decieved
-
అమెజాన్‌ను మోసగించిన ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను మోసగించిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆన్లైన్ ద్వారా 300 వస్తువులను ఆర్డర్ చేసి డెలివరీ అయ్యాక.. రాలేదంటూ మోసానికి పాల్పడ్డారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ‘నిందితులు అమెజాన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి డెలివరీ కాలేదంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. ఇలా ఒక్కో ఆర్డర్ మీద రెండు వస్తువులను దక్కించుకున్నారు. సెల్ ఫోన్లను బుక్ చేసి డెలివరీ అయ్యాక తక్కువ ధరకు ఓఎల్ఎక్స్లో అమ్ముకున్నారు. ఆర్డర్ చేసిన ప్రతీసారి ఒక కొత్త సిమ్‌ను ఉపయోగించారు. అనుమానం రాకుండే ఉండేందుకు వివిధ ప్రదేశాల నుంచి ఆర్డర్ చేసేశారు. వారి నుంచి 10 లక్షల 75 వేల రూపాయల నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నాం. 800 ఫోన్లు బుక్ చేసి అదనంగా 800 ఫోన్లను దక్కించుకున్నార’ని వివరించారు. -
అడ్డంగా బుకాయింపు
ఏలూరు టౌన్ : ఏలూరులోని ఒక బంగారు వ్యాపారి కుమార్తెను మోసం చేసి, బెదిరించి, భయపెట్టి భారీగా బంగారు ఆభరణాలు గుంజేసిన జనసేన కార్యకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సేవాదళ్ సమన్వయకర్తగా సింహాద్రి బాలు నియమితుడయ్యారు. ఈ కేసులో దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్ అలియాస్ బాలు, పిల్లా సాయి దేవేంద్రనాయుడు కీలకవ్యక్తులుగా ఉన్నారు. వీరంతా తొలుత పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో పుట్టినరోజు వేడుకలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు పెద్దెత్తున చేస్తూ ప్రచారం పొందారు. అనంతరం జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి యూత్, విద్యార్థులను సమీకరిస్తూ పార్టీ కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే పార్టీ సేవాదళ్ జిల్లా కోఆర్డినేటర్ మారిశెట్టి పవన్ బాలాజీ, కొప్పిశెట్టి వీరబాబు, పార్టీ నాయకులు సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ శనివారం హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. యువతిని మోసం చేసిన కేసులో నిందితులుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయిన సింహాద్రి బాలు, దత్తి బాలాజీ, దేవేంద్రనాయుడు తదితరులకు జనసేన పార్టీతో ఏ విధమైన సంబంధాలు లేవని, అసలు పార్టీ సభ్యులుగా కూడా లేరని ప్రకటించారు. జనసేన నుంచి బాలుకు వచ్చిన అధికారిక పత్రం ఈ ప్రకటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏలూరులో గతేడాది నవంబర్‌లో జనసేన ఔత్సాహికుల వేదికలో పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇతర రాష్ట్ర ముఖ్యనేతల సమావేశాల్లోనూ బాలు వారి వెన్నంటే ఉన్నాడు. అతడు పార్టీకి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే నాయకులు హాజరయ్యారు. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనల్లోనూ నాయకుల వెంట నిందితులంతా పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. బుకాయింపుపై సర్వత్రా విమర్శలు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదైన వెంటనే అసలు పార్టీ కార్యకర్తలే కాదంటూ బుకాయించటాన్ని పార్టీలోని యువత, కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేస్తే నాయకులైనా, కార్యకర్తలైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రకటించకుండా మా పార్టీకేమీ సంబంధం లేదని, అంతా మీడియా సృష్టేనంటూ అపవాదు మోపటంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పదిరోజులు దర్యాప్తు చేసి, విచారణలో వెల్లడైన విషయాలను ఏకంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడిస్తే ఆ విషయాలపైనా పార్టీ నేతలు కామెంట్లు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే పెదవివిరుస్తున్నారు. పోలీస్ అధికారులు పదిరోజులు దర్యాప్తు చేసిన అనంతరం, కేసులో నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. స్వయంగా ఎస్పీ రవిప్రకాష్, విచారణ చేసిన ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరాలు తెలిపారు. కానీ జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసులను, మీడియాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే వ్యతిరేకిస్తున్నారు. తప్పుచేస్తే శిక్ష తప్పదని, చట్టానికి ఎవరైనా ఒక్కటేనని, కానీ జనసేన పార్టీలో జెండా మోస్తే చివరికి దక్కే ఫలితం ఇదేనా అంటూ కార్యకర్తలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోసగించిన ముఠాతో జనసేనకు సంబంధం లేదు ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఇటీవల జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతులను మోసగించి బంగారు ఆభరణాలు తీసుకుని జల్సాలు చేసి పోలీసులకు పట్టుబడిన ముఠాకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ మారిశెట్టి పవన్ బాలాజీ స్పష్టం చేశారు. వి విలేకరుల సమావేశంలో మాట్లాడుతోన్న పవన్ బాలాజీ శనివారం స్థానిక రెవెన్యూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సంఘ విద్రోహశక్తులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రోత్సహించదన్నారు. ఈ కార్యక్రమంలో పి.సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ పాల్గొన్నారు. -
విత్తన కేటుగాళ్లు వస్తున్నారు..!
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతి యేడాది నకిలీ విత్తనాల బారినపడి వేలాది మంది రైతులు మోసపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. కంపెనీలు, డీలర్లు మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసి నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు కూడా డిమాండ్ పెరగడంతో అప్పటికప్పుడు నకిలీ సీడ్స్‌ను సృష్టించి రైతులకు అంటగడుతున్నాయి. అమాయక రైతులు వారి మోసానికి గురై సాగులో పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రతి యేడాది నకిలీ విత్తనాల దందాను అరికడతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి మోసాలను మొదటినుంచే అదుపు చేయడంలో విఫలమవుతోంది. తాజాగా బుధవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. జిల్లాలోనూ గ్రామాల్లోకి ఇలాంటి కేటుగాళ్లు మళ్లీ చొరబడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలకు సంబంధించి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు. పత్తి విత్తన రకానికి సంబంధించి బడా భూస్వాముల చేలలో ఆ రకం విత్తనాలను సాగు చేయడం ద్వారా ఇంత కాత, పూత వస్తుందని డీలర్లు రైతులకు చూపించి ఎరవేయడం వారికి ఈ దందాలో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వానకాలం పంటల సాగుకు ముందే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సంయుక్తంగా తనిఖీలు చేపడితే దీన్ని అరికట్టవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ టాస్క్ ప్రారంభం కాకపోవడం చోద్యమే. గతేడాది వేల ఎకరాల్లో నష్టం.. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా వేల ఎకరాల్లో రైతులు పంట నష్టం చవిచూశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఒక రకం పత్తి విత్తనాలను దాదాపు 3500 మంది రైతులు 8800 ఎకరాల్లో సాగు చేశారు. బేల, జైనథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ విత్తనం సాగు చేసిన రైతుకు ఎకరానికి రెండు క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వచ్చింది. సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల పైబడి దిగుబడి రావాలి. దీంతో నష్టపోయిన రైతులందరు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు. దీంతో శాస్త్రవేత్తలతో పంట చేలల్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2007 కాటన్‌సీడ్ యాక్ట్ ప్రకారం విత్తనం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త, ఎక్కువ పంట నష్టపోయిన గ్రామానికి సంబంధించి ఒక ప్రతినిధి, విత్తన కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇతర విత్తనాల పరంగా సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ నాసిరకం పత్తి విత్తనాల కారణంగా రెండు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. మిగతా మూడున్నర క్వింటాళ్ల పత్తిని నష్టపోయినందునా దాని పరిహారం కనీస మద్దతు ధర ఆధారంగా చెల్లించాలని ఆదేశించారు. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ.4320 కాగా, 3500 మంది రైతులకు 8800 ఎకరాల్లో సుమారు రూ.13 కోట్లు రైతులకు చెల్లించాలని ఇటీవల స్పష్టం చేశారు. దానికి మార్చి 16లోగా చెల్లించాలని కంపెనీ ప్రతినిధులకు గడువు విధించారు. అయితే ఆ కంపెనీ చెల్లిస్తుందా లేదో తెలియదు. ప్రభుత్వం నకిలీ విత్తనాల మోసాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనబడటం లేదు. పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలి ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేసి నకిలీ విత్తన మోసాలను అరికట్టాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. రైతులను మోసం చేసేవారిని వదలకూడదు. ఖమ్మంలో మిర్చి సీడ్స్ నకిలీవి విక్రయించిన కంపెనీపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనూ గతేడాది నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏకం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నష్టానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారణ చేసింది. వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు సంయుక్తంగా తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేందుకు బృందాలను మండల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల బారిన పడకూడదు. కంపెనీలు, డీలర్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దు. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
రూ.3 కోట్ల పాతనోట్లు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం: అత్యాశకు పోయి తాను పనిచేస్తున్న బ్యాంకు నుంచి రూ.30 లక్షలు దోచుకువెళ్లి మోసగాళ్ల చేతిలో తానే మోసపోయాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖలో వెలుగు చూసింది. సూర్యాబాగ్‌లోని దసపల్లా కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న పి.సాయి సురేశ్‌ను ఇటీవల నలుగురు వ్యక్తులు కలిశారు. తమ వద్ద రూ.3 కోట్ల పాత నోట్లు ఉన్నాయని రూ.30 లక్షలు ఇస్తే వాటిని ఇస్తామని వారు క్యాషియర్‌కు ఆశ చూపారు. దీంతో చిరిగిననోట్లను మార్చే అధికారం తనకు ఉండటంతో సురేశ్ బ్యాంకు నుంచి రూ.30 లక్షలు తీసుకువెళ్లి గురువారం సాయంత్రం వారికి అందజేశాడు. సురేశ్‌కు వారు రూ.500 నోట్ల మధ్య తెల్లకాగితాలు పెట్టిన కట్టలు అందజేశారు. బ్యాగును బ్యాంకుకు తీసుకువచ్చిన తర్వాత తెరిచి చూస్తే తెల్లకాగితాలు కనిపించాయి. బ్యాంకు మేనేజర్ తెన్నేటి శ్రీనివాస్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.