సాక్షి, అమరావతి: పచ్చటి పంటలు పండాల్సిన పొలాల్లో చావు డప్పు మోగుతోంది. బ్యాంకుల్లో రుణాలు మాఫీ కాకపోవడం.. కొండల్లా పెరిగిపోతున్న అప్పుల భారం.. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి కారణాలతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటిదాకా 28 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కష్టాల సాగు చేయలేక అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదు. తనువు చాలించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం మాట అటుంచి.. కనీసం పరామర్శించేందుకైనా సీఎం, మంత్రులకు తీరిక చిక్కడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వృద్ధి నానాటికీ పెరిగిపోతోందంటూ కాకిలెక్కలు చెబుతూ కాలం గడిపేయడం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పాలకులు గుర్తించడం లేదు. కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తూ అన్నదాతలను మరణ శయ్యలపైకి తోసేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వెలుగులోకి వచ్చిన ఆత్మహత్యల సంఖ్య 28. బయటపడని బలవన్మరణాలు ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు.
నాలుగున్నరేళ్లలో 2,000 మంది..
రాష్ట్రంలోని 670 రెవెన్యూ మండలాలకు గాను 394 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 296 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రైతుల ఇళ్లల్లో ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉరికొయ్యలకు వేలాడుతున్నారని సాక్షాత్తూ ‘నాబార్డ్’ నివేదిక తేల్చిచెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో 2,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు వారి ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపిస్తున్నాయి.
యువ రైతులే అధికం
ఖరీఫ్ సీజన్ అధికారికంగా జూన్ 1న ప్రారంభమైంది. అదే నెల 27న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అట్టహాసంగా ఏరువాకకు శ్రీకారం చుట్టారు. రైతు చనిపోతే గరిష్టంగా రూ.2 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ తన పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికి దాదాపు 80 రోజులవుతోంది. ఒక్క రైతు కుటుంబానికైనా పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో రైతుల బలవన్మరణాలు చోటుచేసుకున్నాయి. అర్ధాంతరంగా కన్నుమూస్తున్న వారిలో యువ రైతులే అధికంగా ఉండడం గమనార్హం.
హామీలు మాఫీ
చనిపోయిన రైతులందరి గోస దాదాపు ఒకటే. తాను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణాల కోసం కుదువపెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. కొత్త అప్పులు పుట్టే మార్గం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆఖరికి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుల కత్తి మెడపై వేలాడుతుండడంతో దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు.
పరిహారం ఇవ్వకుండా మొండిచేయి
ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు సహజంగా చనిపోయినా రైతు బీమా పథకం కింద రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు చనిపోతే రూ.30 వేల పరిహారం వస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు రైతులు ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రకరకాల సాకులు, నిబంధనలతో పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదు.
బాబు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో వృద్ధి
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు చెబుతున్నాయి. 2014తో పోలిస్తే 2015లో రైతుల ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి. 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా, 2015లో 516కి పెరిగినట్టు ఎన్‌సీఆర్‌బీ చెబుతుండగా అంతకు రెండు రెట్లు ఎక్కువ ఉంటాయని రైతు సంఘాల పేర్కొంటున్నాయి. 2016, 2017లో కూడా రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment