మా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వ తప్పులను నిలదీస్తామన్న భయంతో తమను బయటకు పంపారని టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కుటిలనీతిని గమనించి తమకు న్యాయం చేయాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు చెప్పారు. సస్పెన్షన్ అంశంతోపాటు మంత్రిగా తలసాని కొనసాగింపు, టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు గుర్తించడం వంటి అంశాలపై ఎర్రబెల్లి నాయకత్వంలో ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్, వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వివేక్, మాదవరం కృష్ణారావు, గాంధీలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు ప్రారంభమైన రోజు గవర్నర్ సమక్షంలోనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని, వారి నుంచి తప్పించుకునేందుకే బల్లలపైకి ఎక్కిన విషయాన్ని వివరించినట్లు తెలిపారు.
సీఎం డెరైక్షన్‌లో మంత్రి హరీశ్‌రావు స్పీకర్ పాత్ర పోషిస్తూ ‘దయాకర్‌రావుకు మైక్ ఇవ్వండి. క్షమాపణలు చెప్పమనండి’ అని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో ఫుటేజ్‌లో అధికారపక్షం దాడులను కట్‌చేసి చూపారని, పూర్తి వీడియో చూడాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి మంత్రిగా కొనసాగిస్తున్న విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. ఏ చట్టం ప్రకారం టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు మండలి చైర్మన్ చెబుతారని, పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించకుండా టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించడమేంటని గవర్నర్‌ను అడిగినట్లు చెప్పారు. ఈ అంశాలపై గవర్నర్ రెండు రోజుల్లో స్పందించకుంటే సోమవారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.
మీ హీరో రాలేదా..!: బడ్జెట్ సమావేశాల సందర్భం గా రేవంత్‌రెడ్డి చేసిన గొడవ గవర్నర్ మరచిపోలేదు. శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు వచ్చిన సమయంలో ‘ మీ హీరో (రేవంత్‌రెడ్డి) రాలేదా?’ అని వారిని ప్రశ్నించారు. కొడంగల్ నుంచి వస్తున్నారు. లేట్ అయిందని ఎర్రబెల్లి చెప్పడంతో ‘అలాగా..!’ అని నవ్వినట్టు అక్కడున్న ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు.