కడుపు మండి.. మిర్చికి నిప్పు
వేమనపల్లి(బెల్లంపల్లి): ఆరుగాలం పండించిన మిర్చి పంటకు ధర కరువై.. మార్కెట్ దూరమై.. పెట్టుబడీ వచ్చే అవకాశం లేక రైతు కడుపు మండింది. పంటను మార్కెట్‌కు తరలించి అప్పులపాలు కాలేక కళ్లంలోనే 38 క్వింటాళ్ల మిర్చికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మంచి ర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్మలపేట శివారు నడిమిగడ్డ ప్రాంతంలో సోమవారం జరి గింది. గ్రామానికి చెందిన ఛటారి రామన్న తనకున్న రెండు ఎకరాలతో పాటు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేశాడు.
ధర లేకున్నా వారం రోజుల క్రితం రూ. మూడు వేలకు క్వింటాల్ చొప్పున 100 క్వింటాళ్లు విక్రయించాడు. ఇంకా 50 క్వింటాళ్ల మిర్చి కళ్లంలోనే ఉంది. కొనేవారు లేక.. ధర కరువై దిగులు చెందుతున్నాడు. మిర్చి విక్రయించాలంటే ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పూర్ మార్కెట్‌కు తరలించాలి. ఇక్కడ దళారులు రూ. 2,500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పడంతో కుమిలిపోయాడు. నాగ్‌పూర్ మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకపోవడం, ట్రాక్టర్‌లో ఇంటికి తరలించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో కళ్లంలోనే సోమవారం సాయంత్రం మిర్చికి నిప్పంటించాడు. 38 క్వింటాళ్ల మిర్చి అగ్నికి ఆహుతైపోయింది.