స్మృతి సిన్హా, రణధీర్‌రెడ్డి ఆలియాస్ రాణా
సాక్షి, నిజాంపేట: సహజీవనం చేస్తున్న ఆ జంట భారీ స్కెచ్ వేసింది. తమకు పరిచయమైన మైనింగ్ వ్యాపారిని పక్కా ప్లాన్‌తో నిండా ముంచింది. తాను మోసపోయినట్లు గుర్తించిన మైనింగ్ వ్యాపారి తన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. దీంతో సూత్రధారి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కడప జిల్లాకు చెందిన ఉద్దనం శిరీష అలియాస్ స్మృతి సిన్హాకు పద్నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే రాజంపేట వాసితో బాల్య వివాహమైంది.
పదేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడ్డ స్మృతి తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌కు చేరింది. హీరోయిన్‌గా సినిమాల్లో నటించాలనే ఆశతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ తీసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో ఆరేళ్ల క్రితం బోరబండలో సూపర్ మార్కెట్ ప్రారంభించింది. ఇందులో కంప్యూటర్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు తరచూ వచ్చే విజయ్‌కుమార్ రెడ్డితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆపై వీరిద్దరూ సహజీవనం చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడ్డారు.
రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి
లగ్జరీ కార్లు... రిచ్ లైఫ్‌స్టైల్
వీరిద్దరూ 2018 డిసెంబర్‌లో బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలోకి తమ మకాం మార్చారు. అందులోని 268 నెంబర్ విల్లాలో ఉండే మైనింగ్ వ్యాపారి పి.వీరారెడ్డితో వాలీబాల్ ఆట నేపథ్యంలో వీరికి పరిచయమైంది. అప్పట్లో తానో ట్రైనీ ఐపీఎస్ అంటూ విజయ్ పరిచయం చేసుకున్నాడు. స్మృతి తన భార్య అని, ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సౌత్ ఇండియా ఛైర్ పర్సన్ అని చెప్పాడు. ఆధారంగా కొన్ని కార్డులు కూడా చూపించాడు. వీరిద్దరూ విలాసవంతమైన జీవితం గడపటం, లగ్జరీ కార్లతో తిరగడటంతో వీరారెడ్డి తేలిగ్గా నమ్మేశారు. వీరారెడ్డిని నిండా ముంచాలని పథకం వేసిన విజయ్ తన కుటుంబీకులు, బంధువులను రంగంలోకి దింపాడు. వాళ్లు ఇతనికి వంత పాడారు.
విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న తన తండ్రి, సీఐఎస్‌ఎఫ్ ఏఎస్సై రాఘవరెడ్డిని కేంద్ర బలగాల్లో డీసీపీగా పని చేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఒకే ప్రాంతం, సామాజికవర్గం కావడంతో పాటు తాము దూరపు బంధువులమని వీరారెడ్డితో పదేపదే చెప్పిన విజయ్ మరింత దగ్గరయ్యాడు. తనకు 72 వోల్వో బస్సులున్నాయని, పార్కింగ్ కోసం బాచుపల్లిలోనే 32 ఏకరాల భూమి కొన్నానని నమ్మబలికాడు. వాటి నిర్వహణ, మరమ్మతులు, ఇతర అవసరాల పేరు చెప్పి వీరారెడ్డి నుంచి దఫదఫాలుగా రూ.11.37 కోట్లు తీసుకున్నాడు. ఇందులో రూ.5.37 కోట్లు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకోగా... మిగిలింది నగదు రూపంలో తీసుకున్నాడు. ఈ డబ్బును నేరుగా తన ఖాతాల్లోకి కాకుండా సోదరుడు అభిలాష్ రెడ్డి, బంధువులు రామకృష్టారెడ్డి, రణధీర్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయించి వారి ద్వారా తన ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
మీడియాకు నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్లు
పెళ్లి పేరిట... మరో వల
ఓ సందర్భంలో వీరారెడ్డి తన బావమరిదికి సంబంధాలు చూడమని విజయ్‌తో చెప్పారు. ఆ వెంటనే విజయ్ తనకు సోదరి వరుసయ్యే ప్రవల్లిక సిద్ధంగా ఉందని చెప్పి సోషల్‌మీడియా నుంచి సేకరించిన ఓ అందమైన యువతి ఫొటోను చూపించాడు. ప్రవల్లిక పేరుతో కొత్త ఫోన్ నంబర్‌తో స్మృతియే వీరారెడ్డి బావమరిదితో కవ్వింపుగా మాట్లాడుతూ మాయ చేసింది. వీరి ఒల్లో పడిపోయిన వీరారెడ్డి భార్య కుటుంబం ప్రవల్లికను తమ కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా స్మృతి పుట్టిన రోజు కోసం విజయ్ భారీ మొత్తమే ఖర్చు చేశాడు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆమె ఇద్దరు పిల్లలతో సహా ఈ ఏడాది 40 రోజులు గడిపాడు. రోజుకు రూ.లక్ష చొప్పున హోటల్ వారికి చెల్లించాడు. తనకు ఉన్న ఐదు లగ్జరీ కార్లనూ రోజుమార్చి రోజు వాడుతూ ఉండేవాడు.
డెహ్రాడూన్‌లో శిక్షణలో ఉన్నానని మార్ఫింగ్ ఫొటోలు
కాగా, కొంతకాలంగా తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ విజయ్‌కుమార్‌రెడ్డిని వీరారెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల చివరి వారం లో ఫోన్ చేసి గట్టిగా అడగ్గా... తాను డెహ్రాడూన్‌లో ఐపీఎస్ శిక్షణలో ఉన్నానంటూ విజయ్ తప్పించుకున్నాడు. దీనికి ఆధారంగా అంటూ కొన్ని ఫొటోలనూ షేర్ చేశాడు. అనుమానం వచ్చిన వీరారెడ్డి వాట్సాప్ ద్వారా లైవ్ లోకేషన్ పంపాలని కోరగా, అతడు పంపలేదు. దీంతో అనుమానం వచ్చి అప్పటికే పంపిన ఫొటోలను పరిశీలించి అవి మార్ఫింగ్ చేసినవిగా గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వీరారెడ్డి.. విజయ్ నగరంలో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్నాడు. వీరారెడ్డి నుంచి విజయ్‌కు ఒత్తిడి పెరగడంతో.. మిమ్మల్ని మోసం చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విజయ్ ఈనెల 5న వాట్సాప్‌లో ఓ సందేశం పంపాడు.
ప్రగతినగర్‌లో తన కుటుంబం నివసించే ఇంట్లో ఉరేసుకున్నాడు. దాంతో వీరారెడ్డి ఈ నెల 12న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు, ఇన్‌స్పెక్టర్ నర్సింహ్మారెడ్డి, ఎస్‌ఐ సతీష్‌కుమార్ దర్యాప్తు చేశారు. బుధవారం స్మృతితో పాటు రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, రణధీర్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పదుల సంఖ్యలో గుర్తింపు కార్డులు, పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు, రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, రూ.2 లక్షల నగదు, సెల్‌ఫోన్లతో పాటు 3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment