ఇక సమరమే
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం పాడేరులో నిర్వహించిన తొలి అఖిలపక్ష సమావేశంలో విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖనిజ తవ్వకాలను వ్యతిరేకించాయి. ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించాయి. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించాయి. ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించాయి.
- బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలు సిద్ధం
- సంఘటితంగా అడ్డుకోవాలని నిర్ణయం
- 3న మండల కేంద్రాల్లో ఆందోళన
- అఖిలపక్ష సమావేశంలో తీర్మానం
పాడేరు: మన్యంలో బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపించారు. బాక్సైట్ మాట ఎత్తనివ్వకుండా ఆది వాసీలు, గిరిజన సంఘాలను పోలీసులు నిర్బంధానికి గురి చేస్తున్నారని వాపోయారు. స్థానిక గిరిజన భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సారథ్యంలో మంగళవారం నిర్వహించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించారు. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు.
ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించారు. ఆదివాసీలకు ఎరవేసి విలువైన ఖనిజాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాల నేతలు ధ్వజమెత్తారు. ఐక్య ఉద్యమాలతో అడ్డుకోవాలని, దీనికి అఖిలపక్షాలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, సీపీఎం, గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. గత ఎన్నికల ముందు బాక్సైట్‌ను వ్యతిరేకించిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలే ఇప్పుడు తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
ఆ రెండు పార్టీల నేతలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూ గిరిజనులను మభ్యపెడుతున్నారని దుయ్యబ ట్టారు. ఇటీవల జర్రెలలో ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశానికి తనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టకుంటే పోలీసుల నుంచి ఇటువంటి నిర్బంధ చర్యలు ఎందుకని నిలదీశారు. గిరిజనులకు జీవన్మరణ సమస్య అయిన ఈ ఉద్యమానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకుడు శంకురాజు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి పేరుతో బాక్సైట్ తవ్వకాలు అవసరం లేదని, కాఫీతో మన్యానికి మంచి భవిష్యత్ ఉందన్నారు.
బాక్సైట్ తవ్వితే పర్యావరణానికి ముప్పు తప్పదన్నారు. వ్యవసాయం, అడవులు నాశనమవుతాయని అన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి శంకరరావు, ఏపీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ బాక్సైట్ వెలికితీస్తే గిరిజనులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆదివాసీలకు వంద ఉద్యోగాలు రావని, 200 పై చిలుకు గ్రామాలు ధ్వంసమవుతాయన్నారు.
ఏపీ గిరిజన సంఘం బాక్సైట్ ప్రభావిత 200 గ్రామాల్లో రెండు వారాలపాటు పాదయాత్రతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతుందని, ఐక్య ఉద్యమాలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జి.మాడుగుల ఎంపీపీ ఎం.వి.గంగరాజు మాట్లాడుతూ బాక్సైట్ వ్యవహారంపై చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఉద్యమం తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.