'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర' | ysrcp leader meruga nagarjuna fires on ap agriculture minister | Sakshi
Sakshi News home page

'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర'

Published Fri, Dec 4 2015 7:21 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర' - Sakshi

'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర'

గుంటూరు: అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్ధితులు రాష్ట్రంలో దాపురించాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పట్టించుకోకుండా తెలుగుదేశం నాయకులు చైతన్యయాత్రల పేరుతో జిమ్మిక్కు జాతరలకు శ్రీకారం చుట్టారని ఆయన ధ్వజమెత్తారు.

గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే నేడు వ్యవసాయం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ముందుచూపు లేకపోవటంతోనే అతివృష్టి, అనావృష్టిలను ఎదుర్కోలేకపోయామని.... కేవలం తెనాలి డివిజన్‌లోనే 4లక్షల 90వేల ఎకరాల ఆయుకట్టు ఉంటే దానిలో 80వేల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదని మేరుగ తెలిపారు.

సాగైన 20వేల ఎకరాల్లోని పంట పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన పైరులో కొంత ధాన్యం రంగు మారి, మరికొంత నూకగా మారిడంతో పాటు దిగుబడి కూడా పూర్తిగా పడిపోయిందన్నారు. మూడు లక్షల 70వేల ఎకరాల్లో సగానికి సగం దిగుబడి కూడా రైతు చేతికి అందిన దాఖలాలు లేవని, ఇటువంటి పరిస్ధితుల్ల పాడైపోయిన ధాన్యం అంతటినీ ప్రభుత్వమే కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి రూ 20వేలు చొప్పున పరిహారం అందించాలని, రెండో పంటకు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.మన జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రైతు సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుధ్ధి లేదని మేరుగ నాగార్జున విమర్శించారు. ప్రత్తిపాటి సవ్యంగా స్పందించని పక్షంలో రైతులతో కలిసి పోరుబాట చేపడతామని హెచ్చరించారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో వ్యవసాయం పండగలా జరిగిందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు హాయంలో దండగలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించాల్సిన పాలకులే వారిని అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అప్పిరెడ్డి  హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement