హుజూర్‌నగర్ : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డిలు కోరారు. గురువారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వరి సాగు చేసిన రైతులకు తీరా పంట చేతికి అంది వచ్చిన దశలో అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందన్నారు.
ఈదురు గాలులు, వడగండ్ల వానతో వరి చేలు నేలకొరిగాయన్నారు. ధాన్యం రాలిపోవడంతో పాటు వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తోటలలో మామిడి కాయలు కూడా రాలిపోవడమేగాక చెట్లు విరిగిపోయాయన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
వెంటనే రెవెన్యూ అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, పులిచింతల వెంకటరెడ్డి, కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, జడరామకృష్ణ, పిల్లి మరియదాసు, మర్రి రవీందర్‌రెడ్డి, దేవరకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రెతులను ఆదుకోవాలి: వైఎస్సార్‌సీపీ
Published Fri, Apr 24 2015 4:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement