ఆ భోజనం వద్దు బాబోయ్‌! | we dont iskcon food | Sakshi
Sakshi News home page

ఆ భోజనం వద్దు బాబోయ్‌!

Published Tue, Aug 2 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఆ భోజనం వద్దు బాబోయ్‌!

ఆ భోజనం వద్దు బాబోయ్‌!

  • ఇస్కాన్‌ భోజనాన్ని చెత్తబుట్ట పాలుచేస్తున్న విద్యార్థులు
  • ముద్దగా మారుతున్న అన్నం
  • పలచటి సాంబారు, మజ్జిగ
  • ఇళ్ల నుంచి క్యారేజీలు తెస్తున్న తల్లిదండ్రులు
  •  
    అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఇస్కాన్‌ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ దీనిని పఠిస్తుంటారు. అలాంటి ఇస్కాన్‌ సంస్థ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వండి, వడ్డిస్తున్న భోజనాన్ని ఆరగించలేక స్కూలు పిల్లలు ఆ ‘మధ్యాహ్న భోజనాన్ని’ నేలపాలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయమై ఆ సంస్థ ఇంతవరకూ కనీస దృష్టి సారించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.                                
          – కంబాలచెరువు (రాజమహేంద్రవరం)
    మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్కాన్‌ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. గతంలో ఇస్కాన్‌ మందిరం నుంచి వచ్చే భోజనం చాలా రుచి, శుచిగా ఉందన్న విద్యార్థులే.. నేడు ఆ భోజనాన్ని చెత్తబుట్టలో వేస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు రాజమహేంద్రవరం రూరల్, కోరుకొండ, సీతానగరం, రాజానగరం, కడియం ప్రాంతాల్లోని మొత్తం 43 ప్రభుత్వ స్కూళ్లకు ఇస్కాన్‌ ఈ భోజనాన్ని సరఫరా చేస్తోంది. వీరు సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో భుజించడం లేదు.
     
    ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి సారించిన ‘సాక్షి’.. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి, మధ్యాహ్న భోజనం పరిస్థితులను పరిశీలించింది. విద్యార్థులంతా తమ కంచాల్లో భోజనం వేయించుకుని, రెండు ముద్దలు తిని పక్కనున్న చెత్తబుట్టలో భోజనాన్ని పడవేయడం కనిపించింది. దీనిపై ఆ విద్యార్థులను అడగగా, అన్నం బాగాలేదని, సాంబారు బాగోలేదని సమాధానమిచ్చారు. స్కూలు వద్దకు ఇస్కాన్‌ వ్యాన్‌ తీసుకొచ్చిన భోజనాన్ని పరిశీలించగా, నీళ్ల సాంబారు, పలచటి మజ్జిగ, ముద్దలా మారిన అన్నం కనిపించాయి.
     
    ‘మధ్యాహ్న భోజనం’లో ప్లాస్టిక్‌
    పా్లస్టిక్‌ వాడకాన్ని అరికడతామని ప్రచారం చేస్తున్న విద్యాసంస్థల్లోనే మజ్జిగను ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఇస్కాన్‌ పంపించింది. నిత్యం సాంబారు అన్నం తినలేక, రుచిగా లేకపోవడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్ల నుంచే తమ పిల్లలకు భోజనం తెచ్చిపెడుతున్నారు. ఇస్కాన్‌ భోజనం ఉండగా, ఇంటి నుంచి ఎందుకు తెస్తున్నారని వారిని ప్రశ్నించగా, స్కూలులో పెట్టే భోజనం అసలు తమ పిల్లలు తినలేకపోతున్నారని, ఒక్కోసారి కడుపునొప్పి వస్తోందని బాధపడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇస్కాన్‌ భోజనం బాగాలేదని, మధ్యాహ్న భోజన పథకం నుంచి ఆ సంస్థను తొలగించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకమంది ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజమహేంద్రవరం వచ్చిన టీడీపీ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడికి కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఇస్కాన్‌ భోజనంపై విచారణ చేసి, చర్యలు చేపట్టాలని డీఈఓకు సూచించారు. దీనిపై ఆయా స్కూళ్ల హెచ్‌ఎంల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులను విద్యా శాఖాధికారులు తీసుకుంటున్నారు.
     
    హెచ్‌ఎంల ప్రశంసల వెనుక రహస్యం ఏమిటో?
    భోజనాన్ని విద్యార్థులు తినలేకపోతున్నా, వారంలో ఒకరోజే కూర, మిగతా రోజులన్నీ సాంబారు అన్నం పెడుతున్నా ఇస్కాన్‌ భోజనంపై ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు ప్రశంసల జల్లు కురిపిస్తూ లిఖితపూర్వకంగా విద్యాశాఖాధికారులకు లేఖలు రాస్తున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు సైతం విస్తుపోతున్నారు. దీనివెనుక అసలు కథ వేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం స్కూళ్లలో భోజనం చేసే విద్యార్థుల సంఖ్యను ముందుగా ఇస్కాన్‌కు అందించాలి. ఆ ప్రకారం వారు భోజనాలను తీసుకురావాలి. అసలు బాగోతమంతా ఇక్కడే ఉంది. ఇస్కాన్‌కు భోజనాలు చేసే విద్యార్థుల సంఖ్య ఒకరోజు ముందుగా పంపాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్కూలులో భోజనం చేసేది 500 మంది విద్యార్థులైతే, రెట్టింపు సంఖ్యలో లిస్టు పంపిస్తున్నారు. ఆ మేరకు భోజనాల బిల్లు నిర్వాహకులు, హెచ్‌ఎంల చేతికి చేరుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    ప్రభుత్వ నిబంధనల ప్రకారం  ఇస్కాన్‌ ఇవ్వాల్సిన భోజనం మెనూ
    సోమవారం రైస్, సాంబారు, మజ్జిగ
    మంగళవారం : రైస్, కాయగూరల కూర, మజ్జిగ
    బుధవారం : రైస్, బిర్యానీ, పుదీనా రైస్, టమోటా రైస్‌ (ఏదో ఒకటి), మసాల రైతా, మజ్జిగ
    గురువారం : రైస్, పప్పు ఆకుకూరతో, మజ్జిగ
    శుక్రవారం :  రైస్, సాంబారు, మజ్జిగ
    శనివారం : లెమన్‌ రైస్, పుదినా రైస్, టమోటా రైస్‌ (ఏదో ఒకటి), స్వీటు, మజ్జిగ
     
    మంచి భోజనం పెడుతున్నాం
    పిల్లలకు భోజనం బాగానే పెడుతున్నాం. ప్రభుత్వ మెనూ ప్రకారమే అందిస్తున్నాం. మేము సేవ చేస్తున్నాం. ఇస్కాన్‌ భోజనం బాగోలేదు అని వస్తున్న ఆరోపణలు నిజం కాదు.
    – శ్యామాంగ శ్రీనివాస్‌దాస్, నిర్వాహకుడు, ఇస్కాన్‌ భోజన పథకం
     
    చర్యలు తీసుకుంటున్నాం
    ఇస్కాన్‌ భోజనం బాగాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా ఉన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. భోజనం బాగా లేకపోతే ఇస్కాన్‌ను మధ్యాహ్న భోజనం పథకం నుంచి తప్పిస్తాం. హెచ్‌ఎంలు ఇస్కాన్‌ భోజనం బాగుందని ఇస్తున్నారనే దానిని పరిశీలించి, ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారిపైనా చర్యలు చేపడతాం.
    – ఎస్‌.అబ్రహాం, ఉప విద్యాశాఖాధికారి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement