Fake IPS officer
-
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్
సాలూరు: పవన్‌కళ్యాణ్ ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా గిరి శిఖర గ్రామమైన సిరివర రహదారి శంకుస్థాపనలో పాల్గొన్నారు. పర్యటనలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకంగా భద్రతా దళాల కళ్లుగప్పి.. ఐపీఎస్ అధికారినంటూ ఓ డూప్లికేట్ పోలీస్ హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.నకిలీ ఐపీఎస్ అరెస్ట్స్వప్రయోజనాల కోసం ఐపీఎస్ అవతారమెత్తిన నకిలీ ఐపీఎస్ బి.సూర్యప్రకాశ్‌ను పోలీసులు శని వారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్ వివరించారు. విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన బి.సూర్యప్రకాశ్ 2003 నుంచి 2005 వరకు పంజాబ్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసి మానే శాడు. తరువాత బీటెక్, ఎంబీఏ పూర్తిచేసి పలు వ్యాపారాలు సాగించాడు. తన తండ్రి తవిటి బాబు కరోనాతో 2020లో మృతి చెందారు.ఆ సమయంలో తన తండ్రి ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి దత్తిరాజేరు మండలం గడసాం రెవెన్యూ పరిధిలో సుమారు 9.79 ఎకరాలను అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఇంట్లో లభ్యమైన ప త్రాల ద్వారా సూర్యప్రకాశ్ తెలుసుకున్నాడు. తండ్రి మరణంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రావాలని సదరు రైతులను సూర్యప్రకాశ్ కోరగా నిరాకరించారు. తను ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యా నని డిసెంబర్ 2023లో కుటుంబీకులు, బంధు వులను నమ్మించాడు. ట్రైనింగ్ కోసమంటూ 2024 జనవరిలో హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడ హాస్టల్లో ఉండి పోలీస్ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు. తను ట్రైనింగ్‌లో ఉన్నట్టు ఫొటోలు తీయించుకుని బంధువులకు పంపించాడు. ఆ ఫొటోలు, ఐడీ కార్డులను చూపించి ఆ భూములను రిజి స్ట్రేషన్ చేయాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు. పోలీస్‌నని నమ్మించేందుకే..రైతులందరినీ తాను పోలీస్ అయినట్టు నమ్మించాలని ప్లాన్‌చేసి.. ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మక్కువ పర్యటనకు వచ్చిన నేప థ్యంలో ఉదయం 9.30 గంటలకు ముడిదాం నుంచి డ్రైవర్‌తో కలిసి సూర్యప్రకాశ్ కారులో మక్కువ కు చేరుకున్నాడు. దుగ్గేరు వద్ద పోలీసులు మంత్రి కాన్వాయ్ వెహికల్స్ తప్ప మిగిలిన వాహనాలను నిలిపివేశారు. సూర్యప్రకాశ్ కారును కూడా అక్కడే ఆపేశారు. దీంతో అతడు కారు దిగి కొంతదూరం కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ అడిగి బాగుజోలకు చేరుకున్నాడు. అప్ప టికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తికావడం, అక్క డ ఎవరూ లేకపోవడం చూసి శిలాఫలకం దగ్గర ఫొటో తీసుకున్నాడు. అక్కడ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులతో ఫొటోలు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెటు కున్నాడు. విషయం తెలుసుకున్న మక్కువ పోలీ సులు సూర్యప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. -
నకిలీ ఐపీఎస్ కేసు: మరో నలుగురికి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సీబీఐ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన ఈ బాగోతంలో ఇప్పుడు మరో పరిణామం చోటు చేసుకుంది. నగరానికి చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చింది సీబీఐ. శుక్రవారం(డిసెంబర్ 2వ తేదీన) వీరిని తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచు నాయుడుకి, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావుకి, సనత్‌నగర్‌కు చెందిన రవికి, మరొకరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. సీబీఐ బ్రాంచ్ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని చెంచు నాయుడిని నమ్మించినట్లు తెలుస్తోంది. నకిలీ ఐపీఎస్ అధికారి ముసుగులో ఉన్న శ్రీనివాస్‌కు.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. బంగారు అభరణాలను సైతం ఇచ్చినట్లు తేలింది. ఈ వ్యాపారుల రేపటి విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వైజాగ్ లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్రీనివాస్.. అక్కడ వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సీబీఐ ధృవీకరించింది కూడా. దేశ రాజధానిలో మకాం వేసి.. గత ఐదేళ్లుగా సీబీఐ అధికారినంటూ దందాలు, సెటిల్మెంట్ల పేరుతో అనేకమంది దగ్గర డబ్బులు దండుకున్నాడు శ్రీనివాస్. మూడు రోజుల కిందట ఇతన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు -
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ.. ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఓ ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు, మూడు సెల్ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్ తాను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. డీఆర్డీవోకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటానని, గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ కొంత కాలంగా పలువురిని మోసం చేస్తూ వస్తున్నాడు. తాజాగా విజయవాడ నగరానికి చెందిన న్యాయవాది కనకదుర్గకు భారీ స్థాయిలో టోకరా వేశాడు. తన ఇద్దరు పిల్లలకు డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో కనకదుర్గ పలు దఫాలుగా రూ.65 లక్షలను ఆన్లైన్ ద్వారా విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాకు పంపింది. నగదు తీసుకున్న తరువాత విద్యాసాగర్ కొన్నాళ్లు పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చిన కనకదుర్గ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు విజయవాడలో తిరుగుతున్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. బతుకంతా మోసాల మయమే.. మాయమాటలతో ప్రజలను మోసం చేయడమే జీవనాధారంగా చేసుకున్న విద్యాసాగర్ గతంలో పలువురిని ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2014లో నకిలీ భూమి దస్తావేజులను సృష్టించి నగరంలోని పలువురిని మోసం చేశాడు. దీనిపై ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదయింది. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసి రూ.17 లక్షలు కాజేశాడు. అదేవిధంగా డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరి నుంచి విద్యాసాగర్ నగదు వసూలు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. రైస్ పుల్లింగ్ యంత్రాలను సైతం కొందరికి విక్రయించి దుర్గాప్రసాద్ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్
సాక్షి, నిజాంపేట: సహజీవనం చేస్తున్న ఆ జంట భారీ స్కెచ్ వేసింది. తమకు పరిచయమైన మైనింగ్ వ్యాపారిని పక్కా ప్లాన్‌తో నిండా ముంచింది. తాను మోసపోయినట్లు గుర్తించిన మైనింగ్ వ్యాపారి తన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. దీంతో సూత్రధారి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కడప జిల్లాకు చెందిన ఉద్దనం శిరీష అలియాస్ స్మృతి సిన్హాకు పద్నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే రాజంపేట వాసితో బాల్య వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడ్డ స్మృతి తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌కు చేరింది. హీరోయిన్గా సినిమాల్లో నటించాలనే ఆశతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణ తీసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో ఆరేళ్ల క్రితం బోరబండలో సూపర్ మార్కెట్ ప్రారంభించింది. ఇందులో కంప్యూటర్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసేందుకు తరచూ వచ్చే విజయ్‌కుమార్ రెడ్డితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆపై వీరిద్దరూ సహజీవనం చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడ్డారు. రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి లగ్జరీ కార్లు... రిచ్ లైఫ్‌స్టైల్ వీరిద్దరూ 2018 డిసెంబర్లో బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలోకి తమ మకాం మార్చారు. అందులోని 268 నెంబర్ విల్లాలో ఉండే మైనింగ్ వ్యాపారి పి.వీరారెడ్డితో వాలీబాల్ ఆట నేపథ్యంలో వీరికి పరిచయమైంది. అప్పట్లో తానో ట్రైనీ ఐపీఎస్ అంటూ విజయ్ పరిచయం చేసుకున్నాడు. స్మృతి తన భార్య అని, ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సౌత్ ఇండియా ఛైర్ పర్సన్ అని చెప్పాడు. ఆధారంగా కొన్ని కార్డులు కూడా చూపించాడు. వీరిద్దరూ విలాసవంతమైన జీవితం గడపటం, లగ్జరీ కార్లతో తిరగడటంతో వీరారెడ్డి తేలిగ్గా నమ్మేశారు. వీరారెడ్డిని నిండా ముంచాలని పథకం వేసిన విజయ్ తన కుటుంబీకులు, బంధువులను రంగంలోకి దింపాడు. వాళ్లు ఇతనికి వంత పాడారు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న తన తండ్రి, సీఐఎస్ఎఫ్ ఏఎస్సై రాఘవరెడ్డిని కేంద్ర బలగాల్లో డీసీపీగా పని చేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఒకే ప్రాంతం, సామాజికవర్గం కావడంతో పాటు తాము దూరపు బంధువులమని వీరారెడ్డితో పదేపదే చెప్పిన విజయ్ మరింత దగ్గరయ్యాడు. తనకు 72 వోల్వో బస్సులున్నాయని, పార్కింగ్ కోసం బాచుపల్లిలోనే 32 ఏకరాల భూమి కొన్నానని నమ్మబలికాడు. వాటి నిర్వహణ, మరమ్మతులు, ఇతర అవసరాల పేరు చెప్పి వీరారెడ్డి నుంచి దఫదఫాలుగా రూ.11.37 కోట్లు తీసుకున్నాడు. ఇందులో రూ.5.37 కోట్లు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకోగా... మిగిలింది నగదు రూపంలో తీసుకున్నాడు. ఈ డబ్బును నేరుగా తన ఖాతాల్లోకి కాకుండా సోదరుడు అభిలాష్ రెడ్డి, బంధువులు రామకృష్టారెడ్డి, రణధీర్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయించి వారి ద్వారా తన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మీడియాకు నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వర్లు పెళ్లి పేరిట... మరో వల ఓ సందర్భంలో వీరారెడ్డి తన బావమరిదికి సంబంధాలు చూడమని విజయ్‌తో చెప్పారు. ఆ వెంటనే విజయ్ తనకు సోదరి వరుసయ్యే ప్రవల్లిక సిద్ధంగా ఉందని చెప్పి సోషల్‌మీడియా నుంచి సేకరించిన ఓ అందమైన యువతి ఫొటోను చూపించాడు. ప్రవల్లిక పేరుతో కొత్త ఫోన్ నంబర్‌తో స్మృతియే వీరారెడ్డి బావమరిదితో కవ్వింపుగా మాట్లాడుతూ మాయ చేసింది. వీరి ఒల్లో పడిపోయిన వీరారెడ్డి భార్య కుటుంబం ప్రవల్లికను తమ కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా స్మృతి పుట్టిన రోజు కోసం విజయ్ భారీ మొత్తమే ఖర్చు చేశాడు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆమె ఇద్దరు పిల్లలతో సహా ఈ ఏడాది 40 రోజులు గడిపాడు. రోజుకు రూ.లక్ష చొప్పున హోటల్ వారికి చెల్లించాడు. తనకు ఉన్న ఐదు లగ్జరీ కార్లనూ రోజుమార్చి రోజు వాడుతూ ఉండేవాడు. డెహ్రాడూన్‌లో శిక్షణలో ఉన్నానని మార్ఫింగ్ ఫొటోలు కాగా, కొంతకాలంగా తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ విజయ్‌కుమార్‌రెడ్డిని వీరారెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల చివరి వారం లో ఫోన్ చేసి గట్టిగా అడగ్గా... తాను డెహ్రాడూన్‌లో ఐపీఎస్ శిక్షణలో ఉన్నానంటూ విజయ్ తప్పించుకున్నాడు. దీనికి ఆధారంగా అంటూ కొన్ని ఫొటోలనూ షేర్ చేశాడు. అనుమానం వచ్చిన వీరారెడ్డి వాట్సాప్ ద్వారా లైవ్ లోకేషన్ పంపాలని కోరగా, అతడు పంపలేదు. దీంతో అనుమానం వచ్చి అప్పటికే పంపిన ఫొటోలను పరిశీలించి అవి మార్ఫింగ్ చేసినవిగా గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వీరారెడ్డి.. విజయ్ నగరంలో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్నాడు. వీరారెడ్డి నుంచి విజయ్‌కు ఒత్తిడి పెరగడంతో.. మిమ్మల్ని మోసం చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విజయ్ ఈనెల 5న వాట్సాప్‌లో ఓ సందేశం పంపాడు. ప్రగతినగర్‌లో తన కుటుంబం నివసించే ఇంట్లో ఉరేసుకున్నాడు. దాంతో వీరారెడ్డి ఈ నెల 12న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లి ఏసీపీ సురేందర్‌రావు, ఇన్స్పెక్టర్ నర్సింహ్మారెడ్డి, ఎస్ఐ సతీష్‌కుమార్ దర్యాప్తు చేశారు. బుధవారం స్మృతితో పాటు రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, రణధీర్రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పదుల సంఖ్యలో గుర్తింపు కార్డులు, పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు, రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, రూ.2 లక్షల నగదు, సెల్ఫోన్లతో పాటు 3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు సీజ్ చేశారు. -
పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం
సాక్షి, హైదరాబాద్: తాను ఐపీఎస్ అధికారిని చెప్పి.. మా చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీదైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఈ మోసాలు తన బంధువుతో కలిసి ఆమె చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శ్రుతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శ్రుతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది. అయితే నెల రోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లను శ్రుతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు శ్రుతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితురాలి నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. -
తిరుమలలో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి పోలీసులకు చిక్కాడు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం తిరుమలకు వెళ్లిన అరుణ్ కుమార్... తాను ఐపీఎస్ నంటూ జేఈవో కార్యాలయానికి వచ్చి ప్రోటోకాల్ దర్శనం అడిగాడు. అధికారుల విచారణలో అతను ఐపీఎస్ అధికారి కాదని తేలింది. దీంతో జేఈఓ కార్యాలయం అధికారులు విజులెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దర్శనానికి వెళ్తున్న అరుణ్‌కుమార్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు.. అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అరుణ్‌కుమార్ గతంలో పలువురు రాష్ట్ర మంత్రుల వద్ద ఓయస్డిగా పనిచేశాడు. -
ఫేక్ ఐపీఎస్‌గా మారిన వినోద్‌కుమార్
-
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
గిద్దలూరు: తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ తిరుగున్న యువకుడిని గురువారం గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని వడ్డెమానుకు చెందిన కర్నాటి గురువినోద్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లెలో అవ్వ, తాతల వద్ద ఉంటున్నాడు. గిద్దలూరులోని ఓ కళాశాలలో ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతనికి డిఫెన్స్ సర్వీసెస్, పోలీసు అధికారిని కావాలన్న ఆశ బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఐపీఎస్, డిఫెన్స్ సర్వీస్‌లకు సంబంధించిన కోచింగ్‌లు తీసుకున్నాడు. ఇతనితో పాటు కోచింగ్ తీసుకున్న వారంతా వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వినోద్‌కు మాత్రం ఉద్యోగం రాలేదు. దీంతో తనలో ఉన్న కోర్కెను తీర్చుకోవాలని, అందరితో ఐపీఎస్ అనిపించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు చెందిన నకిలీ ఐడీ కార్డు, వాయుసేనకు సంబంధించి ఫైలెట్‌గా ఐడీ కార్డు, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు సెలక్ట్ అయినట్లు అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసుకున్నాడు. తాను ఐపీఎస్ అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు సైతం వచ్చిన ఇతడు తాను ఐపీఎస్ అధికారినంటూ హడావిడి చేయగా అనుమానం వచ్చిన ఎస్ఐ కొమరం మల్లికార్జున అతని ఐడీ కార్డులపై విచారణ చేపట్టారు. కాగా ఇతను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటున్నాడే తప్ప ఎవరినీ బెదిరిం చడం, నగదు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు సంబంధించిన ఐడీ కార్డు, అపాయింట్మెంట్ లెటర్‌ను పోర్జరీ చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
ఐపీఎస్ అంటూ ఉన్నతాధికారులకు టోపీ
చండీగఢ్: పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కొడుకు రాహుల్ కుమార్ ఐపీఎస్ అధికారినంటూ జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను మోసం చేశాడు. విజిలెన్స్ ఎస్పీగా పరిచయం చేసుకుని రాహుల్ కుమార్ 60 మందికిపైగా ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. రాహుల్ కుమార్ ప్రభుత్వ అధికారులను బెదిరించి వారి నుంచి 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అమృత్సర్ సీనియర్ ఎస్పీ పాటిల్ కే బలరామ్ చెప్పారు. కాగా అధికారుల నుంచి నిందితుడు ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తేలాల్సివుందని తెలిపారు. రాహుల్ మోసం చేసినవారిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంక్ అధికారులు, జిల్లా ఆహార సరఫరా కంట్రోలర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా వైద్యశాఖ అధికారి, సహకార సంఘాల అధికారులు, రోడ్డు రవాణ అధికారులు ఉన్నారు. గత నెలలో అమృత్సర్ డివిజన్ అటవీ శాఖ అధికారి ఎస్ కే సాగర్.. విజిలెన్స్ అధికారులు తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే అవినీతి కేసు పెడతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాహుల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు, పోలీసులు కలసి నిఘా వేసి ధర్మశాలలో రాహుల్‌ను అరెస్ట్ చేశారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న మాజీ అధ్యాపకుణ్ని కరోల్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కొచ్చికి చెందిన సతీష్ నాయర్(44) చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎం.టెక్, పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్‌లోని జయరామ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒడిశాలోని మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. గతేడాది ఫిబ్రవరిలో ఓ ప్రమాదంలో గాయడటంతో విధులకు హాజరుకాలేకపోయాడు. ఈ కారణంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అడ్డదారుల్లో వెళ్లడం ద్వారా ఆనందంగా జీవించొచ్చని భావించిన సతీష్, పోలీస్ యూనిఫాం కుట్టించుకున్నాడు. అప్పటి నుంచి ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేస్తూ వచ్చాడు. అలాగే కరోల్‌బాగ్‌లోని గఫ్పార్ మార్కెట్లోని మొబైల్ షాపుకి వెళ్లి తనను తాను జైపూర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతన్ని నమ్మించడం కోసం నకిలీ ఐడెంటిటీ కార్డుని కూడా చూపించాడు. అక్కడ రెండు పాత ఫోన్లను ఇచ్చి రెండు కొత్త సెల్ఫోన్లను తీసుకున్నడు. ఒక నెల తర్వాత మళ్లీ వెళ్లి రెండు సెల్ఫోన్లను తీసుకున్నాడు. ఏటీఎం కార్డు తీసుకురాలేదని చెప్పి మళ్లీ ఇస్తానని చెప్పి లక్ష రూపాయల నగదు తీసుకున్నాడు. మళ్లీ మూడోసారి అలాగే రావడంతో అనుమానం వచ్చిన షాపు యజమాని పోలీసులకు ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వలపన్ని నిందితుణ్ని కరోల్‌బాగ్‌లోని రామా హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ని నుంచి పోలీసు యూనిఫాం, వైర్లెస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చేతిలో మోసపోయిన బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కరోల్‌బాగ్ పోలీసులు తెలిపారు.