
రాష్ట్రంలో విస్తరిస్తున్న రెడ్‌లైట్ నెట్‌వర్క్
నాడు కాల్ నాగులు.. నేడు స్పా సర్పాలు
విజయవాడ సహా నగరాలలో నిర్వాహకులకు కూటమి నేతల అండ
ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారితో పాటు స్థానిక మహిళలకు గాలం
యువతుల నుంచి రూ.లక్షల్లో డిపాజిట్లు.. నెలకు రూ.3 కోట్ల దందా
విటులు, యువతుల సమాచారం అంతా రహస్యంగా నిక్షిప్తం
సీసీ కెమెరాలతో పకడ్బందీగా వ్యవహారాలు
బ్లాక్ మెయిలింగ్ కోసం ముందస్తుగానే పన్నాగం
స్పాల నిర్వాహకులకు మహిళల సహకారం
చిరునామాలు, ఫోన్ నంబర్ల నిర్వహణ బాధ్యత వీరిదే
వాహనాలకు అధికార పార్టీల గుర్తులతో హల్‌చల్
నిర్వాహకులు, పోలీసుల మధ్య ‘క్విడ్ ప్రోకో’ ఒప్పందం
నెలల కిందటే సమాచారమిచ్చినా పట్టించుకోని పోలీసులు
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది.
విజయవాడ నగరంలోని స్పా సెంటర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా..
ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు.
అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి
చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు.
కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్‌చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు.
నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్‌గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం.
విజయవాడ కేంద్రంగా
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్‌ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు.

రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు
డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు.
భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.
అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్‌లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది.
అనుచర బృందంతో వ్యవహారాలు
చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్‌లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే.
నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా
‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్‌లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్‌గా..
చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.
కోడ్ పేర్లతో ఎర..
రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు.
ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వ్యాపారాల ముసుగులో..
చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్‌స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు.
విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment