గట్టిగుండె విద్యాసాగర్
విజయవాడ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ.. ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఓ ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు, మూడు సెల్‌ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్ తాను వీఆర్‌ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. డీఆర్‌డీవోకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటానని, గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ కొంత కాలంగా పలువురిని మోసం చేస్తూ వస్తున్నాడు.
తాజాగా విజయవాడ నగరానికి చెందిన న్యాయవాది కనకదుర్గకు భారీ స్థాయిలో టోకరా వేశాడు. తన ఇద్దరు పిల్లలకు డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో కనకదుర్గ పలు దఫాలుగా రూ.65 లక్షలను ఆన్‌లైన్ ద్వారా విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాకు పంపింది. నగదు తీసుకున్న తరువాత విద్యాసాగర్ కొన్నాళ్లు పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చిన కనకదుర్గ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు విజయవాడలో తిరుగుతున్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు.
బతుకంతా మోసాల మయమే..
మాయమాటలతో ప్రజలను మోసం చేయడమే జీవనాధారంగా చేసుకున్న విద్యాసాగర్ గతంలో పలువురిని ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2014లో నకిలీ భూమి దస్తావేజులను సృష్టించి నగరంలోని పలువురిని మోసం చేశాడు. దీనిపై ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదయింది. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసి రూ.17 లక్షలు కాజేశాడు. అదేవిధంగా డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరి నుంచి విద్యాసాగర్ నగదు వసూలు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. రైస్ పుల్లింగ్ యంత్రాలను సైతం కొందరికి విక్రయించి దుర్గాప్రసాద్ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment