుచేసుకున్నట్లు రైతు స్పందన వేదిక ప్రకటించిందన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చే సహాయాన్ని రూ. లక్షన్నర నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కరెంటు చార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు.
టీడీపీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయ సంక్షోభం తప్పడం లేదన్నారు. రైతురాజ్యం, బంగారు తెలంగాణ అంటూ ప్రభుత్వం ఏవేవో మాట్లాడుతోందని, విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని కోరారు. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని కొందరికి చెప్పే అలవాటు ఉంటుందని, చేసే అలవాటు ఉండదని, కానీ తాము అన్నీ అమలుచేసి చూపిస్తామన్నారు. తమకు విజన్‌డాక్యుమెంట్ అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విత్తన భాండాగారం, భూసార పరీక్ష కార్డులు ఇలా రైతులకు ఉపయోగకరమైన అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులను చైతన్యవంతులను చేసి వారు ఆత్మహత్యల బారినపడకుండా చూడాలని సూచించారు.