గడ్డ కట్టిన ఎరువులే దిక్కా? | Fertilizer selling at a higher price than the market | Sakshi
Sakshi News home page

గడ్డ కట్టిన ఎరువులే దిక్కా?

Published Tue, Jun 20 2017 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

గడ్డ కట్టిన ఎరువులే దిక్కా? - Sakshi

గడ్డ కట్టిన ఎరువులే దిక్కా?

మార్క్‌ఫెడ్‌లో 2.50 లక్షల టన్నుల పాత యూరియా, డీఏపీ నిల్వలు
- ఏళ్లుగా నిల్వ ఉండడంతో గడ్డలుగా మారిన ఎరువులు
- మార్కెట్‌ కంటే అధిక ధరతో విక్రయాలు


సాక్షి, హైదరాబాద్‌: వానలు మొదలయ్యాయి.. రైతులు పంటల సాగు మొదలుపెడుతున్నారు.. వారికి అవసరమైన స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమూ ప్రకటించింది. కానీ రైతులకు సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్‌లో ఏళ్లుగా నిల్వ చేసిన ఎరువులు గడ్డకట్టుకుపోయాయి. అంతేకాదు బయట మార్కెట్లో లభిస్తున్న మంచి ఎరువులకన్నా.. ఈ గడ్డకట్టిన ఎరువులకు ఎక్కువ ధర వసూలు చేస్తుండడం గమనార్హం. దీంతో ప్యాక్స్‌గానీ, డీలర్లుగానీ, రైతులు గానీ ఆ ఎరువుల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.

భారీగా ఎరువుల నిల్వ..
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మార్క్‌ఫెడ్‌లో 201415 నుంచి ఇప్పటివరకు 2 లక్షల టన్నుల యూరియా.. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు కలిపి 50 వేల టన్నులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటి విలువ ఏకంగా రూ.260 కోట్లు. మూడేళ్లుగా ఈ ఎరువుల నిల్వలు అలాగే ఉండిపోవడం గమనార్హం.

ఈసారి ఎరువులు కొనని మార్క్‌ఫెడ్‌
ఈ ఏడాది కేంద్రం ఖరీఫ్‌ సీజన్‌ కోసం రాష్ట్రానికి 16 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది. అందులో యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ లక్షన్నర టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 5 లక్షల టన్నులు ఉన్నాయి. వీటికితోడు రిజర్వుగా మరో 50 వేల టన్నులు అందుబాటులో ఉంచనుంది. ఈ ఎరువులను మార్క్‌ఫెడ్‌ సహా ఇతర ప్రైవేటు కంపెనీలు రైతులకు విక్రయిస్తాయి. 16 లక్షల టన్నుల్లో.. మార్క్‌ఫెడ్‌ ద్వారానే 3 లక్షల టన్నులు విక్రయిస్తారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్‌), ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేస్తుంది. అయితే ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద 2.5 లక్షల టన్నుల పాత ఎరువులు నిల్వ ఉన్నాయి. అవన్నీ గత మూడేళ్లుగా పేరుకుపోయినవే.

ధర ఎక్కువే
చిత్రమేం టంటే మార్కె ట్లో వివిధ కంపెనీలు గరిష్ట విక్రయ ధర కంటే కూడా తక్కువకే ఎరువులు విక్రయిస్తున్నాయి. కానీ మార్క్‌ఫెడ్‌ మాత్రం తన వద్ద ఉన్న గడ్డకట్టిన పాత ఎరువులను కూడా ఎక్కువ ధరకు అమ్ముతోంది. మార్కెట్లో ప్రైవే టు కంపెనీలు యూరియా 50 కిలోల బస్తాను రూ.250కి విక్రయిస్తుండగా.. మార్క్‌ఫెడ్‌ గడ్డకట్టిన పాత యూరియాను రూ.35 అధికంగా రూ.285కు అమ్ముతోంది. అలాగే డీఏపీ 50 కిలోల బస్తా మార్కెట్లో రూ.1,025కు లభిస్తుం డగా.. మార్క్‌ఫెడ్‌ ధర రూ.45 ఎక్కువగా రూ.1,070గా ఉంది. కాంప్లెక్స్‌ ఎరువులను కంపెనీలు బస్తా రూ.830 చొప్పున విక్రయిస్తుంటే.. మార్క్‌ఫెడ్‌ గడ్డ కట్టిన కాంప్లెక్స్‌ ఎరువులను రూ.841కు అమ్ముతోంది.

అద్దె చెల్లింపుతోనూ భారం
మూడేళ్లుగా ఎరువులను గోదా ముల్లో నిల్వఉంచడం మార్క్‌ఫెడ్‌కు మరింత భారంగా మారుతోంది. మార్క్‌ఫెడ్‌కు 72వేల టన్నుల సామర్థ్యమున్న గోదాములు ఉన్నాయి. మిగతా ఎరువులను నిల్వ చేసేందుకు మార్కెట్‌ కమిటీలు, స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ వంటి వాటి గోదాములు అద్దెకు తీసుకున్నారు. ఇది భారం కానుంది.

గడ్డకట్టిన ఎరువుపై రైతుల అనాసక్తి
‘‘పాత యూరియా, డీఏపీ స్టాకు గడ్డకట్టి ఉంది. దాన్ని తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. దాంతో వాపసు పంపించాలని చెబుతున్నాం. ఈ అంశాన్ని మార్క్‌ఫెడ్‌ అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం. కొత్త సరుకు తెప్పిస్తామన్నారు..’’
పెంటారెడ్డి, డీసీసీబీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా

ఆ యూరియాతో పంటకు నష్టం
‘‘గడ్డ కట్టిన యూరియా వాడడం పంటలకు మంచిదికాదు. అయినా పాత సరుకును అధిక ధరకు కొనాల్సిన అవసరమేముంది? కొత్త సరుకునే కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నాయి. కాబట్టి మార్క్‌ఫెడ్‌ పాత ఎరువుల పంపిణీని నిలిపివేయాలి. రైతులను గందరగోళానికి గురిచేసి గడ్డకట్టిన యూరియా, డీఏపీని అంటగట్టకూడదు..’’
 ఇ.జనార్దన్‌రెడ్డి, సిద్దిపేట

పాత స్టాక్‌తో నష్టమేం ఉండదు
‘‘గడ్డ కట్టిన యూరియా, డీఏపీలతో పంటలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయితే బయటి మార్కెట్‌ కంటే మార్క్‌ఫెడ్‌ వద్ద అధిక ధర ఉన్న మాట వాస్తవమే. ధరలను తగ్గించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. వచ్చాక ఆ ప్రకారం విక్రయిస్తాం..’’ 
జగన్‌మోహన్,మార్క్‌ఫెడ్‌ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement