ఇంకా అసంపూర్తిగా!
ఇంకా అసంపూర్తిగా!
Published Wed, Aug 10 2016 5:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ప్రధాన ఘాట్లూ పూర్తికాలేదు
పుష్కర నగర్‌లదీ అదే స్థితి
పెండింగ్‌లోనే విద్యుద్దీకరణ, సుందరీకరణ పనులు
సాక్షి, అమరావతి : పుష్కరాల గడువు రోజుల నుంచి గంటలకు వచ్చేస్తోంది. అయినా జిల్లాలో పుష్కర పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రధాన ఘాట్ల పనులూ ఇంకా పూర్తికాలేదు. పుష్కర నగర్‌లదీ అదే పరిస్థితి. భక్తులకు సౌకర్యాలు, వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో బ్యూటిఫికేషన్, విద్యుదీకరణ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన ఘాట్లయిన అమరావతి, సీతానగరం, పెనుమూడి సహా దాదాపు అనేక ఘాట్ల పరిస్థితి ఇలాగే ఉంది. విజయపురి సౌత్ నుంచి అమరావతి వరకు సాక్షి యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుపు ఘాట్ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్తు స్తంభాలు.. నీళ్లు వస్తే ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. పెనుమూడిలో అధికారులు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఘాట్ వద్దకు నీళ్లు అవకాశం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్‌ల పనులు నిర్వహిస్తున్నారు. కాంక్రీట్, విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. సీతానగరంలో టైల్స్ పనులు కొనసాగుతున్నాయి.
పుష్కర నగర్‌లలో పూర్తికాని ఏర్పాట్లు..
అమరావతిలో మూడు పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గుంటూరు గోరంట్లలో 10 వేల మంది భక్తులు ఉండేం దుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్ పనులు ఇంకా పూర్తికాలేదు. సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమరావతి ఆలయంలో సైతం దేవదాయ శాఖ పనులు సాగుతూనే ఉన్నాయి. ఘాట్లు, పుష్కరనగర్‌లకు నియమించిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లు, తహసీల్దార్లు పదో తేదీ నాటికి చేరుకుని విధుల్లో పాలుపంచుకోనున్నారు. పులిచింతల నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులు విధుల్లో చేరాక ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఘాట్ల పనులు పూర్తి కాకుండానే ట్రయల్‌రన్ నిర్వహించాలంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement