ఏలూరులో జనసేన ఔత్సాహికుల వేదికలో పాల్గొన్న సింహాద్రి బాలు (ఫైల్)
ఏలూరు టౌన్ : ఏలూరులోని ఒక బంగారు వ్యాపారి కుమార్తెను మోసం చేసి, బెదిరించి, భయపెట్టి భారీగా బంగారు ఆభరణాలు గుంజేసిన జనసేన కార్యకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సేవాదళ్ సమన్వయకర్తగా సింహాద్రి బాలు నియమితుడయ్యారు. ఈ కేసులో దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్ అలియాస్ బాలు, పిల్లా సాయి దేవేంద్రనాయుడు కీలకవ్యక్తులుగా ఉన్నారు.
వీరంతా తొలుత పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో పుట్టినరోజు వేడుకలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు పెద్దెత్తున చేస్తూ ప్రచారం పొందారు. అనంతరం జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి యూత్, విద్యార్థులను సమీకరిస్తూ పార్టీ కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే పార్టీ సేవాదళ్ జిల్లా కోఆర్డినేటర్ మారిశెట్టి పవన్ బాలాజీ, కొప్పిశెట్టి వీరబాబు, పార్టీ నాయకులు సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ శనివారం హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. యువతిని మోసం చేసిన కేసులో నిందితులుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయిన సింహాద్రి బాలు, దత్తి బాలాజీ, దేవేంద్రనాయుడు తదితరులకు జనసేన పార్టీతో ఏ విధమైన సంబంధాలు లేవని, అసలు పార్టీ సభ్యులుగా కూడా లేరని ప్రకటించారు.
జనసేన నుంచి బాలుకు వచ్చిన అధికారిక పత్రం
ఈ ప్రకటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏలూరులో గతేడాది నవంబర్‌లో జనసేన ఔత్సాహికుల వేదికలో పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇతర రాష్ట్ర ముఖ్యనేతల సమావేశాల్లోనూ బాలు వారి వెన్నంటే ఉన్నాడు. అతడు పార్టీకి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే నాయకులు హాజరయ్యారు. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనల్లోనూ నాయకుల వెంట నిందితులంతా పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
బుకాయింపుపై సర్వత్రా విమర్శలు
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదైన వెంటనే అసలు పార్టీ కార్యకర్తలే కాదంటూ బుకాయించటాన్ని పార్టీలోని యువత, కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేస్తే నాయకులైనా, కార్యకర్తలైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రకటించకుండా మా పార్టీకేమీ సంబంధం లేదని, అంతా మీడియా సృష్టేనంటూ అపవాదు మోపటంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పదిరోజులు దర్యాప్తు చేసి, విచారణలో వెల్లడైన విషయాలను ఏకంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడిస్తే ఆ విషయాలపైనా పార్టీ నేతలు కామెంట్లు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే పెదవివిరుస్తున్నారు.
పోలీస్ అధికారులు పదిరోజులు దర్యాప్తు చేసిన అనంతరం, కేసులో నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. స్వయంగా ఎస్పీ రవిప్రకాష్, విచారణ చేసిన ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరాలు తెలిపారు. కానీ జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసులను, మీడియాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే వ్యతిరేకిస్తున్నారు. తప్పుచేస్తే శిక్ష తప్పదని, చట్టానికి ఎవరైనా ఒక్కటేనని, కానీ జనసేన పార్టీలో జెండా మోస్తే చివరికి దక్కే ఫలితం ఇదేనా అంటూ కార్యకర్తలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మోసగించిన ముఠాతో జనసేనకు సంబంధం లేదు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఇటీవల జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతులను మోసగించి బంగారు ఆభరణాలు తీసుకుని జల్సాలు చేసి పోలీసులకు పట్టుబడిన ముఠాకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ మారిశెట్టి పవన్ బాలాజీ స్పష్టం చేశారు.
వి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతోన్న పవన్ బాలాజీ
శనివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సంఘ విద్రోహశక్తులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రోత్సహించదన్నారు. ఈ కార్యక్రమంలో పి.సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment