ప్రతిపక్షం సస్పెన్షన్
- 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు
- పార్టీ ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్
- వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన.. సభలో గందరగోళం
- ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్
- ఇది దారుణం.. సమన్యాయం పాటించడం లేదు: జానా ఫైర్
- సభకు రావడం కన్నా ప్రజల్లోకి వెళ్లడమే మేలని ఆవేదన.. సభ నుంచి వాకౌట్
- గతంలో జై తెలంగాణ అన్నందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్
- రచ్చ చేస్తే ఊరుకోబోమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ రెండోరోజు అట్టుడికింది. కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానం కాక రేపింది. పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన తమ తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో స్పీకర్ మధుసూదనాచారి.. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు. కాసేపటికే టీడీపీ కూడా ఇదే అంశంపై పట్టుబట్టడంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఒకరోజు సస్పెండ్ చేశారు. శనివారం సభ ప్రారంభం కాగానే.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. గందరగోళం మధ్యే స్పీకర్... వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్త రాలను చేపట్టారు.
దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటోందంటూ మండిపడ్డారు. 9 మంది కాంగ్రెస్ సభ్యుల పేర్లను చదివి వారిని సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ సభ్యులు ఎవరి స్థానంలోకి వారు వెళ్లిపోవాలని స్పీకర్ సూచించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్ రెడ్డి, ఎన్.పద్మావతి రెడ్డి, వంశీచంద్ రెడ్డిలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సస్పెన్షన్‌కు గురైన సభ్యులు సభలో ఆందోళన కొనసాగించడంతో ప్రభుత్వం మార్షల్స్‌ను రంగంలోకి దింపింది. సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ సభ్యులను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. స్పీకర్ పొడియం వద్ద వెళ్లకు పోయినా తనను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని మల్లు భట్టి విక్రమార్క ఆరోపిస్తూ సభ నుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో మార్షల్స్ ఆయన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు.
అసెంబ్లీకి రాకుండా ప్రజల్లోకి వెళ్లాలనిపిస్తోంది: జానా
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ సమన్యాయాన్ని పాటించలేదని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తప్పుబట్టారు. వాయిదా తీర్మానంపై మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. వెల్‌లోకి వెళ్లకపోయినా భట్టి విక్రమార్కను సస్పెండ్ చేశారని, ఆ తర్వాతైనా ఆయనకు ఒక అవకాశాన్ని కల్పిస్తే బాగుండేదన్నారు. ఈ అసెంబ్లీకి రాకుండా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం తనకు కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచారని, దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో 15–20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా అక్కడ విపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేదన్నారు. బీఏసీ నిర్ణయాల ప్రకారమే సభ జరుగుతోందా? ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చిస్తామని గతంలో ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడైనా అంగీకరించారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు.
జై తెలంగాణ అంటే గతంలో సస్పెండ్ చేశారు: హరీశ్
సభల్లో మాట్లాడలేకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటోందని హరీశ్ మండిపడ్డారు. శుక్రవారంనాటి సమావేశాల్లో పూర్తిగా ప్రభుత్వమే పై చేయి సాధించిందని, విపక్షాలు విఫలమయ్యాయని ప్రతికల్లో రావడంతోనే కాంగ్రెస్ సభను అడ్డుకుంటోందన్నారు. గతంలో జై తెలంగాణ అన్నందుకు, పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులు వద్దన్నందుకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న జానారెడ్డి ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. అప్పట్లో అసెంబ్లీలో ‘జై తెలంగాణ’ నినాదాన్ని నిషేధించారన్నారు. సభకు అవాంతరం కలిగించడంతో పాటు అందుకు ఇతరులను ప్రోత్సహించినందుకే భట్టి విక్రమార్కను సస్పెండ్ చేశామన్నారు. రచ్చ చేస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు.
టీడీపీ సభ్యులూ సస్పెండ్
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, జానారెడ్డి వాకౌట్ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని టీడీపీఎల్పీ నేత ఎ.రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో పొడియం వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగించారు. దీంతో రేవంత్ రెడ్డి, వీరయ్యను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మార్షల్స్ వారిద్దరిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
త్వరగా నిర్ణయం తీసుకోండి: బీజేపీ
పార్టీ ఫిరాయింపులపై ఇటీవల న్యాయస్థానాలు సైతం స్పందించాయని.. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని బీజేపీఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. వెల్‌లోకి వచ్చిన సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని సమర్థించారు.
ప్రయత్నాలు చేస్తున్నం: స్పీకర్
పార్టీ ఫిరాయింపులపై చర్యల అంశం తన పరిధిలోనే ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. విపక్ష సభ్యులు కావాలని సభకు అడ్డుతగలడం బాధాకరమని అన్నారు.