నాణ్యతకు పాతర
నాణ్యతకు పాతర
Published Tue, Jul 19 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
పుష్కర పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు
పుష్కర తరుణం ముంచుకొస్తోంది.. భక్తజన కోటి పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగను ఒక్కసారైనా తరించాలని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తోంది. దీనికి తగ్గట్టు ప్రభుత్వం నిధులైతే విడుదల చేసి తన పనైపోయినట్లు తూతూమంత్రంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ నీరంగా నీరసంతో నీరుగారుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారుల మామూళ్ల మత్తు.. హడావుడితో నాణ్యతకు పాతర పడుతోంది.
సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణానది ఒడ్డున 450 మీటర్ల పొడవునా ఘాట్ల నిర్మాణం చేపట్టారు. రెండు నెలల నుంచి పుష్కర పనులు నత్తనడకన కొనసాగించిన కాంట్రాక్టర్లు సమయం ముంచుకొస్తుండటంతో హడావుడిగా ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ల నిర్మాణంలో కూలీలు కాకుండా యంత్రాలు పని ఎక్కువగా చేయడంతో నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతోంది. అధికారులు కాంక్రీట్‌ను మిక్సింగ్ చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇది కంకర, సిమెంట్, ఇసుక, కావలసిన నీటిని ఏర్పరుచుకుంటుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ లెక్కా పత్రం లేకుండా ఇసుకను వేయడం, పరిమితికి మించి నీటిని వినియోగించటంతో ఘాట్ల నిర్మాణంలో ఆ కాంక్రీట్ నేలపై వేసినప్పుడు నీటితోపాటు సిమెంటు కూడా కొట్టుకుపోయి కంకరు, కొంత మేర ఇసుక మాత్రమే మిగులుతోంది.
ఎగుడుదిగుడుగా మెట్ల నిర్మాణం..
ఘాట్లలో ఏర్పాటు చేసే మెట్లు చిన్నది, పెద్దదిగా కట్టి యాత్రికులు దిగేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారేంటని అధికారులు ప్రశ్నిస్తే ప్లాస్టింగ్ చేసే సమయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తామని మాట దాటేస్తునారు. దీంతోపాటు ఘాట్ల నిర్మాణాలు చేసే సమయంలో ప్రతిఒక్క లారీలో వచ్చే సిమెంటుతో కూడిన కాంక్రీట్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఘాట్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల కాసులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారు. కనీసం జిల్లా అధికారులు కూడా రోజుకోసారి పరిశీలన జరుపుతున్నారే తప్ప ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని మాత్రం ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు. కాంక్రీట్ నిర్మాణం చేపట్టిన తర్వాత పది రోజులు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక దానిపై ఒకటి నిర్మాణం చేపడుతున్నారు. పుష్కరాల అనంతరం నిర్మించిన ఘాట్ల వద్ద పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కర కాలంపాటు కూడా ఈ ఘాట్లు ఉండవని, ఒక్కసారి వరద వస్తే ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement