న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న మాజీ అధ్యాపకుణ్ని కరోల్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కొచ్చికి చెందిన సతీష్ నాయర్(44) చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎం.టెక్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్‌లోని జయరామ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒడిశాలోని మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. గతేడాది ఫిబ్రవరిలో ఓ ప్రమాదంలో గాయడటంతో విధులకు హాజరుకాలేకపోయాడు. ఈ కారణంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అడ్డదారుల్లో వెళ్లడం ద్వారా ఆనందంగా జీవించొచ్చని భావించిన సతీష్, పోలీస్ యూనిఫాం కుట్టించుకున్నాడు.
అప్పటి నుంచి ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేస్తూ వచ్చాడు. అలాగే కరోల్‌బాగ్‌లోని గఫ్పార్ మార్కెట్‌లోని మొబైల్ షాపుకి వెళ్లి తనను తాను జైపూర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతన్ని నమ్మించడం కోసం నకిలీ ఐడెంటిటీ కార్డుని కూడా చూపించాడు. అక్కడ రెండు పాత ఫోన్లను ఇచ్చి రెండు కొత్త సెల్‌ఫోన్లను తీసుకున్నడు. ఒక నెల తర్వాత మళ్లీ వెళ్లి రెండు సెల్‌ఫోన్లను తీసుకున్నాడు. ఏటీఎం కార్డు తీసుకురాలేదని చెప్పి మళ్లీ ఇస్తానని చెప్పి లక్ష రూపాయల నగదు తీసుకున్నాడు.
మళ్లీ మూడోసారి అలాగే రావడంతో అనుమానం వచ్చిన షాపు యజమాని పోలీసులకు ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వలపన్ని నిందితుణ్ని కరోల్‌బాగ్‌లోని రామా హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ని నుంచి పోలీసు యూనిఫాం, వైర్‌లెస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చేతిలో మోసపోయిన బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కరోల్‌బాగ్ పోలీసులు తెలిపారు.
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
Published Thu, Feb 26 2015 10:42 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement