మిర్చి రైతు కంట కన్నీరు!
మిర్చి రైతు కంట కన్నీరు!
Published Fri, May 12 2017 11:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– క్వింటం ధర రూ.350
– కర్నూలు మార్కెట్ యార్డులో
రికార్డు స్థాయిలో పతనమైన ధర
– చెప్పుకోలేక మొహం చాటేస్తున్న అన్నదాతలు
‘‘ ఐదు ఎకరాల్లో మిరప సాగు చేశాను.. రూ.4 లక్షల పెట్టుబడి పెట్టాను. 20 క్వింటాళ్ల పంట చేతికి రావడంతో అమ్మడానికి కర్నూలు తీసుకొచ్చాను. క్వింటా రూ.350కి అడుతున్నారు. గత ఏడాది క్వింటా రూ.16 వేలు ధర పలికింది. ఈ ఏడు ఇలా ఎందుకుందో అర్థం కావడం లేదు. ఇలాగైతే రైతు ఎలా బతకాలి’’
-ఎల్లారెడ్డి, లాలుమానుపల్లె, కృష్ణగిరి మండలం
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్): ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి, చీడపీడలను సమర్థంగా ఎదుర్కొని మంచి దిగుబడి సాధించినా ఫలితం ఉండడం లేదు. అన్నదాత రెక్కల కష్టానికి ధర పలకడం లేదు. మిరప రైతు కంట కన్నీరే మిగులుతోంది. పంటను రోజుల తరబడి మార్కెట్ యార్డులో ఉంచినా కొనేవారు కరువయ్యారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటానికి కనిష్ట ధర రూ.350 పలికింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. శీతల గోదాములలో నిల్వ ఉంచుదామనుకున్నా ఖాళీ లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలు మార్కెట్‌కు మిర్చి వస్తోంది.
మద్దతు ధర ఉన్నా నిష్ప్రయోజనమే
మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కర్నూలు యార్డులో నిష్ప్రయోజనంగా మారింది. రైతుల డిమాండ్‌ను బట్టి వారం రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డుతో పాటు కర్నూలు, కోస్తా జిల్లాలోని పర్చూరు, దాచేపల్లి మార్కెట్ యార్డులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులుగా ఉత్తర్వులు జారీ అయినా ఇప్పటివరకు కర్నూలు మార్కెట్ యార్డులో 82 మంది రైతులు మాత్రమే మద్దతు ధర కోసం పేర్లను నమోదు చేసుకున్నారు.
అవగాహన కరువు..
మద్దతు ధర కల్పించి వారం రోజులు గడుస్తున్నా ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర కోసం ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ అధికారుల అనుమతి పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు, మార్కెట్ యార్డు జారీ చేసిన తక్‌పట్టీలు తదితర వాటితో దరఖాస్తుదారులుగా నమోదు చేసుకోవాల్సి ఉంది. రైతులకు వీటిపై అవగాహన లేక మద్దతు ధర పొందలేకపోతున్నారు.
Advertisement