ధర..దయనీయం!
ధర..దయనీయం!
Published Mon, May 1 2017 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- స్పందించని ప్రభుత్వం
- అన్నదాతకు తీవ్ర నష్టం
- మూతపడిన కందుల
కొనుగోలు కేంద్రాలు
- ఉల్లికి లభించని మద్దతు
-అప్పు ఊబిలో కొర్ర రైతు
కర్నూలు(అగ్రికల్చర్): వరుస కరువు.. అంతంత మాత్రం దిగుబడి..పాతాళానికి పడిపోయిన ధర.. వెరసి రైతుకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. మిరప, పసుపు, కంది..ఇవే కాదు..రైతులు పండించిన దాదాపు అన్ని పంటలకు ధర లేదు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారినా..వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు ఉన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వీరిలో 60 శాతం మంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలతో పాటు ట్రాక్టరు, వ్యవసాయ కూలీల ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. పెట్టుబడి వ్యయం రైతులకు తడచి మోపెడవుతోంది. వ్యయానికి తగ్గట్టుగా ధరలు ఉంటే కొంతవరకు రైతులకు ఊరట లభిస్తుంది. అయితే ధరలు నేలను తాకడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో దాదాపు 90శాతం మంది రైతులు ఈ ఏడాది అప్పుల ఊబిలో కూరుకపోయారు.
నామమాత్ర చర్యలు..
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటా కందులు రూ.5050తో కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల దగ్గర ఇంకా 5 లక్షల క్వింటాళ్ల కందులు ఉన్నా కొనుగోలు చేయకుండా కేంద్రాలను మూసి వేశారు. కేంద్రాలు మూసివేసి రెండు నెలలు అవుతున్నా కొనుగోలు చేసిన కందులకు డబ్బు చెల్లించలేదు. గత ఏడాది ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర రూ.600 ప్రకటించింది. అయితే జిల్లా యంత్రాంగం గరిష్టంగా రూ.300 మద్దతు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులకు చేకూరిన లబ్ధినామమాత్రమే. ఈ ఏడాది పిబ్రవరి చివరి వరకు మద్దతు పొందే అవకాశం ఉన్నా డిసెంబరు 21వతేదీ వరకు అమ్ముకున్న రైతులకు మాత్రమే మద్దతు ఇచ్చారు. ఎండుమిర్చికి క్వింటాల్‌కు రూ.1500 మద్దతు ప్రకటించినా రైతులకు ఊరట నామమాత్రమే.
ప్రస్తుతం మిర్చికి రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు మాత్రమే ధరలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు రూ.1500 కలిపినా క్వింటాల్‌కు లభించే ధర రూ.4వేల వరకే..అది కూడా గుంటూరు మార్కెట్‌లో అమ్ముకున్న రైతులకే వర్తిస్తుంది. అన్ని జిల్లాల మిర్చి రైతులు గుంటూరు మార్కెట్‌కే వెళ్తుండడంతో పంటను అమ్ముకోవడానికి 10 రోజులు పడుతోంది. ఎండుమిర్చిని కనీసం రూ.8వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగకరం. ఉల్లికి కనీస మద్దతు ధర కనీసం రూ.1000 ఉండాలి. కందులకు రూ.7500 ధర ఉంటే రైతులకు ఊరట లభిస్తుంది. కొర్రలకు రూ.3500 ధర ఉండాలని రైతులు కోరుతున్నారు.
ధరలు గత ఏడాదికి ఇప్పటికీ వ్యత్యాసం..(క్వింటాల్‌కు)
పంట గతేడాది ప్రస్తుతం
కందులు 9,000 4,000
కొర్రలు 3,000 1,500
ఉల్లి 1,500 600
మిర్చి 10,000 2,000
రైతులు ఎలా బతకాలి
మాకు బోగోలు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది సాగు చేశాం. ఎకరాకు రూ.10వేల ప్రకారం రూ.40వేలు పెట్టుబడి పెట్టాం. దిగుబడి కేవలం నాలుగు ప్యాకెట్లు( 2 క్వింటాళ్లు) వచ్చింది. ఇంత అధ్వానపు దిగుబడి గతంలో ఎపుడూ లేదు. మార్క్‌పెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం రూ.5050 ధరతో అమ్ముకున్నాము. రూ.40వేలు పెట్టుబడి పెడితే కేవలం రూ.10100 చేతికి వచ్చింది. పెట్టుబడి కూడా రాకపోతే రైతులు ఎలా బతికేది?
పెట్టుబడి కూడ దక్కలేదు.... నాగేశ్వరరెడ్డి, రేమడూరు, కల్లూరు మండలం
ఎకరాల్లో మిర్చి సాగు చేశాము. పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షల వరకు వచ్చింది. మొదట 13 క్వింటాళ్లు వచ్చింది. అపుడు ధర కొంత ఆశాజనకంగా ఉంది. తర్వాత ధర పడిపోయింది. రెండు ఎకరాలపై 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధరలు లేకపోవడం వల్ల పెట్టుబడి కూడా రాలేదు. క్వింటాల్‌కు రూ.8500 ధర నిలకడగా ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: సత్యనారాయణచౌదరి, ఏడీఎం, కర్నూలు
ధరలు తగ్గాయన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఉల్లికి రూ.600 ప్రకారం మద్దతు ప్రకటించింది. కందులను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేశాం. ప్రస్తుతం మిర్చికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1500 మద్దతు ప్రకటించింది.
Advertisement
Advertisement