కేసీఆర్పై కోపాన్ని..ఆయనపై చూపారు
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేకపోయారన్నారు. ప్రజలు కేసీఆర్పై ఉన్న కోపాన్ని ఉద్యమ నేత దేవీప్రసాద్పై చూపించాల్సి వచ్చిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో కక్ష సాధింపుగా తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
జాతీయ గీతం సందర్భంగా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్తామన్నప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదని ఎర్రబెల్లి అన్నారు. సభలో గొడవకు సంబంధించిన వీడియో పుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తప్పు చేసి ఉంటే ఉరిశిక్షకైనా సిద్ధమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలంగాణ వ్యతిరేకులని ఆయన మండిపడ్డారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాదరావు ఓటమి పాలైన విషయం తెలిసిందే.