సాక్షి, హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సీబీఐ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన ఈ బాగోతంలో ఇప్పుడు మరో పరిణామం చోటు చేసుకుంది. నగరానికి చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చింది సీబీఐ.
శుక్రవారం(డిసెంబర్ 2వ తేదీన) వీరిని తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచు నాయుడుకి, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావుకి, సనత్‌నగర్‌కు చెందిన రవికి, మరొకరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
సీబీఐ బ్రాంచ్ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని చెంచు నాయుడిని నమ్మించినట్లు తెలుస్తోంది.
నకిలీ ఐపీఎస్ అధికారి ముసుగులో ఉన్న శ్రీనివాస్‌కు.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. బంగారు అభరణాలను సైతం ఇచ్చినట్లు తేలింది. ఈ వ్యాపారుల రేపటి విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వైజాగ్ లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్రీనివాస్.. అక్కడ వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సీబీఐ ధృవీకరించింది కూడా. దేశ రాజధానిలో మకాం వేసి.. గత ఐదేళ్లుగా సీబీఐ అధికారినంటూ దందాలు, సెటిల్‌మెంట్‌ల పేరుతో అనేకమంది దగ్గర డబ్బులు దండుకున్నాడు శ్రీనివాస్. మూడు రోజుల కిందట ఇతన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment