ప్రత్తిపాటి దిష్టిబొమ్మ దహనం
తెనాలిరూరల్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు కార్యకర్తలు కొలకలూరులో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సమితి డివిజన్ అధ్యక్షుడు చిలకా కిరణ్‌మాదిగ మాట్లాడుతూ మాదిగలు కృష్ణమాదిగ వెంట లేరన్న ప్రత్తిపాటి పుల్లారావు మాటలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు (కిరణ్‌బాబు) మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేక అన్ని వర్గాల వ్యతిరేకతను చవిచూస్తోందన్నారు. కాపుల ఉద్యమం, మాదిగల నిరసనల వెనుక వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందన్న మంత్రులు, టీడీపీ నాయకుల ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఐకు స్వల్ప గాయాలు..
నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. రాస్తారోకో విరమించాలని ఆదేశించారు. మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా తాలూకా ఎస్‌ఐ శివరామకృష్ణ అడ్డుకున్నారు. అరుునా కార్యకర్తలు బొమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మంటల సెగకు ఎస్‌ఐ కనుబొమలు, నొసలు కంతమేర కమురుకుపోయాయి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొన్నెకంటి రమేష్ చొక్కాపై పెట్రోలు పడి మంటలు అంటుకోగా కార్యకర్తలు ఆర్పి వేశారు. ఎస్‌ఐకు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స చేయించారు. కార్యకర్తలు గ్రామ కూడలిలోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.
ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు...
సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాలుకా సెంటర్‌లో మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గరికపాటి రవికుమార్ మాదిగ, వీహెచ్‌పీఎస్ నియోజకవర్గ నాయకుడు మంగళగిరి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.