ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతి యేడాది నకిలీ విత్తనాల బారినపడి వేలాది మంది రైతులు మోసపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. కంపెనీలు, డీలర్లు మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసి నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు కూడా డిమాండ్ పెరగడంతో అప్పటికప్పుడు నకిలీ సీడ్స్‌ను సృష్టించి రైతులకు అంటగడుతున్నాయి. అమాయక రైతులు వారి మోసానికి గురై సాగులో పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు.
ప్రభుత్వం ప్రతి యేడాది నకిలీ విత్తనాల దందాను అరికడతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి మోసాలను మొదటినుంచే అదుపు చేయడంలో విఫలమవుతోంది. తాజాగా బుధవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. జిల్లాలోనూ గ్రామాల్లోకి ఇలాంటి కేటుగాళ్లు మళ్లీ చొరబడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలకు సంబంధించి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు.
పత్తి విత్తన రకానికి సంబంధించి బడా భూస్వాముల చేలలో ఆ రకం విత్తనాలను సాగు చేయడం ద్వారా ఇంత కాత, పూత వస్తుందని డీలర్లు రైతులకు చూపించి ఎరవేయడం వారికి ఈ దందాలో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వానకాలం పంటల సాగుకు ముందే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సంయుక్తంగా తనిఖీలు చేపడితే దీన్ని అరికట్టవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ టాస్క్ ప్రారంభం కాకపోవడం చోద్యమే.
గతేడాది వేల ఎకరాల్లో నష్టం..
గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా వేల ఎకరాల్లో రైతులు పంట నష్టం చవిచూశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఒక రకం పత్తి విత్తనాలను దాదాపు 3500 మంది రైతులు 8800 ఎకరాల్లో సాగు చేశారు. బేల, జైనథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ విత్తనం సాగు చేసిన రైతుకు ఎకరానికి రెండు క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వచ్చింది. సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల పైబడి దిగుబడి రావాలి. దీంతో నష్టపోయిన రైతులందరు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు.
దీంతో శాస్త్రవేత్తలతో పంట చేలల్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2007 కాటన్‌సీడ్ యాక్ట్ ప్రకారం విత్తనం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త, ఎక్కువ పంట నష్టపోయిన గ్రామానికి సంబంధించి ఒక ప్రతినిధి, విత్తన కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇతర విత్తనాల పరంగా సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ నాసిరకం పత్తి విత్తనాల కారణంగా రెండు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు.
మిగతా మూడున్నర క్వింటాళ్ల పత్తిని నష్టపోయినందునా దాని పరిహారం కనీస మద్దతు ధర ఆధారంగా చెల్లించాలని ఆదేశించారు. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ.4320 కాగా, 3500 మంది రైతులకు 8800 ఎకరాల్లో సుమారు రూ.13 కోట్లు రైతులకు చెల్లించాలని ఇటీవల స్పష్టం చేశారు. దానికి మార్చి 16లోగా చెల్లించాలని కంపెనీ ప్రతినిధులకు గడువు విధించారు. అయితే ఆ కంపెనీ చెల్లిస్తుందా లేదో తెలియదు. ప్రభుత్వం నకిలీ విత్తనాల మోసాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనబడటం లేదు.
పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలి
ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేసి నకిలీ విత్తన మోసాలను అరికట్టాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. రైతులను మోసం చేసేవారిని వదలకూడదు. ఖమ్మంలో మిర్చి సీడ్స్ నకిలీవి విక్రయించిన కంపెనీపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనూ గతేడాది నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏకం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నష్టానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారణ చేసింది. వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– బాలూరి గోవర్ధన్‌రెడ్డి,
టీఆర్‌ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు
సంయుక్తంగా తనిఖీలు
రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేందుకు బృందాలను మండల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల బారిన పడకూడదు. కంపెనీలు, డీలర్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దు.
– ఆశకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment