అవినీతి బీటలు
-
పర్యాటక శాఖ పనుల్లో కానరాని నాణ్యత
-
పగుళ్లు తీస్తున్న వసతిగృహ సముదాయం గోడలు
-
రూ.కోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు
పిఠాపురం :
పర్యాటక శాఖ పనుల్లో అవినీతి బీటలు బయటపడుతున్నాయి. నిధులు మంజూరు చేసేది పర్యాటక శాఖ. పనులు జరిగేది దేవాదాయ శాఖ పరిధిలో. కానీ ఎవరికి వారే తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకోవడం.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నెలలు తిరగకుండానే నాణ్యత లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. టెంపుల్ టూరిజంలో భాగంగా పర్యాటక శాఖ పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులు మెరుగుపరచే పనులు చేపట్టింది. ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో రూ.1.77 కోట్లతో రిసెప్షన్, సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదులు, హోటల్ తదితర సౌకర్యాలతో వసతిగృహ సముదాయం నిర్మించింది. ఇందులో 8 గదులు ఒక డార్మిటరీ ఉన్నాయి. 2013లో ప్రారంభించిన ఈ పనులు 2014లో పూర్తి కావాలి. కానీ 2015లో పూర్తి చేశారు. దీని నిర్మాణం జరిగిన స్థలం చెరువు గర్భం కావడంతో ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టినా పునాది నుంచీ అత్యంత పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో ఏడాది తిరగకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. వసతిగృహ సముదాయంలో అన్ని సౌకర్యాలూ కల్పించాల్సి ఉండగా.. కేవలం గదులు మాత్రం నిర్మించి ఆలయ అధికారులకు పర్యాటక శాఖ అప్పగించింది. కరెంటు, మంచాలు, ఏసీలు, మంచినీరు, మోటార్లు తదితర సౌకర్యాలన్నింటినీ ఆలయ సొమ్ముతోనే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ భవన నిర్మాణ వ్యయంలో సుమారు రూ.కోటి వరకూ నిధులు పక్కదారి పట్టాయని, అందువల్లనే నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మించి ఏడాది కాకుండానే ఈ వసతిగృహ సముదాయంలో గదుల గోడలు బీటలు వారాయి. ఏ ఒక్క అధికారీ నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు చెల్లించడం పర్యాటక శాఖ పనుల్లో సర్వసాధారణం అయిపోయిందని, అందువల్లే ప్రతి నిర్మాణం ఇలా నాణ్యాతా లోపాలతో కొద్ది రోజుల్లోనే శిథిదిలావస్థకు చేరుకుంటోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
నాణ్యత లోపంపై చర్యలు తీసుకుంటాం
వసతిగృహ సముదాయం పనుల్లో నాణ్యత లోపాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. నాణ్యాత లోపాలుంటే చర్యలు తీసుకుంటాం. గోడలు బీటలు వారుతూంటే ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – జి.శ్రీనివాస్, ఈఈ, పర్యాటక శాఖ