చాయ్‌ తాగుతవా? అని అడుగుతోంది! | Errabelli Dayakar Rao About Pension Scheme In Assembly | Sakshi
Sakshi News home page

చాయ్‌ తాగుతవా? అని అడుగుతోంది’

Published Sun, Sep 22 2019 3:52 AM | Last Updated on Sun, Sep 22 2019 8:19 AM

Errabelli Dayakar Rao About Pension Scheme In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా పింఛన్లపై సభ్యులు బాల్క సుమన్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ సన్నివేశాన్ని చెప్పా రు. ‘మా జిల్లాలో రాయ్‌పర్తి గుండా వెళ్తుంటే ఎప్పుడూ ఓ ముసలావిడ నాకు అడ్డువచ్చేది. కలిసినప్పుడల్లా రూ.100, రూ.200 ఇస్తుండే వాణ్ని. ఈ మధ్య అలా ఇస్తుంటే తీసుకోలే. కేసీఆర్‌ నా కొడుకు లెక్క పింఛన్‌ ఇస్తుండు. ఇప్పటిదాకా నన్ను పలకరించని నా కోడలు అత్తా చాయ్‌ తాగుతవా? కాఫీ తాగుతవా? అని అడుగుతోంది’ అని చెప్పిందన్నారు. ఇలా ఆసరా పింఛన్లతో వృద్ధుల్లో కొత్త ఆశలు వచ్చాయన్నారు. రాష్ట్రం పింఛన్లపై రూ.9,192.88 కోట్లు, కేంద్రం రూ.209.60 కోట్లు ఖర్చు చేస్తున్నాయని వెల్లడించారు. 

హైకోర్టును తరలించం: ఇంద్రకరణ్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టును తరలించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో పద్దులో జరిగిన చర్చలో ఎంఐఎం సభ్యుడు మొయినుద్దీన్‌ లేవనెత్తిన అంశంపై మంత్రి స్పందించారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలేవీ లేవని ఆయన వివరించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో 23 కొత్త జిల్లాలకు కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని, 1,554 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement