కాపు రాని మిర్చి విత్తనం
అమరావతి: మండల పరిధిలోని గ్రామాల్లో విత్తిన జీవా కంపెనీకి చెందిన మిర్చి రకం విత్తనం ఎదుగుదలలో తేడా గమనించి నకిలీ విత్తనాలుగా గుర్తించి సోమవారం ఉదయం రైతులు విత్తన దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలలో కెళితే మండలంలోని అత్తలూరు, నూతలపాటివారిపాలెం, తురగా వారిపాలెం, బయ్యవరం, పెదకూరపాడు మండలంలోని పలుగ్రామాల రైతులు రెండు నెలలక్రితం జీవా కంపెనీకి చెందిన (జేసీహెచ్ 802) మిరప విత్తనాలను పెదకూరపాడు మండలంలో 75 త్యాళ్ళూరులో ఉన్న త్రివేణి పెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేశారు. అత్తలూరుకు చెందిన మదమంచి ఆదిశేషగిరిరావు మిరపతోటలో పెరుగుదల, కాపు విషయంలో తేడా ఉండడం గుర్తించి అదే విత్తనం వేసిన మిగిలిన పొలాలు కూడా పరిశీలించారు. మిగతా రైతులతో కలిసి సోమవారం దుకాణదారుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు. తమకు ఎకరానికి సుమారు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చయిందని రైతులు వాపోతున్నారు. దీనిపై దుకాణదారుడు సరైన రీతిలో స్పందించకపోవడంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు.