- మంత్రి ప్రత్తిపాటి వివరాలు ప్రకటిస్తారని సభకు తీసుకువచ్చారు
- చివరకు మంత్రే గైర్హాజరయ్యారు
- స్వయం సహాయక సంఘాల మహిళల ఆగ్రహం
చిలకలూరిపేట టౌన్: ‘అంతా మోసం.. రుణమాఫీ చేస్తామన్నారు.. మంత్రి వచ్చి రుణమాఫీ వివరాలు ప్రకటిస్తారని చెప్పి సభకు తీసుకువచ్చారు.. ర్యాలీ నిర్వహించి సభ పెట్టి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అంటూ చేయించారు.. మా ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మాకు తెలియదా.. మాఫీ సంగతి చెప్పరేంటి..’ అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలకసంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో సభ ఏర్పాటుచేశారు. సభలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
సభలో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాలపై వివరించి పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ అనంతరం సభ ముగిసిందంటూ ప్రకటించి చైర్‌పర్సన్‌తోపాటు అధికారులు మరో కార్యక్రమానికి తరలివెళ్లారు. అప్పటివరకు స్వయం సహాయక సంఘాల రుణమాఫీపై హామీ లభిస్తుందని ఎదురుచూసిన మహిళలకు నిరాశ ఎదురైంది. రుణమాఫీ ఊసే ఎత్తకుండా సభ ముగించడంతో మహిళలు అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. రుణమాఫీ చేయని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అదిగో.. ఇదిగో అనడం తప్పించి ఒరగబెట్టింది ఏమిలేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆశ పడి ఓట్లు వేశామని, ప్రస్తుతం బ్యాంకులోళ్లు రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతారని, రుణమాఫీపై స్పష్టత ఇస్తారని చెప్పి తమను సభకు తీసుకువచ్చారని వాపోయారు. తీరా రుణమాఫీపై ప్రశ్నిద్దామని వస్తే కార్యక్రమానికి మంత్రి హాజరుకాలేదని, మిగిలినవారు ఈ విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పనులు మానుకొని బిడ్డలను ఇళ్లకాడ వదిలివస్తే ప్రవర్తించే తీరిదా అంటూ సభ నుంచి వెళ్తున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తితోపాటు మెప్మా సిబ్బందిని నిలదీశారు. త్వరలోనే అన్ని సమస్యలను ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వైస్‌చైర్మన్ అక్కడినుంచి తప్పుకున్నారు. సమాధానం చెప్పేవారు లేకపోవడంతో చేసేదిఏమీ లేక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
రుణమాఫీ మాటే మరిచారు?
Published Fri, Oct 3 2014 3:30 AM | Last Updated on Mon, May 28 2018 2:46 PM
Advertisement
Advertisement