ఐపీఎస్ అంటూ ఉన్నతాధికారులకు టోపీ
చండీగఢ్: పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కొడుకు రాహుల్ కుమార్ ఐపీఎస్ అధికారినంటూ జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను మోసం చేశాడు. విజిలెన్స్ ఎస్పీగా పరిచయం చేసుకుని రాహుల్ కుమార్ 60 మందికిపైగా ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
రాహుల్ కుమార్ ప్రభుత్వ అధికారులను బెదిరించి వారి నుంచి 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అమృత్సర్ సీనియర్ ఎస్పీ పాటిల్ కే బలరామ్ చెప్పారు. కాగా అధికారుల నుంచి నిందితుడు ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తేలాల్సివుందని తెలిపారు.
రాహుల్ మోసం చేసినవారిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంక్ అధికారులు, జిల్లా ఆహార సరఫరా కంట్రోలర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా వైద్యశాఖ అధికారి, సహకార సంఘాల అధికారులు, రోడ్డు రవాణ అధికారులు ఉన్నారు. గత నెలలో అమృత్సర్ డివిజన్ అటవీ శాఖ అధికారి ఎస్ కే సాగర్.. విజిలెన్స్ అధికారులు తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే అవినీతి కేసు పెడతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాహుల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు, పోలీసులు కలసి నిఘా వేసి ధర్మశాలలో రాహుల్ను అరెస్ట్ చేశారు.