సీఎం కేసీఆర్పై జానారెడ్డి ఫైర్
హైదరాబాద్: అలివికానీ హామీలు ఇచ్చింది తామా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీనా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. 'సమస్యలు పట్టించుకోకుండా నిబంధనలు గుర్తు చేస్తారా అవి తెలియదా మాకు' అంటూ ఆయన మండిపడ్డారు. సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయం ప్రజలు, రైతులు తప్పకుండా గుర్తించాలని చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాలు ఆందోళనకు దిగడంతో వారిపై స్పీకర్ మూకుమ్మడిగా సస్పెన్షన్ వేటు వేశారు.
మజ్లిస్ పార్టీ, జానారెడ్డి మినహా మొత్తం 29మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, సస్పెన్షన్ ఎమ్మెల్యేలతోపాటే బయటకు వచ్చిన జానారెడ్డి విపక్ష సభ్యుల తరుపున మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విరుచుపడ్డారు. ఇది ప్రజాసమస్యలను చర్చించే వేదిక కాదని, నిరంకుశ పరిపాలకులు ఉన్న వేదిక అని ఆరోపించారు. రెండు రోజులపాటు రైతుల ఆత్మహత్యలపైనే చర్చ చేపట్టామని ప్రభుత్వం చెప్పినా అందులో రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయిందని, స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభను స్తంభింపజేయడం తమ ఉద్దేశం కాదని, ఏ సమస్య ఉన్నా ముందు రైతుల సమస్యలు తీర్చేలా వారి ఘోషను ప్రభుత్వానికి వినిపించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం కనీసం విజ్ఞప్తి చేసే అవకాశం లేకుండా చేసిందని చెప్పారు. రైతులకు రుణమాఫీని తక్షణమే ప్రకటించాలని, బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించాలన్నదే తమ ముఖ్యమైన డిమాండ్ అని, అలాగైతే రైతుల ఆత్మహత్యలు నిలువరించినట్లవుతుందని చెప్పాలనుకున్నా ప్రభుత్వం తమను లెక్కచేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, నిబంధనలను తమకు గుర్తు చేస్తున్నారని, మాకు నిబంధనలు తెలియదా అని నిలదీశారు. అలివికానీ హామీలు ఇచ్చిన టీఆర్ఎస్కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు.