పెనుగాలి బీభత్సం
పెనుగాలి బీభత్సం
Published Mon, May 1 2017 10:26 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- కోత దశలో పంటలు నేలపాలు
- అన్నదాతకు లక్షలాదిగా నష్టం
- పరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి
జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి గాలి,వాన బీభత్సం సృష్టించింది. అందివచ్చిన పంటలపై తన ప్రతాపం చూపింది. రైతులను తీవ్ర నష్టానికి గురి చేసింది. ముఖ్యంగా అరటి, బొప్పాయి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు ఇలా నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తుగ్గలి: మండల పరిధిలోని ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రంగన్న సాగు చేసిన మూడెకరాల బొప్పాయి పంట పూర్తిగా నేలవాలింది. కోత దశలో ఉన్న మూడెకరాల బొప్పాయి తోట నేల కూలింది. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు కన్నీరుమున్నీరయ్యాడు. మొదటి కోతకు రూ.70వేలు వచ్చిందని, ప్రస్తుతం పంట మొదటి కోత కంటే మెరుగ్గా ఉండడంతో రెట్టింపు లాభం వస్తుందనకుంటే ఇలా నేలవాలిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంటలకు పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
సంజామల: పాలేరు వాగు వెంట సాగు చేసిన కోత దశలోని వరి పంట గాలి బీభత్సానికి పూర్తిగా నేలవాలింది. రెండు, మూడు రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ఇలా అకాల వర్షం నాశనం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలేరు వాగు వెంట సుమారు 500 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం కూడా అక్కడడక్క తడిచి పాడైపోయింది. అప్రమత్తమైన కొందరు రైతులు పట్టలు కప్పుకుని కాపడుకున్నారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురం, కోర్నపల్లె పరిధిలో సాగైన అరటి తోటలపై పెనుగాలి తీవ్ర ప్రభావం చూపింది. అబ్దులాపురానికి చెందిన వెంకట శివుడు(బాబు) ఏడెకరాల్లో సాగు చేసిన అరటి పంట రెండు వారాల్లో కోతలు కోయాల్సి ఉండగా గాలి ధాటికి కూలిపోయింది. రూ. 20లక్షలు చేతికొస్తుందనుకుంటే ఇలా గాలికి కూలిపోయిందని రైతు వాపోయాడు. అలాగే రెండు గ్రామాలకు చెందిన కిషోర్, విశ్వనాథరెడ్డి, రామనాథరెడ్డి, ఓబయ్య, చంద్రారెడ్డి తదితర రైతులకు చెందిన 56 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. కోటి రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌడ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య గౌడ్ దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. ఉద్యానవన శాఖాధికారి మదన్‌మోహన్‌గౌడ్, వ్యవసాయాధికారి సురేష్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఫకూర్ అహ్మద్, వీఆర్వో దస్తగిరి దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి బాధిత రైతులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement